జమ్మూకశ్మీర్ ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందా? శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునే విషయంలో జమ్మూకశ్మీర్ క్రికెటర్లకు ప్రాంతీయ వివక్ష ఎదురవుతోందన్న ప్రచారాన్ని మాజీ భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించారు.
By: A.N.Kumar | 7 Sept 2026 9:16 PM ISTభారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునే విషయంలో జమ్మూకశ్మీర్ క్రికెటర్లకు ప్రాంతీయ వివక్ష ఎదురవుతోందన్న ప్రచారాన్ని మాజీ భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించారు. జాతీయ జట్టు ఎంపికలో ప్రాంతానికి ఎలాంటి స్థానం ఉండదని.. కేవలం ప్రతిభ, మైదానంలో చేసే స్థిరమైన ప్రదర్శనే ప్రధాన ప్రమాణాలని ఆయన స్పష్టం చేశారు. శ్రీనగర్‌లో నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ధావన్.. జమ్మూకశ్మీర్ నుంచి జాతీయ జట్టుకు తక్కువ మంది ఆటగాళ్లు ఎందుకు ఎంపికవుతున్నారనే అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు.
నిరంతరం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఏ ఆటగాడినైనా సెలెక్టర్లు ఖచ్చితంగా గుర్తిస్తారని ధావన్ తెలిపారు. జాతీయ జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని.. ఢిల్లీ, ముంబై వంటి పెద్ద పెద్ద క్రికెట్ కేంద్రాల నుంచి వచ్చే ప్రతిభావంతులకు కూడా కొన్నిసార్లు అవకాశాలు దక్కవని ఆయన ఉదాహరించారు. కాబట్టి ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, కష్టపడి ఆడటంతో పాటు క్రికెట్ కెరీర్‌లో కొన్నిసార్లు అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్‌లో క్రికెట్ మౌలిక వసతులు, పోటీ స్థాయి బాగా మెరుగుపడ్డాయని ధావన్ ప్రశంసించారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ప్రతిభ వెలుగులోకి వస్తోందని అన్నారు. యువ ఆటగాళ్లకు ఉన్నత స్థాయి మ్యాచ్‌లు ఆడటం ద్వారా మరింత ఎక్స్‌పోజర్ లభిస్తే వారు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడం చారిత్రాత్మక ఘట్టమని.. ఈ విజయంతో అక్కడి ఆటగాళ్ల సత్తా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అభినందించారు. అయితే ఇదే స్థాయి ప్రదర్శనను భవిష్యత్తులోనూ కొనసాగించాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉందన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రో స్టార్ క్రికెట్ లీగ్ కమిషనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్, రంజీ, దులీప్ ట్రోఫీ వంటి అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆటగాడు ఎక్కడి నుంచి వచ్చాడనేది కాకుండా అతని కష్టపడే తత్వమే ముఖ్యమని పేర్కొన్నారు. రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శన చేసి భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన జమ్మూకశ్మీర్ పేసర్ ఔకిబ్ నబీ ఉదాహరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2027 మార్చి మొదటి వారంలో శ్రీనగర్‌లో ప్రారంభమై డెహ్రాడూన్‌లో ఫైనల్ జరగనున్న పీఎస్.సీఎల్ సీజన్-2 లీగ్‌కు శిఖర్ ధావన్, పర్వేజ్ రసూల్‌లను ఐకానిక్ ప్లేయర్లుగా ప్రకటించారు. సెలెక్షన్లపై అనుమానాలకు నిలకడైన ప్రదర్శనే ఏకైక సమాధానమని ధావన్ యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు.
