Begin typing your search above and press return to search.

రోహిత్ సూప‌ర్ సెంచ‌రీ.. కోహ్లి గ్రేట్ రికార్డు.. టీమ్ ఇండియా గెలుపు

మోస్త‌రు టార్గెట్ తో బ‌రిలో దిగిన టీమ్ ఇండియాకు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మ‌న్ రోహిత్ శ‌ర్మ సాధికార బ్యాటింగ్ గెలుపును సునాయాసం చేసింది.

By:  Tupaki Entertainment Desk   |   25 Oct 2025 4:04 PM IST
రోహిత్ సూప‌ర్ సెంచ‌రీ.. కోహ్లి గ్రేట్ రికార్డు.. టీమ్ ఇండియా గెలుపు
X

ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ మూడో మ్యాచ్ లో టీమ్ ఇండియా విజ‌యం సాధించింది. తొలి రెండు మ్యాచ్ ల‌లో ఓడి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న భార‌త జ‌ట్టు ఈసారి మాత్రం పూర్తి నియంత్ర‌ణ‌లో ఆడింది. టాస్ ఓడి బౌలింగ్ చేసినప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థిని 236 ప‌రుగుల‌కే నిలువ‌రించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ షాన్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29)లు మొద‌టి వికెట్ కు 9.2 ఓవ‌ర్ల‌లోనే 61 ప‌రుగులు జోడించారు. ఈ ఊపు చూస్తే కంగారూలు భారీ స్కోరు సాధించ‌డం ఖాయం అనిపించింది. కానీ, భార‌త బౌల‌ర్లు పుంజుకుని వ‌రుస‌గా వికెట్లు తీశారు. మాథ్యూ షార్ట్ (30), రైన్ షా (56), క్యారీ (24) మెరుగ్గా ఆడినా భారీ స్కోరు అందించ‌లేక‌పోయారు.

హై హై రోహిట్..

మోస్త‌రు టార్గెట్ తో బ‌రిలో దిగిన టీమ్ ఇండియాకు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మ‌న్ రోహిత్ శ‌ర్మ సాధికార బ్యాటింగ్ గెలుపును సునాయాసం చేసింది. పెర్త్ లో జ‌రిగిన తొలి వ‌న్డేలో 8 ప‌రుగుల‌కే ఔట్ అయి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న రోహిత్.. ఆడిలైడ్ లో రెండో వ‌న్డేలో 73 ప‌రుగులతో రాణించాడు. శ‌నివారం మూడో వ‌న్డేలో మాత్రం మ‌రింత‌ చెల‌రేగాడు. ఏకంగా సెంచ‌రీ కొట్టేశాడు. రోహిత్ కెరీర్ లో ఇది 33వ వ‌న్డే సెంచ‌రీ కావ‌డం విశేషం. 125 బంతుల్లో 121 ప‌రుగులు చేసిన రోహిత్ నాటౌట్ గా నిలిచాడు.

వ‌రుస‌గా 2 డ‌క్ లు.. నేడు సూప‌ర్..

రోహిత్ కు తోడుగా మ‌రో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి జ‌ట్టు విజ‌యానికి బాట‌లు వేశాడు. వ‌న్డేల్లో తొలిసారి వ‌రుస‌గా రెండుసార్లు డ‌కౌట్ అయిన అనుకోని రికార్డుతో బ‌రిలో దిగినప్ప‌టికీ కోహ్లి ఆ ప్ర‌భావ‌మేమీ లేకుండా ఆడాడు. 81 బంతుల్లో అజేయంగా 74 ప‌రుగులు సాధించాడు. ఈ క్ర‌మంలో కోహ్లి వ‌న్డే క్రికెట్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. మొత్తం 305 వ‌న్డేల్లో 14,255 ప‌రుగులు సాధించిన కోహ్లి.. శ్రీలంక దిగ్గ‌జం కుమార సంగ‌క్క‌ర (404 మ్యాచ్ ల‌లో 14234)ను అధిగ‌మించాడు. ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచాడు టీమ్ ఇండియా క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ (463 మ్యాచ్ ల‌లో 18,426).

టీమ్ ఇండియా విజ‌యం..

మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. 38.3 ఓవ‌ర్ల‌లోనే 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ 121 నాటౌట్, కోహ్లి 74 అజేయంగా నిలిచారు. మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా 1-2తేడాతో గెలిచింది.