ఆస్ట్రేలియా టూర్.. తెలుగోడు నితీశ్ కుమార్ రెడ్డికి బంపరాఫర్
ఈ నెల 19 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో మరో విశేషం ఏమంటే.. తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం.
By: Tupaki Entertainment Desk | 5 Oct 2025 1:00 AM ISTస్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ కు టీమ్ ఇండియా ఎంపిక చర్చనీయాంశం అయింది. కొత్త కెప్టెన్ గా టెస్టు సారథి శుబ్ మన్ గిల్ ను అనూహ్యంగా నియమించడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నెల 19 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో మరో విశేషం ఏమంటే.. తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటుదక్కడం. ఇప్పటివరకు టి20లు, టెస్టుల్లో మాత్రమే దేశానికి ఆడాడు నితీశ్. 8 టెస్టులు, 4 టి20ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడీ విశాఖపట్నం కుర్రాడు. ఇంకా వన్డే జట్టులోకి ఎంపికవలేదు. ఆస్ట్రేలియా టూర్ తో ఆ భాగ్యం కూడా దక్కనుంది.
నిరుడు టెస్టులు.. నేడు వన్డేలు...
గత ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్ పై టి20లు, ఆస్ట్రేలియా టూర్ లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నితీశ్ కుమార్ రెడ్డి. అక్కడ సెంచరీ కూడా కొట్టాడు. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయాల బెడద ఉండడం, అతడు టెస్టులు ఆడే ఉద్దేశంలో లేకపోవడంతో నితీశ్ టెస్టు ఫార్మాట్ కు రెగ్యులర్ అయ్యేలా కనిపించాడు. కానీ, గాయాల బారినపడ్డాడు. ఇటీవలి ఇంగ్లండ్ టూర్ లో ఫర్వాలేదనిపించేలా ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే జట్టులోకీ ఎంపికయ్యాడు. హార్దిక్ గాయంతో టీమ్ ఇండియాలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఖాళీ ఏర్పడింది. దీనిని నితీశ్ ఎంతవరకు అందిపుచ్చుకుంటాడో చూడాలి.
-నితీశ్ కుమార్ రెడ్డి తో పాటు ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో మరో యువ ప్రతిభావంతుడు, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కూ చోటు లభించింది. టెస్టుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని జురెల్ సద్వినియోగం చేసుకుంటున్నాడు.
టి20ల్లోకి రీఎంట్రీ..
వన్డేలకు తొలిసారి ఎంపికయిన నితీశ్ కు ఆస్ట్రేలియాతో జరిగే ఐడు టి20ల సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గత ఏడాది బంగ్లాదేశ్ తో సిరీస్, ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్ తో కోల్ కతాలో టి20 తర్వాత మళ్లీ అతడు ఈ ఫార్మాట్ లో టీమ్ ఇండియాకు ఆడలేదు. ఇప్పుడు ఆసీస్ టూర్ కు హార్దిక్ గాయంతో తప్పుకోవడంతో నితీశ్ కు పిలుపుదక్కింది. కాగా, ఆస్ట్రేలియాతో సిరీస్ కు మేటి పేస్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. టి20లకు మాత్రం ఎంపిక చేశారు. సమీకరణాల ప్రకారం చూస్తే.. నితీశ్ వన్డే, టి20 తుది జట్టులో ఉండే అవకాశాలే ఎక్కువ.
-కొంతకాలంగా వన్డేల్లో రాణిస్తున్నప్పటికీ ఏదో ఒక వివాదంతో చర్చల్లో ఉంటున్న శ్రేయస్ అయ్యర్ కు వన్డే వైస్ కెప్టెన్సీ దక్కింది.
ఇదీ ఆస్ట్రేలియా టూర్ కు జట్టు..
వన్డేలుః శుబ్ మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ రెడ్డి, సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైశ్వాల్.
టి20లు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్, కుల్దీప్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
