న్యూజిలాండ్ తో వన్డే సిరీస్..తెలుగోళ్లకు చాన్స్..శ్రేయస్ రీఎంట్రీ
ఇక నాడు తగిలిన దెబ్బకు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ కు అవకాశం దక్కింది. 2024లో జరిగింది కేవలం టెస్టు సిరీస్. కాబట్టి ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీస్ కు ఆ జట్టు భారత్ కు వస్తోంది.
By: Tupaki Entertainment Desk | 3 Jan 2026 7:00 PM ISTభారత్ లో భారత్ తో 2023 చివర్లో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి తీవ్రమైన దెబ్బకొట్టింది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు. అంతకుముందు 1980ల చివర్లో టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్ర ఉన్న కివీస్.. ఈసారి ఏకంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారత్ ను భారత్ లో క్లీన్ స్వీప్ చేసి సంచలనం రేపింది. అయితే, దీనికి న్యూజిలాండ్ ప్రతిభతో పాటు భారత జట్టులోని పరిస్థితులు కూడా కారణం అయ్యాయి. ఈ దెబ్బ అనంతరం ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన టీమ్ ఇండియా అక్కడా 1-3తో ఓడిపోయింది. దీంతో సీనియర్ బ్యాట్స్ మెన్, స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ల టెస్టు కెరీర్ ముగిసింది. ఇక నాడు తగిలిన దెబ్బకు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ కు అవకాశం దక్కింది. 2024లో జరిగింది కేవలం టెస్టు సిరీస్. కాబట్టి ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీస్ కు ఆ జట్టు భారత్ కు వస్తోంది. తొలిగా ఈ నెల 11న వన్డే ఆడనుంది. ఈ సిరీస్ కోసం శనివారం భారత జట్టును ప్రకటించారు.
షమీ లేడు.. సిరాజ్ తిరిగొచ్చాడు...
కొంతకాలంగా హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను టెస్టులకు మాత్రమే అన్నట్లుగా చూస్తోంది బీసీసీఐ. టి20ల్లో ఎలాగూ చోటివ్వడం లేదు కాబట్టి వన్డేలు ఆడిస్తారనుకుంటే చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తిరిగి జట్టులోకి తీసుకోలేదు. దీనిపై విమర్శలు సైతం వచ్చాయి. అయితే, టెస్టుల్లో కీలక బౌలర్ గా ఎదిగినందున అతడికి రెస్ట్ ఇచ్చారని కూడా భావించాలి. ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు సిరాజ్ ను మళ్లీ వన్డేల్లోకి తీసుకున్నారు. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ.. దేశవాళీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నా మొండిచేయి చూపారు.
హార్దిక్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి
2024 సెకండాఫ్ లో టీమ్ ఇండియా టి20 జట్టులోకి దూసుకొచ్చాడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఆ వెంటనే టెస్టుల్లోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టాడు. నిరుడు వన్డేలకూ అవకాశం ఇచ్చారు. కానీ, అతడి ప్రదర్శన పడిపోయింది. మూడు ఫార్మాట్లలో దేంట్లోనూ చోటు ఖాయం కాని పరిస్థితి. అయితే, న్యూజిలాండ్ తో సిరీస్ సీనియర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వడంతో పేస్ ఆల్ రౌండర్ కోటాలో అతడి బ్యాకప్ గా భావిస్తున్న నితీశ్ కు అవకాశం కల్పించారు.
శ్రేయస్ వచ్చేశాడు... పంత్ ను కరుణించారు
ఇటీవలి ఆస్ట్రేలియా టూర్ లో వన్డే మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి ఐసీయూలోకి వెళ్లిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోలుకుని న్యూజిలాండ్ తో సిరీస్ కు తిరిగొచ్చాడు. కేఎల్ రాహుల్ ఉన్నందున వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను వన్డే జట్టు నుంచి తప్పిస్తారనే కథనాలు వచ్చినా అతడికి మరో చాన్స్ కల్పించారు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను కొనసాగించారు. అయితే, ప్రతిభావంతుడైన రుతురాజ్ గైక్వాడ్ ను మాత్రం పక్కనపెట్టడం గమనార్హం. ఊహించినట్లే సీనియర్ పేసర్ బుమ్రాకు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు.
