మైదానంలో ‘ఆపరేషన్ సిందూర్’..ఆసియా కప్ విజయంపై మోదీ అదిరే ట్వీట్
ఇక క్రీడారంగానికి సంబంధించిన పలు విషయాల్లోనూ తన తక్షణ స్పందనను తెలియజేస్తుంటారు. మన జట్లు, ఆటగాళ్లు సాధించిన విజయాలను సోషల్ మీడియా ద్వారా అభినందిస్తుంటారు.
By: Tupaki Entertainment Desk | 29 Sept 2025 9:30 AM ISTజాతీయవాదానికి, దేశానికి సంబంధించిన విషయాల్లో చాలా ముందుంటారు ప్రధాని మోదీ. అదే ఆయనను మిగతా నాయకులకు భిన్నంగా నిలిపి.. భారత్ వంటి అతిపెద్ద దేశానికి ఈ కాలంలో కూడా మూడోసారి ప్రధానమంత్రిని చేసింది. ఇక క్రీడారంగానికి సంబంధించిన పలు విషయాల్లోనూ తన తక్షణ స్పందనను తెలియజేస్తుంటారు. మన జట్లు, ఆటగాళ్లు సాధించిన విజయాలను సోషల్ మీడియా ద్వారా అభినందిస్తుంటారు.
నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి...
రెండేళ్ల కిందట భారత్ వేదిక జరిగిన వన్డే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. నాడు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన మన జట్టు చివరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఫైనల్ ను చూసేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. అయితే, జట్టు ఓటమితో ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయిన సంగతిని గుర్తించి నేరుగా వారి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లారు. నాటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు, రోహిత్, కోహ్లి వంటి ఆటగాళ్లను పలకరించారు. ప్రపంచ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన పేసర్ మొహమ్మద్ షమీని గొప్పగా పొగిడి ఓదార్చారు.
తద్వారా వారికి నిర్వేదం కలగకుండా చూశారు.
అభినందన మందార మాల..
సరిగ్గా ఆరేడు నెలల్లో దాదాపు ఇదే జట్టు టి20 ప్రపంచ కప్ గెలిచాక ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ఆటగాళ్లను ప్రత్యేకంగా కలిసేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తాజాగా ఆసియా కప్ గెలిచిన జట్టుకు కూడా ఆయన వెంటనే ఎక్స్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈసారి ఆ అభినందనలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
-ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడం ద్వారా టీమ్ ఇండియా 9వ సారి టైటిల్ కొట్టింది. ఈ విజయాన్ని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పోల్చారు మోదీ. యుద్ధంలో అయినా మైదానంలో అయినా మనదే గెలుపు అనేలా ట్వీట్ చేశారు. మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్ అంటూ అదిరిపోయే పోస్ట్ పెట్టారు. ఎక్కడైనా ఫలితం అదే.. భారత్ విజయం. మన క్రికెటర్లకు అభినందనలు అని పేర్కొన్నారు.
