ఒలింపిక్స్ 2028లో పాక్ క్రికెట్ టీంకు ఊహించని షాక్
123 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడను చేరుస్తున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స లో పాక్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగలటం ఖాయమని చెబుతున్నారు.
By: Garuda Media | 31 July 2025 9:41 AM IST123 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడను చేరుస్తున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స లో పాక్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగలటం ఖాయమని చెబుతున్నారు. పాక్ పురుషుల జట్టుకు ఒలింపిక్స్ లో ఆడే అవకాశం ఉండకపోవటమే దీనికి కారణం. అదెలా? అంటే.. ఒలంపిక్స్ లో క్రికెట్ టీంలను క్వాలిఫై చేసేందుకు డిసైడ్ చేయాలని భావిస్తున్న నిబంధనలే దీనికి కారణమని చెప్పాలి. పాక్ జట్టు మాత్రమే కాదు క్రికెట్ అగ్రశ్రేణి జట్టల్లో ఒకటైన న్యూజిలాండ్ కు సైతం చోటు లభించే అవకాశం ఉండదనిచెబుతున్నారు.
క్రికెట్ అత్యున్నత పాలక సంస్థ అయిన ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఇటీవల సమావేశమై.. ఒలింపిక్స్ లో బరిలో ఉండే జట్లకు ఉండాల్సిన అర్హత మార్గాల్ని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో ప్రాంతీయ అర్హతతో ఒలింపిక్స్ కు వెళ్లేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న క్రికెట్ లో కేవలం ఆరు జట్లను మాత్రం అనుమతి ఇస్తారు. అంటే.. ఆరు పురుషల జట్లు.. మరో ఆరు మహిళల జట్లు.
రీజినల్ పరంగా ఆసియా.. ఓషియానియా.. యూరప్.. ఆఫ్రికా ఖండాల్లో తొలి స్థానాల్లో ఉన్న జట్లను ఎంపిక చేస్తారు. అతిధ్యం ఇచ్చే దేశానికి నేరుగా చోటు కల్పిస్తారు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల ఆధారంగా చూస్తే.. ఆసియాలో భారత్ నెంబరు వన్ స్థానంలో ఉంది. ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా.. ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా.. యూరప్ నుంచి ఇంగ్లాండ్ లు టాప్ ర్యాంకుల్లో ఉన్నాయి. అతిథ్య జట్టు కోటాలో అమెరికాకు అర్హత లభిస్తుంది.
ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్ లో పాక్ ఎనిమిదో స్థానంలో.. శ్రీలంక ఏడో స్థానంలో ఉన్నాయి. ఓషియానియాలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కు కూడా ఒలింపిక్స్ బెర్తు లభించదని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను ఐసీసీ బోర్డు అధికారికంగా ఆమోదించలేదు.కానీ.. దాదాపు ఇప్పటికే అనుకున్నట్లుగానే అమలు చేసే వీలుందని చెబుతున్నారు. పురుషుల అర్హత ఇప్పటికే డిసైడ్ కాగా.. మహిళలకు సంబంధించినఅర్హత జట్లను వచ్చే ఏడాదిజరిగే టీ20 ప్రపంచకప్ ద్వారా డిసైడ్ చేస్తారని చెబుతున్నారు. 2028 ఒలింపిక్స్ లో టీ20 ఫార్మాట్ లో పురుషుల.. మహిళల జట్లు బరిలోకి దిగుతాయి. 1900లో చివరిగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో బ్రిటన్ కు చెందిన డెవాన్ అండ్ సోమర్ సెట్ వండరర్స్ జట్టు విజేతగా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత తీసుకొస్తున్న క్రికెట్ క్రీడలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
