బ్రేకప్ నుంచి బ్రహ్మాండ విజయం వరకూ స్మృతి మంధానా స్ఫూర్తిదాయక కథ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇది మరిచిపోలేని ఘడియ. గత ఏడాది పురుషుల జట్టు తొలిసారి ట్రోఫీని అందుకొని చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు మహిళల జట్టు అదే బాటలో మరోసారి కీర్తి పతాకాన్ని ఎగరవేసింది.
By: A.N.Kumar | 6 Feb 2026 11:55 AM ISTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇది మరిచిపోలేని ఘడియ. గత ఏడాది పురుషుల జట్టు తొలిసారి ట్రోఫీని అందుకొని చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు మహిళల జట్టు అదే బాటలో మరోసారి కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూ.పీఎల్) ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అసాధ్యం అనుకున్న చోట... అద్భుత విజయం!
ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. నిర్ణీత ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరును బెంగళూరు ముందుంచింది. భారీ లక్ష్యం, క్లిష్టమైన పిచ్ ఈ రెండింటి కారణంగా ఒక దశలో ఆర్‌సీబీ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్టే కనిపించింది. కానీ… అదే చోట నుంచే అసలైన కథ మొదలైంది. బెంగళూరు బ్యాటింగ్‌లో క్రమశిక్షణ, ధైర్యం కనిపించాయి. చివరి వరకూ పోరాడి, రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయానికి ప్రధాన కారణం కెప్టెన్ స్మృతి మంధాన. ఫైనల్‌లో ఆమె ఆడిన 87 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఒత్తిడిలోనూ ప్రశాంతత కోల్పోకుండా జట్టును ముందుండి నడిపించింది.
ముంబై రికార్డు సమం.. ఆర్‌సీబీ సరికొత్త చరిత్ర!
ఈ విజయంతో ఆర్‌సీబీ మహిళల జట్టు రెండుసార్లు డబ్ల్యూపీఎల్ ట్రోఫీని గెలిచిన రెండో జట్టుగా నిలిచింది. అంతకుముందే ముంబై ఇండియన్స్ (2023, 2025) ఈ ఘనత సాధించగా ఇప్పుడు బెంగళూరు కూడా అదే ఎలైట్ జాబితాలో చేరింది.
స్మృతి మంధానా: కష్టాల కడలి నుంచి విజయ తీరానికి..
క్రికెట్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సవాళ్లను ఎదుర్కొన్న స్మృతి, వాటిని అధిగమించి మళ్లీ శిఖరాలను అధిరోహించింది. కొన్ని నెలల క్రితం ఎదురైన వ్యక్తిగత కష్టాల్ని వెనక్కి నెట్టేసి.. తన దృష్టంతా ఆటపైనే కేంద్రీకరించింది. ఫలితం ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్, జట్టుకు ట్రోఫీ. "వ్యక్తిగత బాధలు ఉండొచ్చు, కానీ మైదానంలోకి దిగితే దేశం, జట్టు మాత్రమే కనిపిస్తాయి అన్నట్టుగా స్మృతి మంధానా పట్టుదలకు ఈ విజయం ఒక నిదర్శనం. మూడు నెలల వ్యవధిలోనే వ్యక్తిగత బాధల నుంచి కోలుకుని అసాధారణ మానసిక స్థయిర్యాన్ని ప్రదర్శించిన స్మృతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. కెప్టెన్‌గా సరైన సమయంలో బౌలింగ్ మార్పులు చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఏకోన్ముఖం చేసింది. రెండుసార్లు డబ్ల్యూపీఎల్ కప్పు గెలిచిన కెప్టెన్లలో ఒకరిగా నిలవడమే కాదు.. ఫైనల్‌లో అత్యధిక స్కోరు సాధించిన నాయికగా నిలిచింది.
భారత మహిళా క్రికెట్‌కు స్మృతి మంధానా ఒక అమూల్య రత్నం. కష్టాల నుంచి కోలుకుని.. విజయం వైపు దూసుకెళ్లిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి. ఆర్‌సీబీ రెండో ట్రోఫీ గెలుపు కేవలం ఒక విజయం కాదు.. అది పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టు ఐక్యతకు దక్కిన గౌరవం.
