నఖ్వీ పాక్ లో అంతే.. నిన్న కెప్టెన్.. నేడు క్రికెట్ బోర్డు డైరెక్టర్
షాన్ మసూద్.. పాకిస్థాన్ క్రికెట్ లో సగటు ఆటగాడు. కానీ, కెప్టెన్ అయ్యాడు. మేటి బ్యాట్స్ మన్ బాబర్ అజామ్, మంచి వికెట్ కీపర్ బ్యాటర్ అయిన మొహమ్మద్ రిజ్వాన్ లను కాదని ఏకంగా టెస్టులకు సారథిగా చేశారు అతడిని.
By: Tupaki Entertainment Desk | 25 Oct 2025 2:42 PM ISTరాజకీయం-సైన్యం కలిసిపోయిన దేశం అది.. రాజకీయం-క్రికెట్ కూడా ఒక్కటిగా కనిపించే దేశం కూడా అదే...! అలాంటిచోట నిన్నటివరకు క్రికెటర్ నేడు క్రికెట్ డైరెక్టర్ కావడంలో విచిత్రం ఏముంది..? సహజంగా ఏ దేశంలోనైనా క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు ఆ దేశ క్రికెట్ పాలనలోకి వెళ్తారు. లేదా కోచ్ లుగా మారుతారు. కానీ, పాకిస్థాన్ లో మాత్రం మొన్నటివరకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడు ఇప్పుడు ఏకంగా క్రికెట్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు అదే వింత.
సగటు ఆగటాడు.. కెప్టెన్
షాన్ మసూద్.. పాకిస్థాన్ క్రికెట్ లో సగటు ఆటగాడు. కానీ, కెప్టెన్ అయ్యాడు. మేటి బ్యాట్స్ మన్ బాబర్ అజామ్, మంచి వికెట్ కీపర్ బ్యాటర్ అయిన మొహమ్మద్ రిజ్వాన్ లను కాదని ఏకంగా టెస్టులకు సారథిగా చేశారు అతడిని. కానీ, ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ లో రెండో టెస్టులో పాకిస్థాన్ జట్టు ఓడిపోవడంతో షాన్ మసూద్ కెప్టెన్ గా తప్పుకొన్నాడు. అయితే, ఇతడిని ఆ వెంటనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డైరెక్టర్ పదవి ఇవ్వడం గమనార్హం. ఈ పదవిని ఇచ్చింది కూడా ఎవరో కాదు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా తీవ్ర వివాదాస్పదుడైన పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ. 36 ఏళ్ల షాన్ మసూద్ రెండేళ్లు కూడా టెస్టు కెప్టెన్ గా లేడు. అసలు అతడు ఆడింది 44 టెస్టులు, 9 వన్డేలు, 19 టి20లు. అయితే, టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. అతడు కెప్టెన్ అయ్యాక ఆడినవే ఎక్కువ. 2,550 పరుగులు చేసిన అతడి సగటు 30.72 మాత్రమే. దీన్నిబట్టే అతడు ఎంత సాధారణ ఆటగాడో తెలుస్తోంది.
ఇప్పుడు ఎవరు కెప్టెన్..?
బాబర్, రిజ్వాన్ లను తొలగించారు. షాన్ మసూద్ కూడా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. మరి టెస్టుల్లో పాక్ కెప్టెన్సీ చేపట్టేది ఎవరు? అంటే, దీనికి సమాధానం లేదు. అసలు షాన్ మసూద్ ఇంకా రిటైర్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటివాడిని ఏకంగా బోర్డు డైరెక్టర్ చేశాడు నఖ్వీ. వాస్తవానికి ఈ పోస్టు కోసం దరఖాస్తులను పిలిచి, వారం గడువు ఉండగానే ఆలోగానే షాన్ మసూద్ ను డైరెక్టర్ ను చేసేశాడు నఖ్వీ.
ఆసియా కప్ తీరుతో..
ఉస్మాన్ వహ్లా స్థానంలో షాన్ మసూద్ పీసీబీ అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్ వ్యవహారాలు చూడనున్నాడు. వహ్లాను ఆసియా కప్ లో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదని తప్పించడం గమనార్హం. ఇక నఖ్వీ ఆసియాకప్ ను ఇప్పటివరకు భారత్ కు అప్పగించలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అయినప్పటికీ పీసీబీ చైర్మన్ కాబట్టి పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు నిరసనగా అతడి నుంచి కప్ ను తీసుకోలేదు టీమ్ ఇండియా.
