ఆర్‌సీబీ సంచలన నిర్ణయం: కొత్త హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి? విరాట్ కోహ్లీ స్కెచ్ అదిరిందిగా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్‌కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మేనేజ్‌మెంట్ ఒక సంచలన నిర్ణయానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
By: A.N.Kumar | 19 Jun 2026 11:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్‌కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మేనేజ్‌మెంట్ ఒక సంచలన నిర్ణయానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీ కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. టీమిండియా మాజీ హెడ్ కోచ్, లౌడ్ స్పీకర్ వ్యాఖ్యాత రవిశాస్త్రి త్వరలోనే ఆర్‌సీబీ నూతన ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత కోచ్ ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆయన రాక దాదాపు ఖాయమైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
కోహ్లీ-శాస్త్రి సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ
ఈ భారీ మార్పు వెనుక ఆర్‌సీబీ రారాజు విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. రవిశాస్త్రిని జట్టు హెడ్ కోచ్‌గా తీసుకురావాలని కోహ్లీ స్వయంగా మేనేజ్‌మెంట్‌ను కోరినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ భారత క్రికెట్‌ను ఏ విధంగా ఏలిందో అందరికీ తెలిసిందే. 2017 నుండి 2021 వరకు రవిశాస్త్రి టీమిండియా కోచ్‌గా, కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత్ ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్ట్ సిరీస్ విజయాలు సాధించడం... ఇంగ్లాండ్, సౌతాఫ్రికా దేశాల్లో చిరస్మరణీయమైన టెస్ట్ మ్యాచ్‌లు గెలవడం... ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లడం.. భారత జట్టులో అగ్రెసివ్, నిర్భయమైన క్రికెట్ సంస్కృతిని తీసుకురావడంలో రవిశాస్త్రి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి కూడా తీసుకురావాలని కోహ్లీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఐపీఎల్ 2025లో టైటిల్ గెలిచినా మార్పు ఎందుకు?
విశేషం ఏంటంటే ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆండీ ఫ్లవర్ మార్గదర్శకత్వంలో ఆర్‌సీబీ ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, తమ మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ట్రోఫీ గెలిచినప్పటికీ జట్టును మరింత పటిష్టం చేయడానికి.. సుదీర్ఘ కాలం పాటు విజయాల పరంపరను కొనసాగించడానికి రవిశాస్త్రి లాంటి అనుభవజ్ఞుడైన లీడర్ అవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
కోహ్లీ ప్రతిపాదనపై ఆర్‌సీబీ అగ్ర నాయకత్వం, కీలక వాటాదారులు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. శాస్త్రి నియామకానికి మేనేజ్‌మెంట్ సూత్రప్రాయంగా అంగీకరించిందని, ప్రస్తుతం చర్చలు చివరి దశకు చేరుకున్నాయని టాక్. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే ఆండీ ఫ్లవర్ గౌరవప్రదంగా ఈ పదవి నుండి తప్పుకోనున్నారు.
ఫ్యాన్స్‌లో పెరిగిన అంచనాలు
"రవిశాస్త్రి కోచింగ్ శైలి, విరాట్ కోహ్లీ దూకుడు కలిస్తే ఆర్‌సీబీని ఆపడం ఎవరి తరమూ కాదు" అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. రవిశాస్త్రికి ఆటగాళ్లను మానసికంగా బలోపేతం చేయడంలో వారిలో నమ్మకాన్ని నింపడంలో తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన రాకతో బెంగళూరు జట్టు మరింత దూకుడుగా మారే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కోహ్లీ-శాస్త్రి ద్వయం ఐపీఎల్‌లోనూ తమ ముద్ర వేస్తుందో లేదో చూడాలి.
