Begin typing your search above and press return to search.

ఆర్సీబీ భవిష్యత్తు కెప్టెన్ అతడేనట.. అప్పుడే వెతికేస్తున్నారు..

ట్రోఫీ కోసం ఏళ్ల తరబడి వేచి చూసి.. విసిగిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు ఒకేసారి రెండు ఐపీఎల్ కప్పులు వచ్చేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది.

By:  A.N.Kumar   |   26 Jun 2026 9:47 AM IST
ఆర్సీబీ భవిష్యత్తు కెప్టెన్ అతడేనట.. అప్పుడే వెతికేస్తున్నారు..
X

ట్రోఫీ కోసం ఏళ్ల తరబడి వేచి చూసి.. విసిగిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు ఒకేసారి రెండు ఐపీఎల్ కప్పులు వచ్చేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అండతో కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్‌సీబీ వరుసగా రెండు టైటిళ్లు గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. అసలు ‘ఈసాల కప్ నమ్దే’ అనే స్లోగన్ వినడానికే అలవాటు పడిన ఫ్యాన్స్‌కు, బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీలు చూసేసరికి “ఇది కలనా.. నిజమా?” అనే అనుమానం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మాత్రం అప్పుడే ఫ్యూచర్ ప్లాన్స్ మొదలుపెట్టేసింది.

ప్రస్తుతం కెప్టెన్ పాటీదార్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంటే.. మేనేజ్‌మెంట్ మాత్రం “నెక్స్ట్ కెప్టెన్ ఎవరు?” అంటూ కొత్త చర్చకు తెరలేపింది. తాజాగా విడుదలైన ఆర్‌సీబీ టీమ్ డాక్యుమెంటరీలో ఫ్రాంచైజీ డైరెక్టర్ మో బోబట్, హెడ్ కోచ్ దినేశ్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దేవ్‌దత్ పడిక్కల్‌లో ఆ ‘లీడర్’ ఉన్నాడట!

ఫ్రాంచైజీ డైరెక్టర్ మో బోబట్ మాట్లాడుతూ.. యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌లో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చేశారు. “పడిక్కల్‌కు జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం ఉంది. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు, ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. భవిష్యత్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు అతనికి చాలా ఎక్కువగా ఉన్నాయి” అని బోబట్ చెప్పుకొచ్చారు.

సరే, డైరెక్టర్ గారు చెప్పారు అంటే ఏదో విజన్ ఉండే ఉంటుందిలే అనుకుంటే.. హెడ్ కోచ్ దినేశ్ కార్తీక్ కూడా దీనికి తన వంతు ‘లోకల్ సెంటిమెంట్’ టచ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టులో బెంగళూరుకు చెందిన ఏకైక ఆటగాడు పడిక్కల్ మాత్రమేనని డీకే గుర్తుచేశారు. స్థానిక పరిస్థితులపై అతనికి పట్టు ఉందట, మ్యాచ్ పరిస్థితిని వేగంగా అర్థం చేసుకుంటాడట. యువకుడే అయినా ఆటలో చాలా పరిపక్వత చూపిస్తున్నాడంటూ డీకే కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

పాటీదార్ కెప్టెన్సీకి ఇప్పుడేం తక్కువైంది సామీ?

ఇక్కడే అభిమానులకు ఒక చిన్న డౌట్ వస్తోంది. రజత్ పాటీదార్ నాయకత్వంలో జట్టు వరుసగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి, ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చింది. కెప్టెన్‌గా అతను ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అసలు కెప్టెన్సీ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అలాంటి టైంలో.. “ఫ్యూచర్ కెప్టెన్ పడిక్కల్” అంటూ ఈ కొత్త రాగం అందుకోవడం అవసరమా అని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. “అయ్యా బోబట్ గారూ.. కాస్త ఆగండయ్యా, ఇప్పుడిప్పుడే కప్పులు గెలుస్తూ ప్రశాంతంగా ఉన్నాం, అప్పుడే పాలిటిక్స్ వద్దు” అంటూ మీమ్స్ రాయుళ్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

అయితే క్రికెట్ విశ్లేషకుల వెర్షన్ ఇంకోలా ఉంది. ఫ్రాంచైజీలు ఎప్పుడూ వర్తమానంలో బతుకుతూనే భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటాయని, నాయకత్వ వారసత్వాన్ని సిద్ధం చేయడం ప్రొఫెషనల్ టీమ్స్ లక్షణమని వారు సమర్థిస్తున్నారు.

పడిక్కల్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

దేవ్‌దత్ పడిక్కల్ ఇప్పటికే ఆర్‌సీబీ తరఫున పలు కీలక ఇన్నింగ్స్ ఆడుతూ తన బ్యాటింగ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఫ్రాంచైజీ ఉన్నతాధికారులు, కోచింగ్ స్టాఫ్ నుంచి ‘ఫ్యూచర్ కెప్టెన్’ రేంజ్ ప్రశంసలు వచ్చేసరికి అతనిపై ఒత్తిడి పెరగడం ఖాయం. రాబోయే సీజన్లలో పడిక్కల్ కేవలం బ్యాట్‌తోనే కాకుండా, మైదానంలో తన లీడర్‌షిప్ స్కిల్స్‌ను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

మొత్తానికి ఒకప్పుడు కప్పు కోసం కొట్టుకున్న ఆర్‌సీబీ.. ఇప్పుడు ‘కెప్టెన్సీ వారసత్వం’ గురించి మాట్లాడుకునే రేంజ్‌కు ఎదగడం చూస్తుంటే అభిమానులకు ముచ్చటేస్తోంది. చూద్దాం.. భవిష్యత్తులో ఈ కన్నడ అబ్బాయి బెంగళూరు టీమ్‌ను ఏ మేరకు నడిపిస్తాడో!