ధోనీకి ఫోన్ చేసినా కలవలేదు..సీఎస్‌కే వీడటంపై రవీంద్ర జడేజా షాకింగ్ వ్యాఖ్యలు?
వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ట్రేడ్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడానికి కేవలం ఒక్క రోజు ముందే తనకు ఈ విషయం సమాచారం అందించారని జడేజా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
By: A.N.Kumar | 23 Jun 2026 1:00 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఒకటి. ఆ జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పాత్ర వెలకట్టలేనిది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శనతో సీఎస్‌కేకు వెన్నుముకగా నిలిచిన జడేజా 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్టుకు ట్రేడ్ కావడం క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఈ ట్రేడింగ్‌కు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఒక పోడ్‌కాస్ట్‌కు సంబంధించిన వ్యాఖ్యలు దావానలంలా వైరల్ అవుతున్నాయి. తాను సీఎస్‌కేను వీడాలని ఎప్పుడూ అనుకోలేదని, ఈ నిర్ణయం వెనుక తన ప్రమేయం లేదనే కోణంలో జడేజా ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ పోస్టుల ద్వారా ప్రచారం జరుగుతోంది.
ఆ రాత్రి ఏం జరిగింది? షాక్‌లో జడేజా!
వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ట్రేడ్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడానికి కేవలం ఒక్క రోజు ముందే తనకు ఈ విషయం సమాచారం అందించారని జడేజా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ వార్త వినగానే తాను పూర్తిగా నిర్ఘాంతపోయానని ఆయన అన్నట్లు ప్రచారం సాగుతోంది. "ఈ నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించాలని నేను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ను కోరాను. క్లారిటీ కోసం పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు." అని జడేజా వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి.
అంతేకాదు ఈ క్లిష్ట సమయంలో తన భార్య ఇచ్చిన సూచనతో జట్టు మాజీ కెప్టెన్, ఆత్మీయుడైన మహేంద్రసింగ్ ధోనీకి కూడా ఫోన్ చేశానని, కానీ దురదృష్టవశాత్తూ ఆ కాల్ కూడా కలవలేదని జడేజా చెప్పినట్లు ఆ వైరల్ పోస్ట్‌ల సారాంశం. చెన్నై జట్టు విజయం కోసం ఎల్లప్పుడూ వంద శాతం అంకితభావంతో ఆడిన తనకు, ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రాంచైజీ నుంచి సరైన గౌరవం దక్కకపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అభిమానుల నినాదాలు.. మనస్తాపం
ఈ పోడ్‌కాస్ట్ ముచ్చట్లలో మరో ఆసక్తికరమైన, బాధాకరమైన విషయాన్ని కూడా జడేజా ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని అభిమానుల ప్రవర్తన కొన్ని సందర్భాల్లో తనను తీవ్రంగా బాధించేదని ఆయన పేర్కొన్నట్లు చెబుతున్నారు. తాను క్రీజ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, మైదానంలోని ప్రేక్షకులు "అందరూ త్వరగా అవుట్ అవ్వాలి.. ధోనీ బ్యాటింగ్‌కు రావాలి" అంటూ నినాదాలు చేసేవారని, ఆ సమయంలో జట్టు కోసం ఆడుతున్న తనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదనే భావన కలిగిందని ఆయన అన్నట్లు సోషల్ మీడియా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
కొత్త జట్టుతో కొత్త ప్రయాణం
ఎన్ని పరిణామాలు ఎదురైనప్పటికీ, చివరకు వాస్తవాన్ని అంగీకరించి కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు జడేజా తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తనకు ఎంతో ఆత్మీయంగా, ఘనంగా స్వాగతం పలికిందని, ప్రస్తుతం తాను కొత్త జట్టుతో ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆర్‌ఆర్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నట్లు వైరల్ కథనాలు చెబుతున్నాయి.
నిజమెంత?
ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాఖ్యలు క్రీడా లోకంలో తీవ్ర దుమారం రేపుతున్నప్పటికీ ఈ వైరల్ పోస్టులపై అటు రవీంద్ర జడేజా గానీ, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ లేదా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల, ఈ కథనాల్లో ఎంతవరకు నిజముందనేది అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
