Begin typing your search above and press return to search.

వరుణ్ చక్రవర్తి విజయానికి భార్య నేహా చేసిన గొప్ప త్యాగమిదీ

సాధారణంగా ఏ జంట అయినా పెళ్లికి ముందు అబ్బాయి సెటిల్ అయ్యాడా? లేదా? అని ఆలోచిస్తుంది.

By:  A.N.Kumar   |   20 Feb 2026 9:50 AM IST
వరుణ్ చక్రవర్తి విజయానికి భార్య నేహా చేసిన గొప్ప త్యాగమిదీ
X

సాధారణంగా ఏ జంట అయినా పెళ్లికి ముందు అబ్బాయి సెటిల్ అయ్యాడా? లేదా? అని ఆలోచిస్తుంది. కానీ "నువ్వు నీ కల కోసం పోరాడు.. మన సంసారాన్ని నేను చూసుకుంటాను" అని ఒక అమ్మాయి ధైర్యం చెబితే.. ఆ అండ ఇచ్చే ధైర్యమే వేరు. టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జీవితంలో అతని భార్య నేహా ఖేడేకర్ సరిగ్గా అదే చేసింది. ఇదంతా చూస్తుంటే వరుణ్ చక్రవర్తి క్రికెట్ ప్రయాణం ఒక సినిమాను తలపిస్తుంది. ఆర్కిటెక్ట్ నుంచి టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్‌గా ఎదిగిన ఆయన సక్సెస్ వెనుక ఒక అద్భుతమైన ప్రేమకథ, అంతకుమించిన త్యాగం దాగి ఉంది.

క్లాస్‌రూమ్ నుంచి మొదలైన ప్రయాణం

వరుణ్ చక్రవర్తి, నేహా ఖేడేకర్ల పరిచయం తమిళనాడులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మొదలైంది. చదువుకునే రోజుల్లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి.. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పట్లో వరుణ్ క్రికెట్‌ను కేవలం హాబీగా మాత్రమే చూసేవారు. చదువు పూర్తయ్యాక ఆయన ఒక ఆర్కిటెక్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్థిరమైన ఉద్యోగంలో చేరారు.

రిస్కీ నిర్ణయం.. సందిగ్ధంలో ప్రేమ!

ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నా వరుణ్ మనసంతా మైదానంపైనే ఉండేది. 25 ఏళ్ల వయసులో అంటే అందరూ కెరీర్‌లో సెటిల్ అయ్యే టైంలో ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి మళ్ళీ క్రికెట్ బాల్ పట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం. అటు కెరీర్ లేదు, ఇటు ఆదాయం లేదు. ఆ సమయంలో వరుణ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన భవిష్యత్తు అంధకారంలో ఉందని భావించి నేహాతో "నన్ను పెళ్లి చేసుకోవద్దు.. నా జీవితం ఎటు వెళ్తుందో తెలియదు" అని చెప్పారు. తన వల్ల ఆమె ఇబ్బంది పడకూడదని ఆమెను దూరం పెట్టాలని చూశారు.

'నేనున్నాను' అంటూ ఇచ్చిన భరోసా

కానీ నేహా ప్రేమ అంత బలహీనమైనది కాదు. వరుణ్ ఆర్థిక పరిస్థితిని చూసి ఆమె వెనకడుగు వేయలేదు. పైగా ఆయనకు ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు. "నీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు.. నేను సంపాదిస్తాను. మన ఇల్లు గడవడానికి నేను కష్టపడతాను. నువ్వు మాత్రం నీ కలను వదులుకోకు.. క్రికెట్ ఆడు." అంటూ ప్రోత్సహించింది. ఒక ఆర్కిటెక్ట్ భార్యగా సుఖపడటం కంటే తన భర్త కలను గెలిపించడమే గొప్పని ఆమె భావించింది. ఆమె ఇచ్చిన ఆ ధైర్యమే వరుణ్‌ను మైదానంలో స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా చేసింది.

ఐపీఎల్ స్టార్ నుంచి టీమ్ ఇండియా వరకు

నేహా నమ్మకాన్ని వరుణ్ వమ్ము చేయలేదు. తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఆపై ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున మెరిసి కోట్లు సంపాదించారు. 2020లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు టీమ్ ఇండియాలో కీలక బౌలర్‌గా ఎదిగి తన 'మిస్టరీ' స్పిన్‌తో ప్రపంచ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

ప్రేమ అంటే అండగా నిలవడమే!

వరుణ్ చక్రవర్తి విజయం కేవలం ఆయన కష్టమే కాదు, నేహా చూపిన నిశబ్ద పోరాటం కూడా. "ప్రేమ అంటే కేవలం కలిసి తిరగడం కాదు.. ఒకరి లక్ష్యం కోసం మరొకరు నిలబడటం" అని ఈ జంట నిరూపించింది. నేడు వరుణ్ వేసే ప్రతి వికెట్ వెనుక, నాడు నేహా చేసిన త్యాగం దాగి ఉందనడంలో అతిశయోక్తి లేదు.