Begin typing your search above and press return to search.

కాంబ్లీ, పృథ్వీ షా.. ఇప్పుడు ఓ వైభవ్.. అమ్మాయిలతోనే అథపాతాళం..

ఈ సందర్భంగా భారత క్రికెట్‌లో ఒకప్పుడు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా ఉదాహరణలను ఉతప్ప ప్రస్తావించారు.

By:  A.N.Kumar   |   6 Aug 2026 11:47 AM IST
కాంబ్లీ, పృథ్వీ షా.. ఇప్పుడు ఓ వైభవ్.. అమ్మాయిలతోనే అథపాతాళం..
X

భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతమైన యువ ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. చిన్న వయసులోనే అసాధారణమైన బ్యాటింగ్ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ సంచలనం.. భవిష్యత్తులో టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రతిభ ఒక్కటే సరిపోదని.. దాన్ని నిలబెట్టుకోవడానికి క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా అంతే ముఖ్యమని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక సూచనలు చేశారు.

రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకం

వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైభవ్‌కు కేవలం 15 ఏళ్లు మాత్రమే ఉన్నాయని.. రాబోయే ఐదేళ్లు అతని కెరీర్‌ను నిర్ణయించే అత్యంత కీలకమైన సమయమని చెప్పారు. ఈ వయసులో క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెడితే ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదగడానికి అతడికి అన్ని అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

అయితే 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత లభించే గ్లామర్, సోషల్ మీడియా, ముఖ్యంగా అమ్మాయిల నుంచి వచ్చే అటెన్షన్ యువ ఆటగాళ్ల దృష్టిని మరల్చే ప్రమాదం ఉందని ఉతప్ప హెచ్చరించారు. "వైభవ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిల అటెన్షన్ కారణంగా ఆటపై ఫోకస్ తగ్గకుండా చూసుకోవాలి. గతంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఇలాగే దారి తప్పి తమ కెరీర్‌ను దెబ్బతీసుకున్నారు" అని వ్యాఖ్యానించారు.

కాంబ్లీ, పృథ్వీ షాల ఉదాహరణలు

ఈ సందర్భంగా భారత క్రికెట్‌లో ఒకప్పుడు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా ఉదాహరణలను ఉతప్ప ప్రస్తావించారు. అపారమైన టాలెంట్ ఉన్నప్పటికీ క్రమశిక్షణ లోపించడం, వ్యక్తిగత జీవితంలోని సమస్యలు, ఫోకస్ కోల్పోవడం వల్ల వారి కెరీర్లు ఆశించిన స్థాయికి చేరుకోలేదని గుర్తు చేశారు. వైభవ్ అలాంటి పొరపాట్లు పునరావృతం చేయకూడదని కోరారు.

"వైభవ్‌ను కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం చాలా మంచిది. చిన్న వయసులోనే అధిక ప్రచారం, ఒత్తిడి ఆటపై ప్రభావం చూపుతాయి. అతని కుటుంబం, కోచ్‌లు, బీసీసీఐ అతడిని సరైన దారిలో నడిపించాలి" అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు.

సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపగలడు

వైభవ్ సూర్యవంశీ సామర్థ్యంపై ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించారు. "అతడు క్రికెట్ ఆడటానికే పుట్టాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపే సామర్థ్యం అతడికి ఉంది" అని పేర్కొన్నారు. అయితే ఆ స్థాయికి చేరాలంటే ప్రతిభతో పాటు కష్టపడే తత్వం, మానసిక దృఢత్వం చాలా అవసరమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉతప్ప చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన మాటలతో ఏకీభవిస్తుండగా మరికొందరు ఇంత చిన్న వయసులోనే అతనిపై భారీ అంచనాలు పెట్టడం సరికాదని అంటున్నారు. ఏదేమైనా, గతంలో పలువురు చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని వైభవ్ తన ఆటపైనే పూర్తి దృష్టి పెడితే భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికినట్లే..