Begin typing your search above and press return to search.

వైట్ జెర్సీ, టఫ్ సిచ్యుయేషన్… మంధాన ఎక్స్‌పీరియన్స్ వైరల్!

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కోసం సరైన ప్యాడ్స్, కంఫర్టబుల్ పీరియడ్ ప్యాంటీలను ఉపయోగించడం చాలా ముఖ్యం అని మంధాన సూచించారు.

By:  Madhu Reddy   |   9 Jun 2026 12:09 PM IST
వైట్ జెర్సీ, టఫ్ సిచ్యుయేషన్… మంధాన ఎక్స్‌పీరియన్స్ వైరల్!
X

మహిళా అథ్లెట్లు మైదానంలో సాధించే విజయాల వెనుక ఎవరికీ తెలియని ఎన్నో శారీరక ఇబ్బందులు, నొప్పులు దాగి ఉంటాయి. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళా క్రికెటర్లు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే కష్టాలపై బహిరంగంగా మాట్లాడారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు పీరియడ్స్ వస్తే ఆ టఫ్ సిచ్యుయేషన్‌ను ఎలా దాటుకు వస్తారో చెప్తూ.. మైదానంలో తనకు ఎదురైన ఒక ఎమోషనల్ సంఘటనను పంచుకున్నారు. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం..

వైట్ జెర్సీ వేసుకున్న వేళ ఆందోళన:

స్మృతి మంధాన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌లోని ఒక క్లిష్టమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. "ఒక మ్యాచ్‌లో నేను వైట్ జెర్సీ వేసుకుని ఉన్నప్పుడు హఠాత్తుగా పీరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో ప్యాడ్ ధరించేందుకు పరుగున వెళ్లాల్సి వచ్చింది. వైట్ డ్రెస్ కావడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే నా పరిస్థితిని అర్థం చేసుకున్న మహిళా అంపైర్ వెంటనే లోపలికి వెళ్లడానికి అనుమతించారు. నిజానికి ఐసీసీ నిబంధనల్లో పీరియడ్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి రూల్స్ లేవు" అని మంధాన చెప్పుకొచ్చారు.

దేశం కోసం ఆ నొప్పిని కూడా భరిస్తాం:

పీరియడ్స్ అనేవి మహిళలు క్రీడలను వదిలివేయడానికి అస్సలు కారణం కాకూడదని మంధాన పిలుపునిచ్చారు. "ఒకసారి దేశం కోసం జెర్సీ వేసుకుని మైదానంలోకి దిగాక.. మన పాత్రకు వంద శాతం న్యాయం చేయాలి. అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నప్పుడు పీరియడ్స్ నొప్పి వస్తున్నా, ఆ నొప్పులు అన్నింటినీ పక్కనపెట్టి కేవలం ఆట మీదే దృష్టి పెడతాం. ఇక దానికి పీరియడ్స్ అడ్డు కాకూడదు" అని ఆమె స్పష్టం చేశారు.

మంధాన పాటించే చిన్న చిన్న టిప్స్:

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కోసం సరైన ప్యాడ్స్, కంఫర్టబుల్ పీరియడ్ ప్యాంటీలను ఉపయోగించడం చాలా ముఖ్యం అని మంధాన సూచించారు. ఆ రోజుల్లో తాను తీసుకునే జాగ్రత్తల గురించి చెప్తూ.. మొదటి రెండు మూడు రోజులు ఫుడ్‌లో షుగర్ శాతాన్ని వీలైనంత తగ్గిస్తానని, రాత్రి వేళల్లో నొప్పులు తగ్గడానికి చిన్న చాక్లెట్ ముక్క తినడం వంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తానని ఆమె వెల్లడించారు.

మహిళల పీరియడ్స్ సమస్యల గురించి ఇలాంటి ఒక స్టార్ క్రికెటర్ పబ్లిక్‌గా మాట్లాడటం నిజంగా అభినందించదగ్గ విషయం. ఎంత నొప్పి ఉన్నా దేశం కోసం ఆడుతూ, స్టేడియంలో వేల మంది ముందు.. టీవీల్లో కోట్ల మంది చూస్తుండగా వాటన్నింటినీ తట్టుకుని సెంచరీలు కొట్టడం ఒక్క మహిళా క్రీడాకారిణులకే సాధ్యం.ఇక మంధాన మాటలు సమాజంలో పీరియడ్స్ పట్ల ఉన్న మొహమాటాన్ని పోగొట్టి, ఎంతో మంది యువ అథ్లెట్లలో ధైర్యాన్ని నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.