‘క్షమిస్తా.. కానీ మరిచిపోను’.. మైదానంలోనే కాదు.. జీవితంలోనూ స్మృతి మంధాన కొత్త పాఠం
క్రికెట్ మైదానంలో క్లాస్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను చెండాడే స్మృతి మంధాన.. నిజ జీవితంలోనూ అంతే పరిణతి చెందిన వ్యక్తిత్వం ఉన్న క్రీడాకారిణి.
By: A.N.Kumar | 14 Sept 2026 2:02 PM ISTక్రికెట్ మైదానంలో క్లాస్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను చెండాడే స్మృతి మంధాన.. నిజ జీవితంలోనూ అంతే పరిణతి చెందిన వ్యక్తిత్వం ఉన్న క్రీడాకారిణి. బ్యాట్‌తో పరుగులు సాధించడం ఎంత సులభంగా పూర్తి చేస్తుందో.. జీవితంలో ఎదురైన కఠిన సవాళ్లను కూడా అంతే నిబ్బరంతో ఎదుర్కొంటుంది. ఇటీవల ప్రముఖ కంటెంట్ క్రియేటర్ రాజ్ షమాని పాడ్‌కాస్ట్‌లో ఆమె పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు.. ఆమె ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తూ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.
ఆ ఒక్క రాత్రి.. భావోద్వేగానికి గురైన మంధాన
పాడ్‌కాస్ట్‌లో భాగంగా “మీ జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన రాత్రి ఏది?” అని ప్రశ్నించగా.. మంధాన క్షణం పాటు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత భావోద్వేగానికి గురవుతూ “వరల్డ్‌కప్ పరాజయం.. ఆ తర్వాతి రాత్రే నా జీవితంలో అత్యంత కఠినమైనది” అని చెప్పారు. అయితే పెళ్లి వరకూ వచ్చి ప్రియుడు మోసం చేయడంతో పెళ్లిన ఆపేసిన రోజును గుర్తు చేసుకొని స్మృతి ఏమోషనల్ అయ్యింది.. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ బ్రేకప్ గురించి మాత్రం ఇంటర్వ్యూలో చెప్పకుండా కన్నీళ్లతోనే టాపిక్ ను డైవర్ట్ చేయడం గమనార్హం.
అలాగే కోవిడ్ లాక్‌డౌన్ కాలాన్ని కూడా తన కెరీర్, జీవితంలో ఒక సవాలుతో కూడుకున్న దశగా అభివర్ణించారు. వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ మీడియా ముందుకు రానివ్వని ఆమె.. తన ప్రాధాన్యత ఎప్పుడూ దేశం కోసం ఆడే క్రికెట్ మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు.
మంధాన వ్యక్తిత్వంలో మరో కోణం: ప్రతీకారం వద్దు.. పరిణతి ముఖ్యం..
సంభాషణ కొనసాగుతుండగా తన స్వభావం గురించి మాట్లాడిన మంధాన గతంతో పోలిస్తే తన ఆలోచనల్లో వచ్చిన మార్పులను వివరించారు. ఒకప్పుడు త్వరగా కోపం వచ్చేదని.. ‘నాతో పెట్టుకోవద్దు’ అనే ధోరణి ఉండేదని చెప్పిన ఆమె.. కాలంతో పాటు తన ఆలోచనా విధానం మారినట్లు తెలిపారు. “నేను ఎవరి దారికీ అడ్డువెళ్లను.. అలాగే నా దారికి ఎవరూ అడ్డురాకపోవడమే మంచిది” అనే శైలిని ఇప్పుడు పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
క్షమిస్తా.. కానీ మరిచిపోను
సంభాషణలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం ఆమె చెప్పిన ఈ మాటలే “నేను ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోను. ఎవరికీ చెడు చేయను. నన్ను బాధపెట్టిన మనుషులను క్షమిస్తాను.. కానీ ఆ ఘటనను, పొందిన అనుభవాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోను” అని చెప్పారు.
ఆలోచింపజేస్తున్న మంధాన వ్యాఖ్యలు
సాధారణంగా క్రీడాకారులు తమ విజయాలు, రికార్డులు, ట్రోఫీల ద్వారా వార్తల్లో నిలుస్తారు. కానీ ఈసారి మంధాన తన క్లాస్ బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా, మానసిక బలం, ఆలోచనా సరళితో అందరి దృష్టినీ ఆకర్షించారు.
జీవితంలో దెబ్బతిన్న ప్రతిసారీ ప్రతీకారంతో రగిలిపోనవసరం లేదని, జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకుంటూ, ఇతరులను క్షమిస్తూనే మన సరిహద్దులను మనం కాపాడుకోవచ్చని ఆమె మాటలు నిరూపిస్తున్నాయి. మైదానంలో ప్రత్యర్థులను శ్లాగ్ చేసే మంధాన.. నిజ జీవితంలోనూ అందరికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.
