ఇక ఇంట్లోనే ఆడుకోండి... పాక్ క్రికెటర్లకు ఆ దేశ బోర్డు శిక్ష
క్లాస్ తో పాటు మాస్ కూడా ఉన్న సీనియర్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్, కెప్టెన్ అయిన మొహమ్మద్ రిజ్వాన్ ను ఆసియా కప్ నకు ఎంపిక చేయకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తిక్క పని చేసింది.
By: Tupaki Entertainment Desk | 1 Oct 2025 9:26 AM ISTక్లాస్ తో పాటు మాస్ కూడా ఉన్న సీనియర్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్, కెప్టెన్ అయిన మొహమ్మద్ రిజ్వాన్ ను ఆసియా కప్ నకు ఎంపిక చేయకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తిక్క పని చేసింది. వీరిద్దరూ కచ్చితంగా తుది జట్టులోనూ ఉండాల్సిన ఆటగాళ్లు. ఫామ్ లో లేరు అనుకుంటే.. కనీసం ఒకరినైనా కొనసాగించవచ్చు. కానీ, ఇద్దరినీ కీలకమైన టోర్నీకి పక్కనపెట్టింది. అసలు ఆటగాడి కూడా జట్టులో అర్హత లేని సల్మాన్ అఘాను కెప్టెన్ చేసి ఆసియా కప్ నకు పంపింది. తీరా చూస్తే.. లక్ కొద్దీ ఫైనల్ కు చేరినా టీమ్ ఇండియా చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు మరో పనికిమాలిన నిర్ణయం తీసుకుంది.
ఇదీ పాక్ మార్క్
ఆఘా వంటి వాడి కెప్టెన్సీలో అయినా ఆసియా కప్ లో పాక్ ఫైనల్ కు వచ్చింది. అయితే, టీమ్ ఇండియా చేతిలో మూడుసార్లు ఓడింది. అతడికి కనీసం షేక్ హ్యాండ్ భాగ్యం కూడా ఇవ్వలేదు టీమ్ ఇండియా. అయితే, మొత్తం పాక్ జట్టు పరంగా చాలా లోపాలున్నాయి. హారిస్ రవూఫ్ వంటి బౌలర్ ను నమ్ముకుని ఫైనల్లో చివరి ఓవర్ ను ఇవ్వడం, బ్యాటింగ్ లో సయీమ్ అయూబ్ నాలుగు డక్ లు పెట్టినా వన్ డౌన్ లో కొనసాగించడం.. ఇలా చెప్పుకొంటూ పోతే చండాలం చాలా ఉంది. కానీ, ఇవేవీ సరిదిద్దుకోకుండా ఏకంగా ఆటగాళ్లపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే వారు ఇకమీదట విదేశీ లీగ్ లలో ఆడకూడదని ఆదేశాలిచ్చింది.
-ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లీగ్ లు నడుస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను చూసి పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అంటూ మొదలుపెట్టింది. కానీ, రెండింటికీ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాగా, ఒక దేశ క్రికెటర్లు విదేశీ లీగ్ లు ఆడాలంటే వారికి ఆ దేశ క్రికెట్ బోర్డు నిరభ్యంతర పత్రం (నో అబక్షన్ సర్టిఫికెట్-ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాల ఆదుకుంటుంది కాబట్టి.. టీమ్ ఇండియా ఆటగాళ్లకు మాత్రం అసలు విదేశీ లీగ్ లకు అనుమతే లేదు. పాకిస్థాన్ బోర్డు, ఆటగాళ్లకు డబ్బు లేదు కాబట్టి వారు విదేశీ టోర్నీలు ఆడుతుంటారు. ఇకమీదట మాత్రం అదీ లేదు.
టీమ్ ఇండియా దెబ్బకు...
టి20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ లో టీమ్ ఇండియా మూడుసార్లు పాక్ ను ఓడించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు కళ్లు బైర్లు కమ్మాయి. అందుకనే విదేశీ టి20 లీగ్ లు, టోర్నీలకు ఆటగాళ్లకు ఎన్ వోసీ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ లెక్కన వారు దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యం ఇస్తారని భావిస్తోంది. అయితే, భారత క్రికెటర్లలా పాక్ క్రికెటర్లకు రూ.కోట్లకు కోట్లు ఆదాయం రాదు. వారు విదేశీ లీగ్ లు ఆడకుంటే వచ్చే ఆదాయమూ పోతుంది. ఈ నిర్ణయం చివరకు పాక్ క్రికెట్ కు ముసలం తెచ్చే ప్రమాదం లేకపోలేదు. తమకు విదేశీ లీగ్ లే ముఖ్యం అనుకుంటే కొందరైనా పాక్ క్రికెట్ బోర్డును ధిక్కరించే చాన్స్ ఉంది.
