391 మ్యాచ్ లు...రో-కో కొడితే కొండంత రికార్డులైనా బద్దలు
రోహిత్-కోహ్లి 101 ఇన్నింగ్స్ లో 19 సార్లు వందకుపైగా పార్ట్ నర్ షిప్ లు నెలకొల్పారు. ఇదీ ఓ రికార్డే. ఎవరూ అందుకోలని మైలురాయే.
By: Tupaki Political Desk | 25 Oct 2025 6:12 PM ISTమాజీ కెప్టెన్లు, టీమ్ ఇండియా బ్యాటింగ్ స్టార్లు రోహిత్ శర్మ -విరాట్ కోహ్లి (రో-కో) ఇప్పటివరకు కలిసి ఆడిన మ్యాచ్ లు 391. ఇది దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్ -రాహుల్ ద్రవిడ్ కలిసి ఆడిన మ్యాచ్ ల సంఖ్యతో సమానం. రో-కో మూడు ఫార్మాట్లలోనూ కలిసి బరిలో దిగారు. సచిన్-ద్రవిడ్ కు టి20ల్లో ఈ అవకాశం దక్కలేదు. సచిన్, ద్రవిడ్ లు కెరీర్ లో ఒక్కటే అంతర్జాతీయ టి20 ఆడారు. అదికూడా విడివిడిగా కావడం గమనార్హం. కానీ, రోహిత్-కోహ్లి అలా కాదు మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఇప్పటికే 391 మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లోనే వీరిద్దరూ కలిసి కొనసాగుతున్నారు. వచ్చే జనవరి వరకు వీరు మరో ఆరు వన్డేలు ఆడనున్నారు. దీంతో 397 మ్యాచ్ లతో దేశం తరఫున అత్యధిక సార్లు బరిలో దిగిన క్రికెట్ జంటగా రికార్డులకు ఎక్కుతారు.
కలిపి కొడితే..
రోహిత్-కోహ్లి.. ఓపెనర్, వన్ డౌన్ బ్యాటర్లు కాబట్టి చాలా ఎక్కువ పరుగులు చేసే అవకాశం దక్కింది. తాజాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 170 బంతుల్లో 168 పరుగులు జోడించారు. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 150 ఆ పైన భాగస్వామ్యం నెలకొల్పిన సచిన్ టెండూల్కర్-మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డు (12)ను సమం చేశారు.
50 సెంచరీల రోహిత్..
రోహిత్-కోహ్లి 101 ఇన్నింగ్స్ లో 19 సార్లు వందకుపైగా పార్ట్ నర్ షిప్ లు నెలకొల్పారు. ఇదీ ఓ రికార్డే. ఎవరూ అందుకోలని మైలురాయే. ఇక రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్ లో 50 సెంచరీని అందుకున్నాడు. వన్డేల్లో 33, టి20ల్లో రికార్డు స్థాయిలో ఐదు, టెస్టుల్లో 12 సెంచరీలు చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీల అరుదైన రికార్డు రోహిత్ పేరిటే ఉండడం విశేషం. ఆస్ట్రేలియాతో తాజా వన్డే సిరీస్ లో 202 పరుగులు చేసిన రోహిత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గఆ నిలిచాడు.
కోహ్లి సచిన్ ను దాటాడు..
-వన్డేలు, టి20ల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కోహ్లి రికార్డులకు ఎక్కాడు. శనివారం నాటి మ్యాచ్ లో కోహ్లి (74నాటౌట్) పరుగులు చేశాడు. దీంతో రెండు ఫార్మాట్లలో కలిపి 18,437 పరుగులు చేసినట్లయింది. సచిన్ (18,436)ను దాటేశాడు. సచిన్ వన్డేల్లో 18,426 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఏకైక టి20 ఆడి అందులో 10 పరగులు చేశాడు. కోహ్లి వన్డేల్లో 14,255, టి20ల్లో 4,188 పరుగులు సాధించాడు. సచిన్ టెస్టుల్లో (15,921)నూ టాప్ లో ఉన్నాడు. కోహ్లి టెస్టు పరుగులు 9,230.
-వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ దే. అయితే, కోహ్లి తాజా మ్యాచ్ తో (14,235) రెండో స్థానానికి చేరాడు. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (14.234)ను అధిగమించాడు.
