రాణించిన రో-కో ద్వయం... 1986 తర్వాత ఇదే తొలిసారి!
టీమ్ ఇండియా ఈ లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా... 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
By: Raja Ch | 25 Oct 2025 5:13 PM ISTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి రెండు వన్డేల్లోనూ తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఓడిపోవడం ఒకెత్తు.. రోహిత్ శర్మ – విరాట్ కొహ్లీ ద్వయం విఫలమవ్వడం ఒకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రధానంగా కొహ్లీ రెండు మ్యాచులలోనూ ఖాతా తెరవరకపోవడం రకరకాల కామెంట్లు, విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో వారిద్దరూ బ్యాట్ తోనే వాటికి సమాధానం చెప్పారు.
అవును... తొలి రెండు మ్యాచ్ లలోను ఓటమి చవిచూసిన టీమిండియా మూడో మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ తొలుత 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటవ్వగా.. టీమ్ ఇండియా ఈ లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా... 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలి రెండు వన్డేల్లో నిరాశపరిచినా...!:
టీమిండియా ఆస్ట్రేలియా టూర్ లో అందరి కళ్లూ విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలపై ఉన్నాయని చెప్పినా అది అతిశయోక్తి కాదేమో. అయితే.. ఫస్ట్ మ్యాచ్ లో 14 బంతుల్లో 8 పరుగులు మాత్రమే రోహిత్ శర్మ చేయగా.. 8 బంతులు ఆడిన కొహ్లీ డకౌట్ గా వెనుదిరిగిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 7 వికెట్లతో భారత్ పై గెలిచింది.
ఇక రెండో వన్డేలో రోహిత్ శర్మ 97 బంతుల్లో 73 పరుగులు చేసినా.. కింగ్ కొహ్లీ మాత్రం మళ్లీ నిరాశ పరిచాడు. ఇందులో భాగంగా... 4 బంతులు ఆడిన కొహ్లీ మరోసారి డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో కొహ్లీపై రకరకాల విశ్లేషణలు, కామెంట్లు మొదలైపోయాయి. ఇక రిటైర్మెంటే అంటూ అతని ఎక్స్ ప్రెషన్స్ పై అనాలసిస్ లు వినిపించాయి.
మూడోసారి బ్యాట్ తోనే సమాధానం..!:
రో-కో ద్వయం మొదటి వన్డేలో ఫెయిల్ అవ్వడంతో విమర్శకులు తమ క్రియేటివిటీకి పని చెప్పారు! అయితే.. రెండో వన్డేలో రోహిత్ శర్మ రాణించినా.. కొహ్లీ మాత్రం డకౌట్ కంటిన్యూ చేశాడు. ఈ గ్యాప్ లో రిటైర్మెంట్ వ్యాఖ్యానాలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో మూడో వన్డే రానే వచ్చింది. మళ్లీ అందరి కళ్లూ కొహ్లీ వైపు చూడటం మొదలుపెట్టాయి.
రోహిత్ శర్మతో కలిసి బ్యాంటింగ్ ఆరంభించిన శుభ్ మన్ గిల్.. మొదటి వికెట్ కు 69 పరుగులు జత చేసి, 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. అప్పుడు కొహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ గెలిచే వరకూ నాటౌట్ గా నిలిచి.. 81 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 74 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
మరోవైపు హిట్ మ్యాన్ తమ సత్తా తగ్గలేదని.. తగ్గింది బాడీ మాత్రమేనని.. ఇప్పుడు మరింత ఫిట్ గా ఉన్నానని బ్యాట్ తో నిరూపించాడు. ఇందులో భాగంగా... 125 బంతుల్లో ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. 13 ఫోర్లు 3 సిక్స్ ల సాయంతో 121 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచాడు. తన సత్తా ఏమిటో బ్యాట్ తో మరోసారి చూపించాడు.
తొలుత 63 బంతుల్లో అర్ధశతకం అందుకున్న హిట్ మ్యాన్ మరో 42 బాల్స్ లో శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మకు ఓవరాల్ గా ఇది 50వ సెంచరీ కాగా ఇప్పటివరకు టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు చేశాడు. మరోవైపు విరాట్ కు వన్డేల్లో ఇది 75వ హాఫ్ సెంచరీ.
1986 తర్వాత ఇదే తొలిసారి!:
మూడో వన్డే మ్యాచ్ లో భారత్ కు ఆస్ట్రేలియా 237 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. భారత బౌలర్ల దెబ్బకు 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2.. సిరాజ్, కుల్ దీప్, అక్షర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు. ఇక్కడే ఓ రికార్డ్ నమోదైంది.
ఇందులో భాగంగా... ఈ మ్యాచ్ లో ఆరుగురు భారత బౌలర్లు బౌలింగ్ చేయగా... ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క వికెట్ తీయడం గమనార్హం. 1986 తర్వాత ఇలా ఆస్ట్రేలియాపై ప్రతి బౌలరూ వికెట్ తీయడం ఇదే తొలిసారి.
