Begin typing your search above and press return to search.

హాఫ్ సెంచ‌రీతో రోహిత్ ఆల్ రైట్.. రికార్డులు సెట్ రైట్

గురువారం నాటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొన్న రోహిత్ ఒక‌ప్ప‌టి హిట్ మ్యాన్ ను త‌ల‌పించాడు.

By:  Tupaki Entertainment Desk   |   23 Oct 2025 2:47 PM IST
హాఫ్ సెంచ‌రీతో రోహిత్ ఆల్ రైట్.. రికార్డులు సెట్ రైట్
X

ప్ర‌పంచ క్రికెట్ లో ప్ర‌స్తుతం ఒకే ఒక చ‌ర్చ‌.. 2027 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్ లో కొన‌సాగుతాడా..? అత‌డు నేరుగా రిటైర్మెంట్ ఇవ్వ‌డు స‌రే..! భార‌త సెల‌క్ట‌ర్లు ఎంపిక చేస్తారా? అస‌లే ఫిట్ నెస్ అంతంత అనే విమ‌ర్శ‌లు.. దీనికితోడు వైఫ‌ల్యాలు.. తాజాగా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో తొలి వ‌న్డేలో 8 ప‌రుగుల‌కే ఔట్..! దీంతో రోహిత్ లో ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు ఆడే సామ‌ర్థ్యం లేద‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. కానీ, వీట‌న్నిటికీ అత‌డు ఆడిలైడ్ లో జ‌రుగుతున్న‌ రెండో వ‌న్డేలో స‌మాధానం ఇచ్చాడు.

మ‌ళ్లీ అప్ప‌టి రోహిత్

గురువారం నాటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొన్న రోహిత్ ఒక‌ప్ప‌టి హిట్ మ్యాన్ ను త‌ల‌పించాడు. త‌న ఫేవ‌రెట్ షాట్ పుల్ ను అల‌వోక‌గా ఆడేసి రెండు సిక్సులు కొట్టాడు. 97 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, మూడు సిక్సులు కొట్టిన రోహిత్ 73 ప‌రుగులు చేశాడు. సెంచ‌రీ ఖాయం అనుకుంటుండ‌గా త‌న ఫేవ‌రెట్ పుల్ షాట్ ఆడ‌బోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ రికార్డుల‌కు ఎక్కాడు. ఇప్ప‌టికీ త‌న‌లో ప‌దును త‌గ్గ‌లేద‌ని చాటుతూ.. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ రేసులో ఉన్న‌ట్లు కూడా స్ప‌ష్టం చేశాడు.

గంగూలీని మించి.. వ‌న్డేలో టాప్ 3 ర‌న్స్ గెట్ట‌ర్

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో గొప్ప బ్యాట్స్ మన్ అయిన మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీని దాటేశాడు రోహిత్. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ (463 మ్యాచ్ ల‌లో 18,426), స‌హ‌చ‌ర దిగ్గ‌జ విరాట్ కోహ్లి (304 మ్యాచ్ లు 14,181 ప‌రుగులు) త‌ర్వాత స్థానానికి చేరాడు. 308 వ‌న్డేల్లో 297 ఇన్సింగ్స్ ఆడిన గంగూలీ 40.95 స‌గ‌టుతో 11,221 ప‌రుగులు చేశాడు. రోహిత్ 275 మ్యాచ్ లు 267 ఇన్నింగ్స్ లో 48.69 స‌గటుతో 11,249 ప‌రుగులు సాధించాడు. మాజీ కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్ (340 మ్యాచ్ ల‌లో 10,768 ప‌రుగులు) ఐదో స్థానంలో ఉన్నాడు.

ఓపెన‌ర్ గా నాలుగోవాడు..

వ‌న్డేల్లో ఓపెన‌ర్ గా అత్య‌ధిక ప‌రుగుల రికార్డు మాత్రం రోహిత్ కు చాలా దూర‌మే. కెరీర్ ఆరంభ‌మైన ఐదారేళ్ల‌కు ఓపెన‌ర్ గా వ‌చ్చిన రోహిత్.. ప్ర‌స్తుతం 9219 ప‌రుగుల‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. గంగూలీ (9,146), ఆస్ట్రేలియా ఓపెన‌ర్ గిల్ క్రిస్ట్ (9,200) ను అధిగ‌మించాడు. అయితే, గంగూలీ, గిల్ క్రిస్ట్ లు ఇద్ద‌రూ ఓపెన‌ర్లుగా కెరీర్ మొద‌లైన వారు కాదు.

స‌చిన్ దే అగ్ర‌స్థానం

వ‌న్డే కెరీర్ మొద‌ట్లో మిడిలార్డ‌ర్ లో ఆడిన స‌చిన్ ఓపెన‌ర్ గా అవ‌తారం ఎత్తాక చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. అత‌డు 15,310 ప‌రుగులు సాధించాడు. పూర్తిగా క బ్యాట్స్ మ‌న్ గా చూసుకున్నా.. ఇవి రెండో అత్య‌ధిక ప‌రుగులు కావ‌డం విశేషం. శ్రీలంక ఓపెన‌ర్ జ‌య‌సూర్య (12,740), వెస్టిండీస్ విధ్వంస‌క వీరుడు క్రిస్ గేల్ (10,179) స‌చిన్ త‌ర్వాత వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఓపెన‌ర్లు.