Begin typing your search above and press return to search.

రూ.27 కోట్ల పంత్‌కు ఢిల్లీ పిలుపు..? లక్నోతో బంధం ముగిసినట్టేనా!

ఐపీఎల్ వేలం అంటేనే కోట్ల రూపాయల ఆట. కానీ 2024 వేలంలో ఒక ఆటగాడి పేరు వినిపించిన ప్రతిసారీ ఫ్రాంచైజీల గుండెల్లో గుబులు మొదలైంది.

By:  A.N.Kumar   |   19 Jun 2026 8:00 PM IST
రూ.27 కోట్ల పంత్‌కు ఢిల్లీ పిలుపు..? లక్నోతో బంధం ముగిసినట్టేనా!
X

ఐపీఎల్ వేలం అంటేనే కోట్ల రూపాయల ఆట. కానీ 2024 వేలంలో ఒక ఆటగాడి పేరు వినిపించిన ప్రతిసారీ ఫ్రాంచైజీల గుండెల్లో గుబులు మొదలైంది. అతడే రిషబ్ పంత్. చివరకు లక్నో యజమాని సంజీవ్ గోయంక ఏకంగా రూ.27 కోట్లకు వెచ్చించి మరీ పంత్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది "ఇంత డబ్బు పెట్టారా? లేక మొత్తం ఫ్రాంచైజీనే అతడి పేరుమీద రిజిస్టర్ చేశారా?" అని సరదాగా కామెంట్లు చేశారు.

అయితే వేలంలో వచ్చిన ధరకు తగ్గట్టుగా బ్యాట్ మాత్రం మాట్లాడలేదు. కోట్లకు కొన్న బ్యాట్స్‌మన్ కంటే... కాసులకు దొరికే టెయిల్ ఎండర్లు ఎక్కువ పరుగులు చేస్తున్నారనే సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. "రూ.27 కోట్లకు ఒక్కో పరుగేనా?" అంటూ అభిమానులు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు.

2025 సీజన్‌లో పంత్‌పై ఒత్తిడి పెరిగింది. కెప్టెన్‌గా బాధ్యతలు, భారీ ధర, అభిమానుల అంచనాలు... ఇవన్నీ కలిసి అతడిని పూర్తిగా కట్టిపడేశాయి. ఒకప్పుడు బౌలర్లను భయపెట్టే దూకుడు కనిపించలేదు. సున్నా పరుగులకే పెవిలియన్ చేరిన సందర్భాలు పెరిగాయి. ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్... అక్కడి నుంచి లోయర్ ఆర్డర్ వరకు ప్రయోగాలన్నీ జరిగాయి. కానీ మారింది బ్యాటింగ్ పొజిషన్ మాత్రమే... ఫలితం మాత్రం కాదు.

2026 సీజన్ వచ్చేసరికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే పంత్... నెమ్మదిగా నడుస్తున్నట్టే కనిపించాడు. బౌండరీల వర్షం కురిపించే బ్యాటర్... డాట్ బాల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడంటూ నెటిజన్లు మీమ్స్‌తో మోత మోగించారు. లక్నో వరుస ఓటములు ఎదుర్కొనడంతో చివరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. "కెప్టెన్సీ పోయింది... ఇప్పుడు ఫామ్ అయినా వస్తుందేమో!" అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు జాతీయ మీడియాలో మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. పంత్ మళ్లీ తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. తనను నాయకుడిగా తీర్చిదిద్దిన ఫ్రాంచైజీతో మరోసారి జతకట్టాలని భావిస్తున్నాడని కథనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో వైపు వెళ్లొచ్చనే చర్చ కూడా నడుస్తోంది.

ఇంకా ఆసక్తికరమైన ప్రచారం ఏమిటంటే... ఢిల్లీ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా జరుగుతోందట. ఐపీఎల్‌లో ప్లేయర్లు జట్లు మారడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి చూస్తుంటే ఆటగాళ్ల ట్రాన్స్‌ఫర్ల కంటే రూమర్ల ట్రాన్స్‌ఫర్లు ఎక్కువ వేగంగా జరుగుతున్నాయి.

అయితే ఇవన్నీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించబడిన విషయాలు కావు. వచ్చే వేలం, ట్రేడింగ్ విండో, ఫ్రాంచైజీల వ్యూహాలు ఎలా మారతాయో చూడాలి. ఎందుకంటే ఐపీఎల్‌లో చివరి బంతి పడే వరకు మ్యాచ్ ఎలా ముగుస్తుందో చెప్పలేం... అలాగే చివరి ప్రకటన వచ్చే వరకు ఏ ఆటగాడు ఏ జట్టులో ఉంటాడో కూడా చెప్పలేం!