హిట్ మ్యాన్ ఆడితే అట్లుంటదీ.. రికార్డులన్నీ బద్దలే
రోహిత్ శర్మకంటే ముందు 20వేల పరుగులను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ లు సాధించారు.
By: A.N.Kumar | 7 Dec 2025 12:12 PM ISTహిట్ మ్యాన్ కొడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే.. 2023 వరకూ ఆకాశమే హద్దుగా.. అస్సలు ఆగకుండా కెప్టెన్ గా తన సొంత లాభం చూసుకోకుండా చెలరేగిపోయిన హిట్ మ్యాన్.. గౌతం గంభీర్ కోచ్ గా రావడం.. తన కెప్టెన్సీకి ఎసరు పెట్టడం.. టీంలోనే లేకుండా యువతకు అవకాశాలు పెంచడంతో రోహిత్ కూడా మారిపోయాడు. ఫాస్ట్ గా ఆడడం మరిచిపోయి ఇప్పుడు నెమ్మదిగా ఆడుతున్నాడు.
నిన్నటి సౌతాఫ్రికాతో మ్యాచ్ లో రోహిత్ శర్మ రికార్డులను వేటాడాడు. అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 20వేల పరుగుల క్లబ్ లో చేరిన నాలుగో భారతీయ బ్యాట్స్ మెన్ గా ఆయన నిలిచారు. ప్రపంచ వేదికపై అతడి అద్భుత ఆటతో ఇప్పుడు మరొక మైలురాయిని అధిగమించాడు.
ప్రస్తుతం హిట్ మ్యాన్ కేవలం వన్డేలకు పరిమితమయ్యాడు. టీమిండియా తరుఫున కేవలం ఒక ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. గతంలో మూడు ఫార్మాట్లు ఆడుతూ కెప్టెన్ గా ఉండేవాడు.కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 20వేల పరుగులు పూర్తి చేసిన 4వ భారతీయుడిగా రోహిత్ ఈ రికార్డ్ సాధించాడు.
రోహిత్ శర్మకంటే ముందు 20వేల పరుగులను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ లు సాధించారు. రోహిత్ సాధించిన ఈ ఘనత కేవలం అతడి ప్రతిభకు, కఠోర శ్రమకు, స్థిరత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం హిట్ మ్యాన్ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ముంబైకి చెందిన ఈ స్టార్ బ్యాట్స్ మెన్ తన కెరీర్ లో ఎన్నో మరుపురాని సెంచరీలు , రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శనలను నమోదు చేశాడు. వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీలు (5) ఒక ఎడిషన్ లో చేసిన ఆటగాడు రోహిత్ నే కావడం వివేషం. ఇక టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్ ఒకరు.
తన స్టైలిష్ షాట్ లు, భారీ సిక్సర్లతో అభిమానుల గుండెల్లో ‘హిట్ మ్యాన్’ గా మన్ననలు పొందిన రోహిత్ కెప్టెన్ గా, భ్యాట్స్ మెన్ గా జట్టుకు వెలకట్టలేని ఆస్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి 20వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను అధిగమిస్తాడని ఆశిద్దాం..
