Begin typing your search above and press return to search.

క్రికెట్ వదిలేద్దామనుకున్నా.. వరల్డ్‌కప్ ఓటమిపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి భారత క్రికెట్ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకం. కోట్లాది మంది భారతీయుల కలలు అహ్మదాబాద్ వేదికగా చెదిరిపోయిన వేళ.. మైదానంలో ఆటగాళ్ల కన్నీళ్లు అందరినీ కలిచివేశాయి.

By:  A.N.Kumar   |   22 Dec 2025 9:00 AM IST
క్రికెట్ వదిలేద్దామనుకున్నా..   వరల్డ్‌కప్ ఓటమిపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు
X

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి భారత క్రికెట్ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకం. కోట్లాది మంది భారతీయుల కలలు అహ్మదాబాద్ వేదికగా చెదిరిపోయిన వేళ.. మైదానంలో ఆటగాళ్ల కన్నీళ్లు అందరినీ కలిచివేశాయి. తాజాగా ఆ ఓటమి తనను ఎంతలా కుంగదీసిందో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత భావోద్వేగంగా పంచుకున్నారు.

ఆ రాత్రి.. ఆ బాధ వర్ణనాతీతం

రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో ఓటమి తన కెరీర్ లోనే అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ‘నిజం చెప్పాలంటే.. ఆ ఓటమి తర్వాత నేను క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు గుడ్ బై చెప్పాలని తీవ్రంగా ఆలోచించాను. అంతటి నిరాశలో ఉన్నాను’ అని రోహిత్ వెల్లడించారు.

లక్ష్యం ఒక్కటే.. కానీ ఫలితం వేరు

2022లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ లక్ష్యం ఒక్కటే.. భారత్ కు ఐసీసీ ట్రోఫీ అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. వరుసగా 10 విజయాలతో అజేయంగా ఫైనల్ కు చేరిన టీమిండియా, చివరి మెట్టుపై బోల్తా పడడం జీర్ణించుకోవడం ఎవరికీ సాధ్యపడలేదు. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి తనకు నెలల సమయం పట్టిందని రోహిత్ తెలిపారు. ‘ఆ సమయంలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. మైదానంలోకి వెళ్లాలనే ఆసక్తి కూడా చచ్చిపోయింది. కానీ నా కుటుంబం , స్నేహితులు, జట్టు సభ్యులు అందించిన మద్దతు నన్ను మళ్లీ నిలబెట్టింది’ అని రోహిత్ శర్మ తెలిపారు.

ఓటమి నేర్పిన పాఠం

ఓటమి ఎంత పెద్దదైనా తిరిగి పుంజుకోవడమే అసలైన క్రీడాస్ఫూర్తి అని రోహిత్ నిరూపించారు. ఆ నిరాశ నుంచే కసిని పెంచుకున్న ఆయన ఆ తర్వాత జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను విజేతగా నిలిపి తన కలను నెరవేర్చుకున్నారు.

అభిమానుల స్పందన

రోహిత్ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మీరు కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు. కోట్లాది మందికి స్ఫూర్తి . ఆనాడు మీరు తప్పుకోకుండా ఉండబట్టే.. నేడు భారత్ ప్రపంచవిజేతగా నిలిచింది’ అంటూ అభిమానులు తమ కెప్టెన్ ను మద్దతుగా నిలుస్తున్నారు.