పాక్ జట్టుతో గుంట నఖ్వీ క్రికెట్.. కెప్టెన్ ను మళ్లీ మార్చేశాడు
కానీ, నిరుడు అక్టోబరులో వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ కు బాధ్యతలు అప్పగించారు. అతడి సారథ్యంలో పాక్ జట్టు ఆస్ట్రేలియాలో 2-1తో వన్డే సిరీస్ గెలిచి సంచలనం రేపింది.
By: Tupaki Entertainment Desk | 21 Oct 2025 12:30 PM ISTఆసియా కప్ ఎత్తుకెళ్లి మూడు వారాలు దాటినా ఇప్పటికీ విజేత జట్టు టీమ్ ఇండియాకు దానిని అప్పగించే ప్రయత్నం చేయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ... తమ దేశ జట్టుతో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం దేశాన్నే అభాసుపాల్జేస్తున్నాడు.
12 నెలల్లో మూడోవాడు
గత ఏడాది అక్టోబరు వరకు పాకిస్థాన్ జట్టు వన్డే కెప్టెన్ గా స్టార్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ కొనసాగాడు. అయితే, రెండేళ్ల కిందట వన్డే ప్రపంచ కప్ లో దారుణంగా విఫలమైనా ఏడాది పాటు అతడు కెప్టెన్ గా కొనసాగాడు. కానీ, నిరుడు అక్టోబరులో వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ కు బాధ్యతలు అప్పగించారు. అతడి సారథ్యంలో పాక్ జట్టు ఆస్ట్రేలియాలో 2-1తో వన్డే సిరీస్ గెలిచి సంచలనం రేపింది. 2002 తర్వాత ఆస్ట్రేలియాలో పాక్ వన్డే సిరీస్ నెగ్గడం అదే మొదటిసారి. కానీ, రిజ్వాన్ కెప్టెన్సీ ఆ తర్వాత చెత్త రికార్డులు మూటగట్టుకుంది.
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-3తో, జింబాబ్వేపైనా 1-2తో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ముక్కోణపు సిరీస్ లో, చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే ఓడిపోయింది. 2-1తో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో కూడా పరాజయం పాలైంది. 34 ఏళ్ల తర్వాత ఆ జట్టుతో కరీబియన్ దీవుల్లో తొలిసారి ఓటమి చూసింది. దీంతో రిజ్వాన్ ను తాజాగా కెప్టెన్సీ నుంచి తప్పించాడు నఖ్వీ.
అతడికి కెప్టెన్సీ సరైనదేనా?
రిజ్వాన్ మంచి వికెట్ కీపర్ బ్యాటర్. అతడికి కనీసం రెండు, మూడేళ్లయినా చాన్సులు ఇవ్వకుండా కెప్టెన్సీ నుంచి తప్పించడం నఖ్వీ పాక్ జట్టుతో ఆడుకుంటున్న తీరును చాటుతోంది. పోనీ, అతడి స్థానంలో కెప్టెన్ ను చేసింది ఎవరిని అంటే.. పేస్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిదీని. దీంతో ఏడాదిలో పాక్ వన్డే జట్టుకు ముగ్గురు కెప్టెన్లు మారినట్లు అయిందన్నమాట. పైగా, షహీన్ షా ఆఫ్రిదీ ఫామ్ ఏమంత గొప్పగా లేదు. ఇటీవల ఆసియా కప్ లో అతడు విఫలం అయ్యాడు కూడా. బౌలర్ గా తన పాత్రకు న్యాయం చేయలేదు. అలాంటివాడికి వచ్చే నెల 4 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కెప్టెన్సీ అప్పగించడం గమనార్హం.
వాస్తవానికి ఆఫ్రిది మంచి పేసర్. కానీ, బౌలింగ్ లో పదును తగ్గింది. బ్యాట్ తో మాత్రం పరుగులు చేస్తున్నాడు. ఇప్పటికే అతడిని ఓసారి టి20 కెప్టెన్ గా పరీక్షించి ఫెయిలవడంతో తొలగించారు. నిరుడు జనవరిలో పాకిస్థాన్ ఆఫ్రిది సారథ్యంలో న్యూజిలాండ్ పై 5 టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడి ఏకంగా 4-1తో ఓడింది. అతడిని తప్పించి సల్మాన్ ఆఘాకు కు బాధ్యతలు అప్పగించారు. ఆసియా కప్ లో ఆఘా సారథ్యంలోనే పాక్ ఆడిన విషయం అందరికీ తెలిసిందే. టి20 కెప్టెన్ గా విఫలమైన, బౌలర్ గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న, గాయాల బెడద కూడా ఉన్న ఆఫ్రిదీని ఏకంగా వన్డే కెప్టెన్ చేయడం పాకిస్థాన్ క్రికెట్ లో నఖ్వీ ఇష్టారాజ్యాన్ని చాటుతోంది.
కొసమెరుపుః ఔను... ఆసియా కప్ ఇంతకూ నఖ్వీ ఎక్కడ దాచాడు.. అది టీమ్ ఇండియాకు ఎప్పుడు చేరుతుంది..?
