Begin typing your search above and press return to search.

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, భార్య బెకీ మధ్య గొడవ జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఈ రూమర్లు మొదలయ్యాయి. అయితే తమ మధ్య ఎలాంటి గొడవ లేదని బెకీ ఫొటో ద్వారా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై కమిన్స్ రేపు మీడియా ముందుకు రానున్నారు.

By:  A.N.Kumar   |   13 Nov 2026 1:00 AM IST
తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో
X

మైదానంలో ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్.. ఇప్పుడు సొంత ఇంటి గడప వద్ద భార్య వేస్తున్న ప్రశ్నల ముందు మాత్రం ఏకంగా లెక్కలు చెప్పలేక తలపట్టుకుంటున్నారు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కాస్తా ఇప్పుడు ఏకంగా కాపురంలో చిచ్చు పెట్టిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తే.. ఆసీస్ కెప్టెన్‌కు మైదానం బయట అసలైన మ్యాచ్‌ మొదలైందని స్పష్టమవుతోంది.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ భూతం మరోసారి పడగ విప్పింది. మైదానంలో బ్యాటర్లను బోల్తా కొట్టించాల్సిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పుడు సొంత భార్య ముందు ఎలాంటి బౌన్సర్లు ఎదుర్కొంటున్నారో చూస్తుంటే నవ్వుకోవాలో.. జాలిపడాలో అర్థం కాదు. ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ రచ్చ.. ఇప్పుడు ఏకంగా కమిన్స్ కాపురం వరకు పాకిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు.

అసలే బాల్ ట్యాంపరింగ్ మంటలతో ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ అట్టుడుకుతుంటే.. తాజాగా కమిన్స్ దంపతుల మధ్య పబ్లిక్ ప్లేస్‌లో గొడవ జరిగినట్లు చెప్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోలో భార్య బెకీ సీరియస్‌గా వాదిస్తుంటే కెప్టెన్ సాబ్ కమిన్స్ మాత్రం ముఖం మాడ్చుకుని ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన సోషల్ మీడియా వీరులకు కావాల్సినంత మసాలా దొరికేసింది. "మైదానంలో బౌలర్లకు వ్యూహాలు చెప్పే కెప్టెన్.. ఇంట్లో మాత్రం భార్యకు రివ్యూలు ఇచ్చుకుంటున్నాడు" అంటూ నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. బాల్ ట్యాంపరింగ్ వివాదం ఇప్పుడు ఇంటి గడప దాటి బెడ్‌రూమ్‌లోకి కూడా వెళ్లిందంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి.

అయితే ఈ సోషల్ మీడియా గోల అంతా ఉత్తిదేనని.. తమ మధ్య అలాంటి గొడవలు ఏవీ లేవని బెకీ ఒక ఫొటో ద్వారా క్లారిటీ ఇచ్చి ఆ రూమర్లకు బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది. అయినా సరే నెటిజన్ల ట్రోలింగ్ ఆగేలా లేదు. ఒకవైపు ఉస్మాన్ ఖవాజా పుణ్యమా అని "ఎవరికి ఏ విషయం ముందే తెలుసు?" అనే పాత కుళ్లు కబుర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. మరోవైపు ఈ వివాదంపై రేపు పాట్ కమిన్స్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వబోతున్నారు.

క్రికెట్‌లో బంతి స్వింగ్ అవుతుందో లేదో పక్కన పెడితే.. ఈ బాల్ ట్యాంపరింగ్ వివాదం మాత్రం సోషల్ మీడియాలో మాత్రం అటూ ఇటూ చక్కర్లు కొడుతూ బాగానే స్వింగ్ అవుతోంది. రేపు కమిన్స్ మీడియా సమావేశంలో ఏ ముసుగు తొలగిస్తారో.. ఏ నిజాలు బయటపెడతారో చూడాలి మరి..