ఐపీఎల్‌లో నో ఛాన్స్.. నేడు ‘కోట్ల’ సామ్రాజ్యం: నీలేశ్ కులకర్ణి సక్సెస్ స్టోరీ!
క్రికెట్ అంటే కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం.. లక్షలాది మంది కల.
By: A.N.Kumar | 29 Dec 2025 4:00 AM ISTక్రికెట్ అంటే కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం.. లక్షలాది మంది కల. అయితే టీమిండియా తరుఫున ఆడి అద్భుత రికార్డ్ సృష్టించినా.. ఐపీఎల్ లాంటి భారీ లీగ్ లలో అవకాశం దక్కక కెరీర్ ముగిసిపోతుందని భయపడే వారికి నీలేశ్ కులకర్ణి ఒక గొప్ప ఉదాహరణ.. క్రికెట్ బ్యాట్ వదిలేసినా.. క్రీడారంగంలోనే అజేయమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం..
తొలిబంతికే వికెట్.. అరుదైన రికార్డ్..
భారత క్రికెట్ చరిత్రలో నీలేశ్ కులకర్ణి పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1997లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఆయన అరంగేట్రం చేశారు. తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసి టెస్ట్ క్రికెట్ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా చరిత్ర సృష్టించారు. కానీ.. అదే మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్లు రికార్డు స్థాయిలో పరుగులు చేయడంతో ఆ తర్వాత 70 ఓవర్ల పాటు ఆయనకు వికెట్ దక్కలేదు. క్రికెట్ దేవుడు ఒక వైపు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చినా మరోవైపు కఠిన పరీక్షను ఎదురుచూసేలా చేశాడు.
ఐపీఎల్ నిరాశ.. జీవితంలో కొత్త మలుపు
కొన్ని ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్ లో ముంబై తరుఫున రాణించిన ‘నీలేశ్ కులకర్ణి’కి 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో యంగ్ ప్లేయర్లకున్న క్రేజ్ మధ్య సీనియర్ అయిన నీలేశ్ కు ఏ ఫ్రాంచైజీలోనూ చోటు దక్కలేదు. ఒక క్రికెటర్‌గా మైదానంలో అవకాశం కోల్పోవడం ఆయనను మానసికంగా కృంగదీసినా అక్కడే ఆయన తన జీవితాన్ని మరో కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు. మైదానంలో క్రికెట్ ఆడలేకపోయినా.. క్రీడారంగంలోనే విజేతగా నిలవాలి అన్న ఉద్దేశంతో ఆయనను కొత్త దిశగా నడిపించింది.
క్రీడల పట్ల తనకున్న మక్కువను వ్యాపార దృక్పథంతో జోడించారు నీలేశ్. భారతదేశంలో క్రికెట్ ఎంత పాపులరో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అనేది అంత అపరిపక్వంగా ఉందని ఆయన గుర్తించారు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ (IISM).కేవలం ఆటగాళ్లనే కాకుండా, క్రీడల వెనుక ఉండి నడిపించే ప్రొఫెషనల్స్‌ను మేనేజర్లు, మార్కెటింగ్ నిపుణులు తయారు చేయడద దీని ఉద్దేశం. అతి తక్కువ వనరులతో మొదలైన ఈ సంస్థ నేడు దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కాలేజీలలో ఒకటిగా నిలిచింది.క్రీడా విద్యా రంగంలో ఆయన చేసిన కృషికి గాను ప్రధాని మోదీ చేతుల మీదుగా 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్' వంటి గౌరవాలను అందుకున్నారు.
ఓటమిని గెలిచిన యోధుడు నీలేశ్
ఒకప్పుడు ఐపీఎల్ లో ఆడే అవకాశం రాలేదని బాధపడిన అదే వ్యక్తి, నేడు వందలాది మంది ఐపీఎల్ మేనేజర్లను, స్పోర్ట్స్ ఎనలిస్టులను తయారు చేసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన సంస్థ విలువ కోట్లలో ఉంది. ఆటగాడిగా విఫలమైన చోట, ఒక వ్యవస్థాపకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. నీలేశ్ కులకర్ణి ప్రయాణం మనకు ఒకే విషయాన్ని చెబుతుంది. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరొకటి కచ్చితంగా తెరుచుకుంటుంది. ఓటమిని అంతిమంగా భావించవద్దని తెలుసుకున్నాడు. నేడు ఐపీఎల్ లో కోట్లు సంపాదించే ఆటగాళ్ల కంటే క్రీడారంగంలో ఒక స్థిరమైన విద్యా వ్యవస్థను నిర్మించిన నీలేశ్ కులకర్ణి ప్రయాణం నిజంగా సెల్యూట్ చేయదగ్గది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
