పాక్ పీఎం చెక్స్ బౌన్స్... మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
అవును... తమ దేశంలో క్రికెటర్ల పరిస్థితిపై మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి.
By: Raja Ch | 1 Oct 2025 11:49 AM ISTఆసియా కప్ ఫైనల్స్ లో దాయాదీ పాకిస్థాన్ ను ఓడించి ఘన విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ రూ.21 కోట్ల రివార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2009లో పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆ దేశ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... తమ దేశంలో క్రికెటర్ల పరిస్థితిపై మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. ఇందులో భాగంగా... 2009లో లార్డ్స్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో శ్రీలంకను ఓడించి యూనిస్ ఖాన్ నేతృత్వంలోని జట్టు టోర్నమెంట్ రెండవ ఎడిషన్ ను గెలుచుకుంది.
ఆ సమయంలో అప్పటి తమ ప్రధాన మంత్రి యూసుఫ్ రజా గిలానీ నుండి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కు అందిందని, కానీ ఆటగాళ్ళు దానిని నగదుగా మార్చడానికి వెళ్ళినప్పుడు చెక్కు బౌన్స్ కావడంతో వారికి డబ్బు అందలేదని అజ్మల్ పేర్కొన్నారు. ఆ టోర్నమెంట్ తర్వాత తమకు లభించిన ఏకైక డబ్బు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి వచ్చిందని తెలిపారు.
ఇదే సమయంలో... స్వయంగా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రభుత్వ చెక్కు కూడా బౌన్స్ అవుతుందని తెలిసి తాను షాక్ అయ్యానని కొనసాగించిన అజ్మల్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చీఫ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు.
కాగా... టీంఇండియా ఇప్పటి వరకు అత్యధికంగా తొమ్మిదిసార్లు ఆసియా కప్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పాకిస్థాన్ కేవలం రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచింది. భారత జట్టు ఏడుసార్లు వన్డేఫార్మాట్లో, రెండుసార్లు టీ20 ఫార్మాట్లో సొంతం చేసుకుంది.
భారత్, పాక్ ఇప్పటి వరకు ఆసియా కప్ లో 22 సార్లు తలపడ్డగా అందులో టీంఇండియా 13 సార్లు విజయం సాధిస్తే.. 6 సార్లు మాత్రం పాకిస్థాన్ గెలిచింది. మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
