డెత్ ఓవర్లలో ఎప్పుడూ ఆడలేదు.. ప్రాక్టీసూ చేయలేదు.. అభిషేక్ శర్మ నిజం ఒప్పుకున్నాడు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్.హెచ్) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.
By: A.N.Kumar | 22 April 2026 10:07 AM ISTఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్.హెచ్) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. బుధవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ సంచలనం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ విధ్వంసకర శతకంతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అభిషేక్ ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకోవడమే కాకుండా జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు.
హెన్రిచ్ క్లాసెన్‌ను అధిగమించి 'ఆరెంజ్ క్యాప్'
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన జట్టు సహచరుడు హెన్రిచ్ క్లాసెన్ (320 పరుగులు)ను వెనక్కి నెట్టి మొత్తం 323 పరుగులతో ప్రతిష్టాత్మకమైన 'ఆరెంజ్ క్యాప్'ను సొంతం చేసుకున్నాడు. టాప్ ఆర్డర్‌లో అభిషేక్ ఇస్తున్న మెరుపు ఆరంభాలు ఎస్‌ఆర్‌హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేసిన తీరు చూస్తుంటే ఈ సీజన్‌లో అతను ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్నాడో అర్థమవుతోంది.
వ్యూహాత్మక ఇన్నింగ్స్.. కోచ్ సలహా మేరకు..
సాధారణంగా పవర్‌ప్లేలో చెలరేగి ఆడి త్వరగా అవుట్ అయ్యే అభిషేక్ ఈ మ్యాచ్‌లో మాత్రం భిన్నమైన వ్యూహంతో ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న రహస్యాన్ని అతను వెల్లడించాడు. "కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్, లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ నన్ను 20 ఓవర్ల వరకు క్రీజులో ఉండాలని సూచించారు. బహుశా నేను ఒక ఇన్నింగ్స్‌లో పూర్తి స్థాయి ఓవర్లు ఆడటం ఇదే మొదటిసారి. అందుకే శతకం సాధించిన తర్వాత ఆ సెలబ్రేషన్ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది" అని అభిషేక్ పేర్కొన్నాడు.
డెత్ ఓవర్లపై ఫన్నీ కామెంట్స్
తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూనే అభిషేక్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెత్ ఓవర్లలో పరుగులు ఆశించిన స్థాయిలో రాకపోవడంపై స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే నేను డెత్ ఓవర్లలో ఎలా ఆడాలో సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు" అని నవ్వుతూ బదులిచ్చాడు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ "అభి నువ్వు పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను ముగించేస్తావు కదా.. ఇక డెత్ ఓవర్ల వరకు ఉండవని నీకూ తెలుసు.. అందుకే ప్రాక్టీస్ చేసి ఉండవు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
క్లాసెన్‌కు మద్దతుగా..
చివరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం కష్టమైందని అభిషేక్ ఒప్పుకున్నాడు. ఆ సమయంలో క్లాసెన్‌కు స్ట్రైక్ ఇవ్వడమే తన ప్రాధాన్యత అని చెప్పాడు. "డెత్ ఓవర్లలో క్లాసెన్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. నేను బౌండరీల కోసం ప్రయత్నించి వికెట్ పారేసుకోవడం కంటే.. సెట్ అయిన బ్యాటర్‌గా అతనికి స్ట్రైక్ రొటేట్ చేయాలని అనుకున్నాను" అని జట్టు ప్రయోజనాలే ముఖ్యమని వివరించాడు.
హోమ్ గ్రౌండ్ ప్రేమ..
ఉప్పల్ స్టేడియం తనకెంతో ఇష్టమని, ఇక్కడి ఆరెంజ్ ఆర్మీ ముందు ఆడటం ఎప్పుడూ ఒక మధురమైన అనుభూతినిస్తుందని అభిషేక్ అన్నాడు. "ఈ వికెట్ బ్యాటింగ్‌కు అంత సులభం కాదు, కానీ 230 పరుగుల పైచిలుకు స్కోరును ఇక్కడ కచ్చితంగా డిఫెండ్ చేయవచ్చు. మా ప్లాన్ ప్రకారం టాప్ త్రీలో ఒకరు చివరి వరకు ఆడాలి.. ఈ రోజు అది నేను చేసినందుకు సంతోషంగా ఉంది" అని ముగించాడు. అభిషేక్ శర్మ చూపిన ఈ అసాధారణ పోరాట పటిమ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్లే ఆఫ్ రేసులో మరింత పటిష్టమైన స్థితికి చేర్చింది.
