Begin typing your search above and press return to search.

ఇక ఆమెను ఆపడం ఎవరివల్లా కాదు.. భ‌యం లేని లేడీ రోహిత్ శ‌ర్మ‌!

భయం లేని బ్యాటింగ్‌ శైలితో ప్రేక్షకులను, క్రికెట్ విశ్లేషకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ఇన్నింగ్స్ త‌న‌ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది.

By:  Sivaji Kontham   |   21 Sept 2026 4:52 PM IST
ఇక ఆమెను ఆపడం ఎవరివల్లా కాదు.. భ‌యం లేని లేడీ రోహిత్ శ‌ర్మ‌!
X

అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ సంచలనం షఫాలీ వర్మ మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది. తన తొలి టీ20 అంతర్జాతీయ శతకంతో క్రీడా ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఈ క్రికెట‌ర్ తనదైన శైలిలో ఎదురుదాడి చేస్తూ ఈ ఘనత సాధించింది. భయం లేని బ్యాటింగ్‌ శైలితో ప్రేక్షకులను, క్రికెట్ విశ్లేషకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ఇన్నింగ్స్ త‌న‌ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది.

ఈ రికార్డు ఇన్నింగ్స్ తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులు, తోటి క్రీడాకారులు ప్రశంసల వర్షం కురిపించారు. స్మృతి మంధాన, స్నేహ్ రాణా, డాని వ్యాట్, ఈవ్ జోన్స్ వంటి ప్రముఖ మహిళా క్రికెటర్లు షెఫాలీని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అభిమానులు త‌న‌ను ఎంతో ప్రేమగా `మాస్టర్ షిఫు` అని పిలుస్తూ ఈ శతకం 22ఏళ్ల షెఫాలి కఠిన శ్రమకు తగిన ఫలితమని కొనియాడారు. కేవ‌లం 49 బంతుల్లో శ‌త‌కం బాదిన తీరుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఏషియ‌న్ గేమ్స్ సెమీ ఫైన‌ల్స్ లో 9 సిక్స‌ర్లు, 3 బౌండ‌రీల‌తో సంచ‌ల‌న ఆటతీరును ప్ర‌ద‌ర్శించారు షెఫాలీ.

పురుషుల క్రికెట్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని పోలి ఉండే ఆమె ఆటతీరును చూసి అభిమానులు ``మహిళా రోహిత్ శర్మ``గా, అసలైన ``హిట్ ఉమెన్``గా అభివర్ణించారు. ``హర్యానా హరికేన్``..``దేశ్ కీ షెర్నీ`` వంటి బిరుదులతో అభిమానులు ఈ యువ‌క్రీడాకారిణిని ప్రశంసించారు. షెఫాలీ బ్యాటింగ్ చూడటం కంటికి ఎంతో ఇంపుగా ఉందని.. అసలైన ప్రశాంతతను ఇస్తుందని నెటిజన్లు కామెంట్లు చేశారు.

కేవలం పరుగులు చేయడమే కాకుండా.. ఒత్తిడిలోనూ తన దూకుడును ప్రదర్శించడంలో షఫాలీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ సెంచరీ కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో ఈ యువ‌క్రికెట‌ర్ మరిన్ని అద్భుత రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ``ఇక ఆమెను ఆపడం ఎవరివల్లా కాదు`` అంటూ క్రీడా ప్రియులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు.

క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న అభినందనల న‌డుమ‌ ఈ తొలి టీ20 శతకం షఫాలీ వర్మ కెరీర్‌లో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ఇది కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుపై ఒక వ‌ర్ధ‌మాన క్రీడాకార‌ణి చూపుతున్న ప్రభావానికి నిదర్శనం. అంకితభావం, భయం లేని ఆటతీరుతో షెఫాలీ తదుపరి అడుగులు వేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.