Begin typing your search above and press return to search.

బ్రెజిల్ ప్రపంచకప్ కల చెదిరింది.. నెయ్ మార్ ను రిటైర్ అయ్యేలా చేసింది..

2010లో బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నెయ్‌మార్, దాదాపు 16 ఏళ్ల పాటు సాగిన తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను సృష్టించాడు.

By:  A.N.Kumar   |   6 July 2026 10:25 AM IST
బ్రెజిల్ ప్రపంచకప్ కల చెదిరింది.. నెయ్ మార్ ను రిటైర్ అయ్యేలా చేసింది..
X

బ్రెజిల్ ఫుట్‌బాల్ అభిమానులకు ఇది కోలుకోలేని దెబ్బ. ప్రపంచ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్‌కు తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టిన స్టార్ స్ట్రైకర్, మోడ్రన్ ఫుట్‌బాల్ దిగ్గజం నెయ్‌మార్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు కూడా చేరకముందే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నెయ్‌మార్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రి-క్వార్టర్స్‌కు ముందే నార్వే చేతిలో బ్రెజిల్ 2-1 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోనే నెయ్‌మార్ కన్నీరుమున్నీరయ్యాడు. భావోద్వేగంతో నిండిన స్వరంతో మాట్లాడుతూ.. "నేను దేశం కోసం నా వంతు ప్రయత్నం మొత్తం చేశాను. కానీ దురదృష్టవశాత్తూ ఇక్కడితో అంతా ముగిసిపోయింది. ఏ వేదికపై అయితే నా అంతర్జాతీయ ప్రయాణం మొదలైందో.. సరిగ్గా ఇక్కడే ముగుస్తోంది" అని ప్రకటించి అభిమానుల గుండెల్ని పిండేశాడు.

ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది: నెయ్‌మార్ కెరీర్ ట్రాక్ రికార్డ్

2010లో బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నెయ్‌మార్, దాదాపు 16 ఏళ్ల పాటు సాగిన తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను సృష్టించాడు. దేశం తరఫున 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నెయ్‌మార్, 80 కి పైగా గోల్స్ నమోదు చేశాడు. తద్వారా బ్రెజిల్ ఫుట్‌బాల్ చరిత్రలోనే 'అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా పెలే రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. బ్రెజిల్ తరఫున నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లలో ప్రాతినిధ్యం వహించి జట్టును ముందుండి నడిపించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, దేశానికి చారిత్రాత్మక బంగారు పతకాన్ని అందించాడు. విశేషం ఏంటంటే, న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలోనే 2010లో నెయ్‌మార్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే మైదానంలో తన రిటైర్మెంట్‌ను ప్రకటించడం ఒక యాదృచ్ఛికం.

నార్వే చేతిలో బ్రెజిల్ దారుణ పరాజయం

ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఓటమికి తొలి అర్ధభాగంలో లభించిన అవకాశాలను చేజార్చుకోవడమే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభంలో బ్రెజిల్‌కు లభించిన గోల్ చేసే సువర్ణావకాశాన్ని (పెనాల్టీ) బ్రూనో గిమారెస్ చేజార్చుకున్నాడు. నార్వే గోల్‌కీపర్ దానిని అద్భుతంగా అడ్డుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇదే తరుణంలో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ చెలరేగిపోయి రెండు అద్భుతమైన గోల్స్ చేసి బ్రెజిల్ ఆశలపై నీళ్లు చల్లాడు.

రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగిన నెయ్‌మార్, చివరి నిమిషాల్లో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచాడు. కానీ అప్పటికే నార్వే ఆధిక్యంలో ఉండటంతో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. తొలి పెనాల్టీ కనుక గోల్‌గా మారి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు.

1990 తర్వాత ఘోర పరాభవం

1990 ప్రపంచకప్ తర్వాత బ్రెజిల్ ఇంత త్వరగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే తొలిసారి. అటు ప్రపంచకప్ కల చెదరడం, ఇటు ఫుట్‌బాల్ సాంబ శిఖరం నెయ్‌మార్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బ్రెజిల్ ఫుట్‌బాల్ చరిత్రలో ఒక విషాద అధ్యాయం లిఖించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ దిగ్గజ ఆటగాడికి "#ThankYouNeymar" అంటూ భావోద్వేగ వీడ్కోలు పలుకుతున్నారు.