అర్జున్ టెండూల్కర్ పాకిస్తాన్‌లో ఉండి ఉంటే.. భారత్ మెరిట్‌పై షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు!
భారత క్రికెట్‌లో పారదర్శకతను వివరించడానికి అఫ్రిది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ఒక ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నారు.
By: Sivaji Kontham | 11 Jun 2026 7:00 PM ISTభారత, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఉన్న వ్యత్యాసాలపైనా.. ఆటగాళ్ల ఎంపిక విధానంపైనా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌కు, భారత క్రికెట్‌కు అసలు పోలికే లేదని స్పష్టం చేశారు. టీమిండియాలో ప్రతిభ(మెరిట్)కు ఇచ్చే ప్రాధాన్యత వల్లే వారు ప్రపంచంలోనే అత్యుత్తమ టీమ్‌గా దూసుకుపోతున్నారని... అదే సమయంలో పాకిస్తాన్‌లో మాత్రం బంధుప్రీతి (ఫేవరిటిజం) ఎక్కువగా ఉండటం వల్లే జట్టు వెనుకబడిపోతోందని అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత క్రికెట్‌లో పారదర్శకతను వివరించడానికి అఫ్రిది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ఒక ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నారు. సచిన్ అంతటి గొప్ప ఆటగాడి కుమారుడైనా అర్జున్ టెండూల్కర్‌కు భారత జట్టులో లేదా ఐపీఎల్‌లో ఎలాంటి ప్రత్యేక రాయితీలు దక్కలేదని ఆయన గుర్తు చేశారు. అర్జున్ గత మూడు, నాలుగేళ్లుగా ఐపీఎల్‌లో ఒక భాగంగా ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు ఆడింది కేవలం కొన్ని మ్యాచ్‌లు మాత్రమే. భారత జాతీయ జట్టు సంగతి పక్కన పెడితే ఐపీఎల్‌లో కూడా అతడికి క్రమం తప్పకుండా అవకాశాలు రావడం లేదు! అని అఫ్రిది వ్యాఖ్యానించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సచిన్ కొడుకు అనే ట్యాగ్ ఉన్నా... అర్జున్ టెండూల్కర్ మిగతా సాధారణ ఆటగాళ్లలాగే బెంచ్‌కే పరిమితమై మైదానంలో సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ (నీళ్లు) అందిస్తున్న విషయాన్ని అఫ్రిది ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌లో ఎంతటి సెలబ్రిటీ వారసుడైనా సరే ప్రతిభ చూపిస్తేనే తప్ప జట్టులో స్థానం దక్కదని చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఆయన కొనియాడారు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ చూసి భారత్‌లో ఎవరికీ అవకాశాలు ఇవ్వరనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) లోని లోపాలను, ఎంపిక విధానాలను అఫ్రిది తీవ్రంగా ఎండగట్టారు. ఒకవేళ అర్జున్ టెండూల్కర్ కనుక పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే ఈపాటికి ఆయన అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం (డెబ్యూ) చేసి ఉండేవాడు. ఇక్కడ ఉండే ఫేవరిటిజం సంస్కృతికి ప్రతి మ్యాచ్ లోనూ ఆయనకు ఆడే అవకాశం ఇచ్చేవారు! అని అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో అర్హత లేకపోయినా రికమండేషన్లతో ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటారనే విషయాన్ని అతడు ఒప్పుకున్నారు.
భారత జట్టు ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగడానికి... పాకిస్తాన్ జట్టు రోజురోజుకూ దిగజారిపోవడానికి ఈ ఎంపిక విధానమే ప్రధాన కారణమని అఫ్రిది విశ్లేషించారు. భారత్‌లో కేవలం ప్రతిభ ఆధారంగానే న్యాయంగా ఎంపికలు జరుగుతాయని.. అందుకే వారు విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. ఈ తరహా కఠినమైన - పారదర్శకమైన నిర్ణయాలు పాకిస్తాన్ క్రికెట్‌లో రానంత వరకు తమ జట్టు ముందడుగు వేయడం కష్టమని అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.
