డబుల్ సూపర్ ఓవర్..సూపర్ థ్రిల్లర్ లో దక్షిణాఫ్రికా విన్నర్
టి20 ప్రపంచ కప్ ల చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్ లో డబుల్ సూపర్ ఓవర్ నమోదైంది. ఇంతకుముందు కప్ లలో ఒక సూపర్ ఓవర్ లోనే ఫలితం తేలింది. ఈసారి మాత్రం రెండో సూపర్ ఓవర్ పడింది.
By: Tupaki Political Desk | 11 Feb 2026 4:02 PM ISTసంచలనాలు లేకున్నా.. ఉత్కంఠభరిత మ్యాచ్ లతో సాగుతున్న టి20 ప్రపంచ కప్ లో బుధవారం అద్భుత సమరం... నువ్వా నేనా, ఢీ అంటే ఢీ, పోటా పోటీ అనే పదాలకు సరిపోయేట్లుగా దక్షిణాఫ్రికా-అఫ్ఘానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ డిలో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఛేజింగ్ లో అద్భుతంగా పోరాడిన అఫ్ఘానిస్థాన్ దాదాపు విజయం సాధిస్తుందా? అనిపించింది. కానీ, 187 పరుగుల వద్ద ఆగిపోయింది. 19.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. వాస్తవానికి వికెట్లు ఉండి ఉంటే అఫ్ఘానిస్థాన్ గెలిచి సంచలనం నమోదు చేసేదేమో? కానీ, సరిగ్గా 187 పరుగుల వద్ద ఆలౌట్ చేసింది దక్షిణాఫ్రికా. అసలు డ్రామా ఇక్కడి నుంచే మొదలైంది. విజేతను తేల్చడానికి ఒక సూపర్ ఓవర్, రెండో సూపర్ అవసరం అయ్యాయి. చివరికి రెండో సూపర్ ఓవర్ కూడా టై అవుతుందా? అనిపించింది. అయితే, కొద్దిలో ఆ పరిస్థితి తప్పింది. దక్షిణాఫ్రికాను విజయం వరించింది.
వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి..
టి20 ప్రపంచ కప్ ల చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్ లో డబుల్ సూపర్ ఓవర్ నమోదైంది. ఇంతకుముందు కప్ లలో ఒక సూపర్ ఓవర్ లోనే ఫలితం తేలింది. ఈసారి మాత్రం రెండో సూపర్ ఓవర్ పడింది. అదికూడా టై అయ్యేదే. త్రుటిలో మిస్ అయింది. లేదంటే మూడో సూపర్ ఆడించేవారు.
-ఇక మొదటి సూపర్ ఓవర్ లో అఫ్ఘానిస్థాన్ వికెట్లేమీ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఎంగిడి వేసిన ఈ ఓవర్ లో అజ్మతుల్లా ఓమర్జాయ్ 2 ఫోర్లు, సిక్సు కొట్టాడు. దక్షిణాఫ్రికా మాత్రం ఫజలుల్లా ఫారూఖీ బౌలింగ్ లో 5 బంతుల్లో వికెట్ నష్టానికి 11 పరుగుల వద్ద నిలిచింది. ఈ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్ సిక్స్ కొట్టి స్కోర్ సమం చేశాడు. దీంతో రెండో సూపర్ ఓవర్ అవసరమైంది.
-విజేత ఎవరో తేలేందుకు నిర్వహించిన రెండో సూపర్ ఓవర్ లో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేసింది. అజ్మతుల్లా వేసిన ఈ ఓవర్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు స్టబ్స్ ఒక సిక్సర్, మిల్లర్ రెండు సిక్సులు కొట్టడం అఫ్ఘాన్ కొంపముచింది.
అదే అఫ్ఘాన్ చేసిన తప్పు..
అఫ్ఘాన్ రెండో సూపర్ ఓవర్ లో ఘోరమైన పొరపాటు చేసింది. అంతకుముందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (42 బంతుల్లో 84, 4 ఫోర్లు, 7 సిక్సులు)ను కాదని... మొహమ్మద్ నబీని దింపాడు అఫ్ఘాన్ కోచ్ ట్రాట్. నబీ.. రెండు బంతులాడి పరుగులేమీచేకపోయాడు. ఔట్ అయ్యాడు.
4 బంతులు.. 18 పరుగులు
నబీ ఔట్ అనంతరం కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో గెలుపు కోసం 4 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో వచ్చిన గుర్బాజ్ వరుసగా మూడు సిక్సులు బాదాడు. కేశవ్ ఒక వైడ్ వేయడంతో చివరి బంతికి ఫోర్ కొట్టినా టై అయి మూడో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చేది. కానీ, కేశవ్ తెలివిగా నబీకి వేసినట్లుగానే వైడ్ లెంగ్త్ లో యార్కర్ వేయడంతో గుర్బాజ్ కు చాన్స్ లేకపోయింది. షాట్ ఆడబోయి అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా బతుకు జీవుడా అంటూ బయటపడింది.
-ఈ మ్యాచ్ లో తొలుత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో డికాక్ (59), రికెల్టన్ (61) రాణించారు. మిల్లర్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్ లో గుర్బాజ్ (84) తప్ప ఎవరూ ఆడలేదు. ఒమర్జాయ్ (22), కెప్టెన్ రషీద్ ఖాన్ (20) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
