ఎడమ చేత్తో ఒక్క క్యాచ్‌తో కోటీశ్వరుడు: SA20 లీగ్‌లో అభిమాని అదృష్టం..
సుడి ఉంటే మీరు ఎక్కడున్నా కానీ అదృష్టం పడుతుందని అంటారు. సౌతాఫ్రికాలో కూడా ఇప్పుడు ఒకతడికి గట్టిగానే సుడి ఉంది.
By: A.N.Kumar | 28 Dec 2025 4:32 PM ISTసుడి ఉంటే మీరు ఎక్కడున్నా కానీ అదృష్టం పడుతుందని అంటారు. సౌతాఫ్రికాలో కూడా ఇప్పుడు ఒకతడికి గట్టిగానే సుడి ఉంది. సాధారణంగా ఆటగాళ్లే సిక్సర్లను రెండు చేతులతో పట్టుకోవడానికి కష్టపడుతారు. అలాంటిది ఒక్క చేత్తో సిక్సర్ ను పట్టుకోవడం.. అది ఎడమచేతితో అంటే వాడు గట్టోడే అని చెప్పొచ్చు. అలా పడితే ఏకంగా కోటి రూపాయలు ఇస్తారు. అలా పట్టి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు ఓ యువకుడు.
అదృష్టం ఉంటే ఎలాగైనా లక్ష్మీ దేవి కనికరిస్తుందన్నది నానుడి. ఇప్పుడు సౌతాఫ్రికా లీగ్ మ్యాచుల్లో ఓ యువకుడికి ఇలానే అదృష్టం తలుపుతట్టింది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమానిని అదృష్టం వరించింది. మైదానంలో ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపిస్తుంటే.. గ్యాలరీలో ఉన్న సదురు అభిమాని మాత్రం ఇప్పుడు ‘ధనవర్షం’లో మునిగిపోయాడు. సౌతాఫ్రికా ప్లేయర్ ర్యాన్ రికెల్టన్ కొట్టిన సిక్సర్ ను ఒంటిచేత్తో పట్టుకున్న ఓ యువకుడు ఏకంగా రూ.1.08 కోట్లు (2 మిలియన్ ర్యాండ్లు) గెలుచుకున్నాడు.
అసలేం జరిగింది?
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్ ప్రారంభ మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్ టౌన్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్ టౌన్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మ్యాచ్ 13వ ఓవర్లో మఫాక వేసిన బంతిని రికెల్టన్ భారీ సిక్సర్ గా మలిచాడు. ఆ బంతి నేరుగా స్టాండ్స్ లోకి వెళ్లగా.. అక్కడ ఉన్న ఒక అభిమాని అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఒంటిచేత్తో ఆ బంతిని అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.
నియమం ఏంటంటే?
సౌతాఫ్రికా లీగ్ లో ‘క్యాచ్ ఏ మిలియన్’ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. దీని ప్రకారం.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు, బ్యాటర్ కొట్టిన సిక్సర్ ను క్లీన్ గా ఒంటిచేత్తో పట్టుకుంటే భారీ నగదు బహుమతి లభిస్తుంది. ప్రస్తుత సీజన్ బహుమతి మొత్తం 2 మిలియన్ రాండ్లు (సుమారు రూ.1.08 కోట్లు). టోర్నీ ముగిసేలోపు లా ఎంతమంది క్యాచ్ లు పడితే.. ఆ మొత్తాన్ని అందరికీ సమానంగా పంచుతారు. ప్రస్తుతం ఈ సీజన్ లో క్యాచ్ పట్టిన మొదటి వ్యక్తి ఇతడే కావడంతో ప్రస్తుతానికి ఆ కోటి రూపాయలు అతడి ఖాతాలోనే ఉన్నాయి.
మ్యాచ్ హోరాహోరీ..
రికెల్టన్ 113 పరుగులతో వీరోచిత సెంచరీ చేసినప్పటికీ ఎంఐ కేప్ టౌన్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డర్బన్ సూపర్ జెయింట్స్ తరుఫున డెవాన్ కాన్వే (64), కేన్ విలయమ్సన్ (40) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.మ్యాచ్ లో ఎంఐ కేప్ టౌన్ ఓడినా.. ఆ అభిమాని మాత్రం కోటీశ్వరుడిగా ఇంటికి వెళ్లడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
