పెళ్లికి ముందు డేటింగ్ వేళ.. కోహ్లీ ఫామ్ వెనుక అనుష్క ప్రభావమా? షాకింగ్ నిజాలు
క్రికెట్ మైదానంలో సెంచరీలు బాదడం ఒక ఎత్తైతే.. ఆ సెంచరీల వెనుక ఉన్న ‘సీక్రెట్ ఎనర్జీ’ ఏంటో తెలుసుకోవడం అభిమానులకు మరో ఎత్తు.
By: A.N.Kumar | 8 Oct 2026 11:01 AM ISTక్రికెట్ మైదానంలో సెంచరీలు బాదడం ఒక ఎత్తైతే.. ఆ సెంచరీల వెనుక ఉన్న ‘సీక్రెట్ ఎనర్జీ’ ఏంటో తెలుసుకోవడం అభిమానులకు మరో ఎత్తు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల లవ్ స్టోరీ గురించి తెలియని వారు ఉండరు. కానీ వీరి డేటింగ్ రోజుల్లో విరాట్ బ్యాట్ నుంచి పరుగుల సునామీ రావడానికి వెనుక అసలు మాస్టర్ ప్లాన్ లేదా ‘మ్యాజిక్’ అనుష్క శర్మనేనని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రీసెంట్‌గా ఒక షోలో బాంబు పేల్చారు.
రవిశాస్త్రి మార్క్ ముచ్చట్ల ప్రకారం.. డేటింగ్ రోజుల్లో అనుష్క శర్మ విఐపి స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తుంటే చాలు.. మన విరాట్ బాబుకి ఎక్కడ లేని పూనకం వచ్చేదట.. అనుష్క స్టేడియంలో ఉంటే చాలు.. కోహ్లీ బ్యాట్‌కు సరికొత్త పవర్ వచ్చేదని.. బౌలర్లను ఆడేసుకుంటూ విధ్వంసం సృష్టించేవాడని రవిశాస్త్రి చాలా కలర్‌ఫుల్‌గా గుర్తుచేసుకున్నారు. ఒక మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులు కొట్టాడంటే.. ఆ క్రెడిట్ అంతా అనుష్క గారికే ఇచ్చేయాలేమో..
బోరింగ్ సుదీర్ఘ పర్యటనల్లో బోర్ కొట్టకుండా.. ప్లేయర్ల మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ని టూర్లకు అనుమతించాలని రవిశాస్త్రి గట్టిగా రికమండ్ చేస్తున్నారు. సాధారణంగా మైదానంలో కోచ్‌లు ఇచ్చే హెవీ స్ట్రాటజీలు, టెక్నికల్ టిప్స్ కంటే.. స్టాండ్స్‌లోంచి ఒక క్లాప్.. ఒక స్మైల్ పడితే ప్లేయర్లకు వచ్చే మోటివేషన్ వేరే లెవల్‌లో ఉంటుందని ఆయన సింపుల్‌గా తేల్చేశారు.
అయితే కోహ్లీ ఎప్పుడైనా డకౌట్ అయినా.. సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టినా.. "అనుష్క వచ్చిందే.. అందుకే వికెట్ పారేసుకున్నాడు!" అంటూ సోషల్ మీడియా ట్రోలర్స్ విరుచుకుపడేవారు. కానీ అదే అనుష్క మ్యాచ్‌కి వస్తే కోహ్లీ ఏకంగా 160 పరుగులు బాదేసేవాడని రవిశాస్త్రి చెప్తుంటే.. ఇన్నాళ్లూ అనుష్కపై నిందలు వేసిన నెటిజన్లు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
ప్రేమ అనేది కేవలం కవితలు రాయడానికే కాదు.. క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీలు బాదడానికి కూడా ఒక రకమైన 'ఇంధనం'లా పనిచేస్తుందని రవిశాస్త్రి వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. మైదానంలో విరాట్ పరుగుల వరద వెనుక 'అనుష్క ఎఫెక్ట్' ఉందన్న ఈ హాట్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
