బిగ్ బ్రేకింగ్.. టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ శుబ్ మన్ గిల్..!
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గా యువ బ్యాట్స్ మన్, టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ నియామకం ఖాయమైంది.
By: Tupaki Entertainment Desk | 4 Oct 2025 2:41 PM ISTటీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గా యువ బ్యాట్స్ మన్, టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ నియామకం ఖాయమైంది. ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న గిల్ ను వన్డే ఫార్మాట్ కూ సారథిగా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి.. ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు గిల్ కు బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే, రోహిత్ తో పాటు ఇటీవల టెస్టులకు గుడ్ బై చెప్పేసిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిని వన్డే జట్టులో కొనసాగిస్తూ సెలక్టర్లు వారిని గౌరవించనున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)లో చివరి మ్యాచ్ ఆడారు. ఆ టోర్నీ గెలిచాక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతూనే టెస్టులకు అనూహ్యంగా ఇద్దరూ ఒకరివెంట ఒకరు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు శుబ్ మన్ గిల్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు.
వారికి చాన్స్.. ఆఖరుదేనా?
38 ఏళ్ల రోహిత్, 37 ఏళ్ల కోహ్లి నిరుడు టి20 ప్రపంచ కప్ గెలిచాక ఆ ఫార్మాట్ నుంచి వైదొలగారు. ఈ ఏడాది మే నెలలో టెస్టులకూ వీడ్కోలు పలికారు. ఇప్పుడు మిగిలింది వన్డేలే. ఈ ఫార్మాట్ లో మ్యాచ్ లు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఉదాహరణకు మార్చిలో చివరి వన్డే ఆడిన భారత్.. మళ్లీ అక్టోబరులో ఆడుతోంది. వన్డే ప్రపంచ కప్ సైతం 2027లో జరగనుంది. యువతరం దూసుకువస్తుండగా మరో రెండేళ్లు రోహిత్, కోహ్లి కొనసాగుతారని భావించడం కష్టమే. ఈ లెక్కన వారిద్దరికీ ఇదే చివరి సిరీస్ అయినా ఆశ్చర్యం లేదు.
రోహిత్ కు చెప్పి...
కెప్టెన్ గా ఉన్నప్పటికీ రోహిత్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా టూర్ చివరి టెస్టులో తుది జట్టులో చోటు కోల్పోయాడు. దీంతోనే అతడికి ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక చేయరని అర్థమైంది. ఈ విషయం సెలక్టర్లు పరోక్షంగా కూడా చెప్పడంతో టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కోహ్లి విషయంలోనూ ఇంతే అనుకోవాలి. ఇప్పుడు వన్డేలకు మాత్రం జట్టులో వీరిద్దరికీ చోటు ఉంటుందని తెలుస్తోంది.
మూడు ఫార్మాట్లకూ గిల్ కెప్టెన్..
రోహిత్ వన్డే కెప్టెన్సీని గిల్ కు ఇస్తే... ఇక మిగిలింది టి20 ఫార్మాట్ పగ్గాలే. ఇటీవల ఆసియాకప్ (టి20) నెగ్గినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్ గా విఫలమయ్యాడు. గిల్ కు గత ఏడాది జింబాబ్వే టూర్ లో టి20 కెప్టెన్సీ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీలంక టూర్ కు అతడిని తప్పించి సూర్యను సారథిగా నియమించారు. ఇప్పుడు మాత్రం భారత్ లో వచ్చే జనవరిలో జరిగే టి20 ప్రపంచకప్ కు గిల్ ను కెప్టెన్ గా చేసినా ఆశ్చర్యంలేదు.
-భారత క్రికెట్ లో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండరు. ఇప్పుడు మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పిస్తే, ముందుముందు టి20ల సారథ్యం కూడా గిల్ కు అప్పగిస్తే మూడు ఫార్మాట్లకూ అతడే సారథి అవుతాడు.
