ఓటమిలోనూ గెలిచిన కావ్యా మారన్.. కన్నీటి వెనుక కనిపించిన క్రీడా స్ఫూర్తి
ఒక వైపు అభిమానుల ఆశలు.. మరోవైపు ఫైనల్ కలలు.. కానీ మైదానంలో మాత్రం అన్నీ తారుమారయ్యాయి.
By: A.N.Kumar | 28 May 2026 10:43 AM ISTఒక వైపు అభిమానుల ఆశలు.. మరోవైపు ఫైనల్ కలలు.. కానీ మైదానంలో మాత్రం అన్నీ తారుమారయ్యాయి. సీజన్ మొత్తం దూకుడుగా ఆడిన హైదరాబాద్ జట్టు కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేయడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దం మధ్యలో ఎక్కువగా కనిపించింది మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ ముఖంలోని బాధ.
మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు హైదరాబాద్ జట్టుపై ఎన్నో అంచనాలు వినిపించాయి. “ఈసారి కప్ ఖాయం” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గుజరాత్‌ను ఓడించి ఫైనల్ చేరి.. అక్కడ బెంగళూరును మట్టికరిపించి ట్రోఫీ అందుకుంటుందంటూ విశ్లేషకులు కూడా ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌పై ఇప్పటికే రెండు విజయాలు సాధించిన హైదరాబాద్‌కు ఇది మూడో విజయం అవుతుందని అందరూ భావించారు. కానీ క్రికెట్ మరోసారి తన అనిశ్చిత స్వభావాన్ని చూపించింది.
ఈ సీజన్‌లో హైదరాబాద్ చేతిలో వరుసగా రెండు సార్లు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్.. అత్యంత కీలకమైన సమయంలో అసలు సిసలైన ఆట చూపించింది. కేవలం గెలవడమే కాదు.. ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు హైదరాబాద్ మాత్రం ఒత్తిడిలో పూర్తిగా కుప్పకూలిపోయింది.
అభిషేక్ శర్మ నుంచి హెడ్ వరకు స్టార్ బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. భారీ స్కోర్లతో ప్రత్యర్థులను భయపెట్టిన బ్యాటింగ్ లైనప్.. ఈసారి మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. బౌలర్లు కూడా పరుగులు కట్టడి చేయలేకపోయారు. ప్రతి ఓవర్ ముగిసే కొద్దీ కావ్యా మారన్ ముఖంలో ఆవేదన మరింత స్పష్టంగా కనిపించింది.
కొన్ని సందర్భాల్లో ఆమె రెండు చేతులతో కళ్లను మూసుకుని కూర్చోవడం అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేసింది. కోపం.. బాధ.. నిస్సహాయత.. ఒకేసారి ఆమె ముఖంలో కనిపించాయి. జట్టు ఓటమి దిశగా సాగుతుండగా స్టేడియంలో ఉన్న ప్రతి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమాని మాదిరిగానే కావ్యా కూడా ఆ క్షణాలను తట్టుకోలేకపోయింది. కానీ అసలు గొప్పదనం అక్కడే మొదలైంది.
ఓటమి ఖాయమని అర్థమైన తర్వాత కూడా కావ్యా మారన్ తన భావోద్వేగాలను పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. గెలిచిన రాజస్థాన్ జట్టుకు చప్పట్లతో అభినందనలు తెలిపింది. మైదానంలోకి వెళ్లి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. “అద్భుతంగా ఆడావు” అన్నట్లుగా అతడి భుజం తట్టి అభినందించింది.
ఆ తర్వాత తన జట్టు ఆటగాళ్ల దగ్గరకు వెళ్లి నవ్వుతూ మాట్లాడింది. “గెలుపు-ఓటములు సహజం.. ఇలాంటి రోజులు కూడా వస్తాయి” అన్నట్లుగా వారిలో ధైర్యం నింపింది. మ్యాచ్ ఓడిపోయినా.. ఆటగాళ్ల మనోధైర్యం కోల్పోకుండా చూసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ఓటమిలోనూ ఇంత హుందాగా వ్యవహరించడం నిజమైన స్పోర్ట్స్‌మన్ స్పిరిట్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “కావ్యాను చూసి మిగతా జట్ల యాజమాన్యాలు నేర్చుకోవాలి” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రోఫీ గెలవకపోయినా.. ఆ రాత్రి కావ్యా మారన్ మాత్రం కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకుంది.
