ఆసియా కప్పే కాదు.. పీవోకే కూడా పోతుందా? పాక్ పై భారీ నిరసనలు
ఏ ముహూర్తాన పెహల్గాం దాడి దుస్సాహాసానికి దిగిందో...? అప్పటినుంచి పాకిస్థాన్ కు మొహం వాచిపోయేలా దెబ్బలు తగులుతున్నాయి.
By: Tupaki Political Desk | 29 Sept 2025 2:00 PM ISTఏ ముహూర్తాన పెహల్గాం దాడి దుస్సాహాసానికి దిగిందో...? అప్పటినుంచి పాకిస్థాన్ కు మొహం వాచిపోయేలా దెబ్బలు తగులుతున్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ కు బలూచిస్థాన్ లో తిరుగుబాటు.. ఏకంగా రైలు హైజాక్.. తెహ్రీక్ ఏ తాలిబన్ దాడులు.. ఇలా ఒకదాని వెంట ఒకటి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆసియా కప్ లో భారత్ చేతిలో పరాజయం అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి.
నేటి నుంచి పాక్ కు పీడకలే..
రెండు వారాల వ్యవధిలో ఆసియా కప్ లో మూడుసార్లు భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ ఇప్పటికే కుమిలిపోతోంది. ఇది చాలదన్నట్లు ఫైనల్ ముగిశాక మరింత షాక్ ఇచ్చింది టీమ్ ఇండియా. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి కప్ అందుకోలేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అవమానంగా మారింది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) తలనొప్పి మరింత తీవ్రం కానుంది. పాకిస్థాన్ లోని జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం పీవోకే ప్రజలు భారీఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇకనుంచి పాక్ ప్రభుత్వానికి నిద్ర కరువేనంటూ హెచ్చరికలు చేశారు.
యాక్షన్ లోకి అవామీ యాక్షన్ కమిటీ...
పీవోకేలో ఆందోళనలకు అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకత్వం వహిస్తోంది. దీని ఆధ్వర్యంలోనే భారీఎత్తున నిరసనలు సాగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వాలు తమను 80 ఏళ్లుగా ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేస్తున్నాయని ఆరోపిస్తున్న ఏఏసీ.. రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నాయని మండిపడుతున్నారు. పీవోకే లో మౌలిక సంస్కరణలు చేపట్టాలని అవామీ కమిటీకి నాయకత్వం వహిస్తున్న షౌకత్ నవాజ్ మీర్ డిమాండ్ చేశారు. 38 డిమాండ్లను పాక్ ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిని అమలు చేయాల్సిందేనంటూ షటర్ డౌన్.. వీల్ జామ్ పేరిట ఆందోళనలు, సమ్మెకు పిలుపునిచ్చింది.
విముక్తి కోసం పోరాటం... ఏం జరుగుతుందో?
పీవోకేలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు.. తమకు పాక్ చెర నుంచి విముక్తి కల్పించాలంటూ సోమవారం వీధుల్లోకి వచ్చారు. పాక్ ప్రభుత్వం తమ డిమాండ్లపై చర్చకు రావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరుతోంది. లేదంటే ఇక ఆందోళనలను తీవ్రం చేస్తామని హెచ్చరించింది. కాగా, పీవోకేలో నిరసనలను ఊహించిన పాక్ ప్రభుత్వం భారీఎత్తున పోలీసులను మోహరించింది.. ఇంటర్నెట్ ను ముందుజాగ్రత్తగా నిలిపివేసింది. ఆందోళనలను అణచివేయాలని చూస్తోంది.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజులకే స్వతంత్ర రాజ్యంగా ఉన్న కశ్మీర్ పై కన్నేసింది పాక్. అయితే, అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్ లో విలీనం చేశారు. అయితే, పాక్ మాత్రం తన దుర్బుద్ధిని చాటుతూ కశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించేసింది. ఈ సంగతి తెలిసి భారత సైన్యం వెళ్లి అడ్డుకునేసరికి కొంత ప్రాతాన్ని ఆక్రమించేసింది. కశ్మీర్ లో పాక్ ఎక్కడివరకు అయితే వచ్చి ఆగిపోయిందో ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా భారత్ పేర్కొంటోంది. 80 ఏళ్లుగా భారత్ లోని పాలకులు ఆ ప్రాంతాన్ని తిరిగి తీసుకొస్తామని చెబుతున్నా.. సాధ్యం కాలేదు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ బీజేపీ నాయకులు ఇదే మాట చెప్పారు.
-కొంతకాలంగా బలూచిస్థాన్ తో పాటు పీవోకేలోనూ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. పీవోకే త్వరలో భారత్ లో భాగం అవుతుందా? అనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
