పోలా.. అదిరిపోలా.. గెలిచాక డప్పుల చప్పుళ్లకు ఆర్సీబీ ప్లేయర్ల స్టెప్పులు
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురైందో లేదో తెలియదు కానీ వరుసగా రెండోసారి కప్ కొట్టేసరికి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు పూనకాలు వచ్చేశాయి.
By: A.N.Kumar | 1 Jun 2026 12:57 PM ISTఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురైందో లేదో తెలియదు కానీ వరుసగా రెండోసారి కప్ కొట్టేసరికి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు పూనకాలు వచ్చేశాయి. "ఈసారి కప్ మనదే" అనే స్లోగన్‌ను కాస్తా మార్చి "పోయినసారీ మనదే.. ఈసారీ మనదే" అని గట్టిగా ఫిక్స్ అయిపోయిన ఆర్సీబీ గ్యాంగ్.. గెలిచిన ఆనందంలో నడిరోడ్డుపై చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాచ్ గెలిచాక స్టేడియం నుంచి హోటల్‌కు బయలుదేరిన ఆటగాళ్లకు లోకల్ ఆర్టిస్టులు డప్పుల చప్పుళ్లతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ఆ 'తీన్‌మార్' బీట్ వినడమే ఆలస్యం.. మన క్రికెటర్లలోని ఒరిజినల్ మాస్ యాంగిల్స్ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
ట్రోఫీ తలపై.. కృనాల్ ‘తీన్‌మార్’ రచ్చ!
ఈ సెలబ్రేషన్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యానే.. ఐపీఎల్ ట్రోఫీని చేతిలో పట్టుకుంటే ముద్దొస్తుందనుకున్నాడో ఏమో గానీ.. ఏకంగా తలపై పెట్టేసుకున్నాడు. డప్పుల రిథమ్‌కు తగ్గట్టుగా రోడ్డుపైనే చిందులు వేస్తూ.. పక్కా లోకల్ డాన్స్‌తో రెచ్చిపోయాడు. "అయ్యా కృనాల్.. ఆ ట్రోఫీ కోసం దశాబ్దాలుగా ఏడ్చినవాళ్లు ఉన్నారు, కాస్త జాగ్రత్తగా పట్టుకో సామీ! కింద పడితే హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది ఇక్కడ!" అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
కోహ్లీ అగ్రెషన్ పక్కనపెట్టి.. కుమ్మేసాడుగా!
మైదానంలో అంపైర్ల మీద, ఆపోజిట్ టీం మీద విరుచుకుపడే మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. ఈసారి మాత్రం రూట్ మార్చాడు. విజయోత్సాహంలో పూర్తిగా రిలాక్స్ అయిపోయి, తన సహచరులను ఎంకరేజ్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో అదిరిపోయే స్టెప్పులేశాడు. కోహ్లీని అలా ‘ఊర మాస్’ మోడ్‌లో చూసిన అభిమానులు.. "కింగ్ ఎక్కడైనా కింగే.. గ్రౌండ్‌లో క్లాస్.. రోడ్డు మీద మాస్!" అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా తనేం తక్కువ తినలేదన్నట్టుగా, కెప్టెన్సీ లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ పక్కనబెట్టి టీమ్‌తో కలిసి స్టెప్పులు కలిపాడు.
నెట్టింట వైరల్.. ‘నెక్స్ట్ లెవెల్’ వైబ్స్!
ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై మీమ్స్ రాయుళ్లు, ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఒక్క కప్ కే తట్టుకోలేకపోయాం.. వరుసగా రెండోసారి అంటే ఈమాత్రం ఊపుండాలిలే! డప్పుల ముందు ఆర్సీబీ స్టెప్పులు.. నెక్స్ట్ లెవెల్ భయ్యా.. ట్రోఫీని తలపై పెట్టుకుని కృనాల్ చేసిన డాన్స్ చూస్తుంటే.. ఐపీఎల్ కప్ కాస్తా బోనాల కుండలా మారిపోయినట్టుంది!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఏదేమైనా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ సాధించడంతో ఆర్సీబీ ఆనందం అంబరాన్నంటింది. ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ గ్రౌండ్‌లో ఎలా ఉన్నా.. రోడ్డు మీద డప్పుల డాన్స్‌లో మాత్రం వందకు వంద మార్కులు వేసేయొచ్చు... ఉత్సాహం ఉరకలేస్తుంటే.. ఆర్సీబీ ఆర్మీని ఆపడం ఎవరి తరం? పోలా.. అదిరిపోలా!
