Begin typing your search above and press return to search.

ఈ ఐపీఎల్ 2026కు చిన్నస్వామిలో ఆర్సీబీ మ్యాచులు లేనట్టే.. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే?

చిన్నస్వామి స్టేడియం అంటే కేవలం 22 గజాల పిచ్ మాత్రమే కాదు.. అది ఆర్‌సీబీ అభిమానుల ఎమోషన్

By:  A.N.Kumar   |   13 Jan 2026 3:08 PM IST
ఈ ఐపీఎల్ 2026కు చిన్నస్వామిలో ఆర్సీబీ మ్యాచులు లేనట్టే.. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏది అంటే ఠక్కున వినిపించే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ఈ జట్టుకు ఉన్న బలం, బలహీనత అంతా వారి హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం. అయితే 2026 సీజన్‌లో అభిమానుల గుండె పగిలే వార్త వినిపిస్తోంది. ఈసారి ఆర్‌సీబీ తన సొంత గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడటం లేదు.

'చిన్నస్వామి' లేని ఆర్‌సీబీ.. ఊహించుకోవడమే కష్టం!

చిన్నస్వామి స్టేడియం అంటే కేవలం 22 గజాల పిచ్ మాత్రమే కాదు.. అది ఆర్‌సీబీ అభిమానుల ఎమోషన్. చిన్న బౌండరీలు ఉండటంతో బ్యాటర్లు ఇక్కడ విరుచుకుపడతారు. గ్యాలరీల నుంచి వచ్చే 'ఆర్సీబీ.. ఆర్సీబీ' నినాదాలు ప్రత్యర్థి బౌలర్లను వణికించేవి. క్రిస్ గేల్ 175 రన్స్ చేసినా కోహ్లీ సెంచరీల వర్షం కురిపించినా ఈ మైదానంలోనే సాధ్యమైంది. ఇప్పుడు ఈ కోటను వదిలి ఆర్‌సీబీ జట్టు ముంబయి, రాయ్‌పూర్‌ బాట పట్టడం ఆశ్చర్యకరం.

కొత్త వేదికలు: లెక్కలు మారుతాయా?

వచ్చిన సమాచారం ప్రకారం ఆర్‌సీబీ ఈసారి రెండు వేర్వేరు నగరాలను తన హోమ్ గ్రౌండ్స్‌గా ఎంచుకుంది. అందులో మొదటిది నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం.. ఇది పెద్ద బౌండరీలు.. బ్యాట్స్‌మన్, బౌలర్లకు సమాన అవకాశాలు ఉంటాయి. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న వేదికగా పేరుంది. అయితే చిన్నస్వామిలా అభిమానుల భావోద్వేగ అనుబంధం మాత్రం ఇక్కడ ఉండదు.

ఇక రెండో స్టేడియం రాయ్ పూర్ లోని వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం. రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడడం ద్వారా మధ్య భారతంలో RCBకి కొత్త ఫ్యాన్‌బేస్ పెరిగే అవకాశం ఉంటుందని ఆర్సీబీ భావిస్తోంది. కొత్త మార్కెట్‌లో బ్రాండ్ విస్తరణకు అవకాశాలుంటాయి. కానీ పిచ్ పరిస్థితులు, వాతావరణానికి త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉంది.

చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం కురిపించే ఆర్‌సీబీ బ్యాటర్లకు, డీవై పాటిల్ వంటి పెద్ద మైదానాల్లో సిక్సర్లు కొట్టడం సవాల్‌గా మారుతుంది. అలాగే రాయ్‌పూర్ పిచ్‌పై స్పిన్ మాయాజాలాన్ని తట్టుకోవడం జట్టుకు పెద్ద పరీక్షే.

అభిమానుల దృష్టిలో ఇది 'హార్ట్ బ్రేక్' సీజన్ అయినప్పటికీ క్రికెట్ విశ్లేషకుల పరంగా ఇది ఆర్‌సీబీకి ఒక వరం కూడా కావచ్చు. చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలు చిన్నవి కావడంతో ఆర్‌సీబీ బౌలర్లు గతంలో ధారాళంగా పరుగులు ఇచ్చేవారు. ఇప్పుడు పెద్ద మైదానాల్లో ఆడటం వల్ల బౌలర్లకు ఇది కలిసి వచ్చే అంశం. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేకపోయినా గెలిస్తే ఆర్‌సీబీకి ఉన్న "చోకర్స్" ముద్ర చెరిగిపోయే అవకాశం ఉంటుంది. ముంబయి, రాయ్‌పూర్ పరిసరాల్లో ఆర్‌సీబీ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చు.

"ఈ సాలా కప్ నమ్దే" అనే నినాదం మరోసారి బెంగళూరు వీధుల్లో కాకుండా నవి ముంబయి వీధుల్లో వినిపించబోతోంది. ఆత్మీయమైన స్టేడియం మద్దతు లేకపోయినా విరాట్ కోహ్లీ అండ్ కో ఈ ప్రతికూలతలను అధిగమిస్తే.. 2026 సీజన్ ఆర్‌సీబీ చరిత్రలో అత్యంత గొప్ప సీజన్ గా నిలిచిపోతుంది.