రో-కోకు విజయ్ హజారే కఠిన పరీక్ష.. ఈ ట్రోఫీ కథేమిటో తెలుసా?
దాదాపు రెండేళ్లుగా భారత క్రికెట్ లో ఒకటే చర్చ.. సీనియర్లు, జూనియర్లు తేడా లేదు..! టీమ్ ఇండియాలో సభ్యులుగా ఉండాలంటే అందరూ కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ అల్టిమేటం ఇచ్చింది.
By: Tupaki Entertainment Desk | 12 Nov 2025 5:00 PM ISTదాదాపు రెండేళ్లుగా భారత క్రికెట్ లో ఒకటే చర్చ.. సీనియర్లు, జూనియర్లు తేడా లేదు..! టీమ్ ఇండియాలో సభ్యులుగా ఉండాలంటే అందరూ కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ అల్టిమేటం ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి మరోసారి బోర్డు సూచన చేసింది. వీరు ప్రస్తుతం కొనసాగుతున్నది కేవలం వన్డే ఫార్మాట్ లోనే. అందుకనే దేశవాళీల్లో ఈ ఫార్మాట్ లో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనక తప్పని పరిస్థితి. మ్యాచ్ ఫిట్ నెస్ కోసం అయినా దేశవాళీ టోర్నీలు ఆడాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. ఎందుకంటే వన్డేలు ఎప్పుడో కాని జరిగే చాన్స్ లేదు. రోహిత్, కోహ్లిలకు మ్యాచ్ మ్యాచ్ కు చాలా విరామం వస్తోంది. కాగా, బోర్డు సూచన మేరకు ఈ దిగ్గజ బ్యాటర్లు వచ్చే నెల 24 నుంచి జరిగే విజయ్ హజారే టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది.
వన్డేలే కాదు.. టి20లు కూడా ఆడతా..
రోహిత్ అయితే, విజయ్ హజారేనే కాదు... ముస్తాక్ అలీ టి20 టోర్నీలో కూడా పాల్గొంటానని సమాచారం ఇచ్చాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు ఈ మేరకు వర్తమానం పంపాడు. ముస్తాక్ అలీ టోర్నీ ఈ నెల 26 నుంచి మొదలుకానుంది. అయితే, ఈ నెల 30 నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఉంది. కాబట్టి రోహిత్ కేవలం ముస్తాక్ అలీ టి20లో ఒకటీ, రెండు మ్యాచ్ లకే అందుబాటు ఉంటాడు.
కోహ్లి సంగతి ఏమిటి?
కోహ్లి కూడా దేశవాళీలు ఆడేందుకు సిద్ధమే అయినా.. విజయ్ హజారేలో పాల్గొంటాడా? అనేది తెలియరాలేదు. అతడి నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 2010లో చివరిసారిగా ఈ టోర్నీలో పాల్గొన్నాడు కోహ్లి. అప్పటికి టీమ్ ఇండియాలో చోటే ఖాయం కాలేదు. కాగా, కోహ్లి ఆస్ట్రేలియా టూర్లో విఫలం కావడంతో బీసీసీఐ ఆదేశాలతో ఈ ఏడాది ప్రారంభంలో రంజీట్రోఫీ బరిలో దిగాడు. సొంత నగరం ఢిల్లీలో రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. కానీ, విఫలమయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.
ఎవరీ విజయ్ హజారే?
విజయ్ హజారే భారత తొలి తరం క్రికెట్ దిగ్గజం. 1946 నుంచి 1953 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 30 టెస్టులు ఆడి 2,192 పరుగులు చేశాడు. సగటు 47.65. ఈయన పేరిటనే విజయ్ హజారే ట్రోఫీ నిర్వహిస్తున్నారు. 2002-03లో ఈ టోర్నీ ప్రారంభమైంది. వయసు, ఫామ్, ఫిట్ నెస్ రీత్యా ఈ టోర్నీలో రోహిత్-కోహ్లి రాణించడం సవాలే. ఒకవేళ మునుపటిలా ఆడితే వారిద్దరూ వచ్చే ప్రపంచ కప్ కు రేసులో ఉన్నట్లే.
