ఐపీఎల్ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు.. సారథ్యం అయ్యర్‌కే!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా టీ20 జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
By: A.N.Kumar | 8 May 2026 11:35 AM ISTభారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా టీ20 జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత టీ20 జట్టు పగ్గాలను స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించే దిశగా సెలెక్టర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్‌ను నియమించడం ద్వారా జట్టులో కొత్త జవజీవాలు నింపాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
భవిష్యత్ లక్ష్యాల దిశగా బీసీసీఐ అడుగులు
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2028 టీ20 వరల్డ్ కప్, అలాగే చారిత్రాత్మకమైన లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో జట్టును లాంగ్ టర్మ్ విజన్ ఉన్న యువ నాయకుడి చేతుల్లో పెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల నుంచే శ్రేయస్ అయ్యర్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
సూర్యకుమార్ యాదవ్.. విజయవంతమైన కెప్టెన్.. కానీ!
2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ సారథిగా అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. అతని నేతృత్వంలో భారత్ పలు ద్వైపాక్షిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవడంలోనూ సూర్య కెప్టెన్సీ కీలక పాత్ర పోషించింది. అయితే జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ వ్యక్తిగతంగా సూర్య ఇటీవలి కాలంలో బ్యాటర్‌గా ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని సిరీస్‌లుగా సూర్య స్థాయికి తగ్గట్టుగా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. కెప్టెన్సీ భారం అతని సహజసిద్ధమైన 'మిస్టర్ 360' ఆటతీరుపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సూర్య (35 ఏళ్లు) కంటే యువకుడైన అయ్యర్‌కు అవకాశం ఇవ్వడం మేలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
అయ్యర్ 'కెప్టెన్సీ' గ్రాఫ్ ఎలా ఉంది?
ప్రస్తుతం ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ తన నాయకత్వ పటిమతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పంజాబ్ జట్టును అగ్రస్థానంలో నిలబెట్టడంలో అతని వ్యూహాలు ఫలించాయి. ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం.. జట్టులోని యువ ఆటగాళ్లను సమన్వయం చేయడంలో అయ్యర్ సక్సెస్ అయ్యాడు. ఈ అంశాలే అతడిని కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉంచాయి.
ప్రకటన ఎప్పుడు?
ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మార్పు జరిగితే సూర్యకుమార్ యాదవ్ కేవలం సీనియర్ బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతాడు. అయితే వరుసగా ఐసీసీ ట్రోఫీలు అందిస్తున్న కెప్టెన్‌ను తొలగించడం సరైన నిర్ణయమేనా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది.
భారత క్రికెట్‌లో తరచుగా ఇలాంటి విప్లవాత్మక మార్పులు జరుగుతుంటాయి. శ్రేయస్ అయ్యర్ వంటి దూకుడున్న నాయకుడు వస్తే జట్టు మరింత పటిష్టమవుతుందని కొందరు అంటుంటే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా బీసీసీఐ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
