రోహిత్-కోహ్లి చివరి మ్యాచ్.. రోదించిన ఆస్ట్రేలియా కామెంటేటర్
రోహిత్, కోహ్లిలకు సాధారణ యువత, క్రికెట్ అభిమానుల్లోనే కాదు కామెంటేటర్లలోనూ అభిమానులు ఉన్నారని స్పష్టమైంది.
By: Tupaki Political Desk | 27 Oct 2025 8:14 PM ISTటీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి మ్యాచ్ ఆడేశారు. అదేంటి.. వారింకా వన్డేలకు వీడ్కోలు పలకలేదు కదా..? మొన్ననే కదా ఆస్ట్రేలియాతో వన్డే ఆడారు.. అప్పుడే రిటైర్మెంట్ ఎప్పుడిచ్చారు..? అనుకుంటున్నారా? అవును.. వీరిద్దరూ చివరి మ్యాచ్ ఆడేశారు.. అయితే, అది కెరీర్ లో కాదు.. ఆస్ట్రేలియాలో. సహజంగా టెస్టు సిరీస్ కోసం భారత జట్టు మూడేళ్లు లేదా నాలుగేళ్లకోసారి ఆస్ట్రేలియాలో టూర్ చేస్తుంది. ఆస్ట్రేలియా జట్టు కూడా మన దేశానికి మూడునాలుగేళ్లకోసారి వస్తుంది.
మధ్యలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టోర్నీలు సరేసరి. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియా టూర్ ముగించేసింది. అంటే ఈ లెక్కన మరో మూడేళ్ల తర్వాతే ఆ దేశానికి వెళ్తుంది. అదీ టెస్టుల కోసమే. 38 ఏళ్ల రోహిత్, 37 ఏళ్ల కోహ్లి టెస్టులకు ఇప్పటికే వీడ్కోలు పలికారు. వన్డేల్లోనే ఆడుతున్నారు. మళ్లీ వన్డేల కోసం ఆస్ట్రేలియా టూర్ సమయానికి వీరిద్దరూ టీమ్ఇండియాలో ఉండడం కష్టమే కదా?
భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా..
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ (రో-కో)లకు భారత్ లోనే కాదు ప్రపంచం అంతటా అభిమానులున్నారు. తాజాగా రోహిత్ ఆస్ట్రేలియా వెళ్లిన సమయంలో అతడి కోసం అభిమానులు హోటల్ కు వచ్చారు. రోహిత్, రోహిత్ అంటూ పలకరించారు. విరాట్ కోహ్లికీ అంతే..! అతడు ఏ దేశం వెళ్లినా మైదానంలో అభిమానులు కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా నినాదాలు చేస్తుంటారు.
కామెంటేటర్లలోనూ అభిమానులు..
రోహిత్, కోహ్లిలకు సాధారణ యువత, క్రికెట్ అభిమానుల్లోనే కాదు కామెంటేటర్లలోనూ అభిమానులు ఉన్నారని స్పష్టమైంది. గత శనివారం వీరిద్దరూ ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో సెంచరీ, అర్ధ సెంచరీ చేసి అజేయంగా నిలిచారు. జట్టును కూడా గెలిపించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ రెండూ రోహిత్ కే దక్కాయి. మ్యాచ్ అనంతరం అతడు, రోహిత్ మాట్లాడుతూ తాము మళ్లీ ఆటగాళ్లుగా ఆస్ట్రేలియా వస్తామో లేదోనని వ్యాఖ్యానించారు. ఇక ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా చేసిన ఓ వ్యక్తి రోహిత్-కోహ్లిలకు ఆస్ట్రేలియాలో ఇదే చివరి మ్యాచ్ అని తలచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇది చూసి నెటిజన్లు ఔరా? అని అంటున్నారు. ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రతిభతో సాధించిన గుర్తింపు ఇదని కొనియాడుతున్నారు.
ఎక్కడి రోహిత్.. ఎక్కడి కోహ్లి... ఎక్కడి ఆస్ట్రేలియా కామెంటేర్..? ఏదో ఒక బంధం.. లేకపోతే ఒక కామెంటేటర్ ఇంత భావోద్వేగానికి గురవుతారా? ఔను ఆ బంధం పేరు క్రికెట్...!
