బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ చారిత్రక శిక్షణా శిభిరం.. 6 ఎకరాల్లో ప్రపంచ ఆకర్షణగా!
బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ శకంలో పాపులరైన పెన్సిల్వేనియాలోని అతడి పురాతన శిక్షణా శిబిరం ప్రస్తుతం చారిత్రక కేంద్రంగా వెలుగొందుతోంది.
By: Sivaji Kontham | 19 Oct 2026 12:00 AM ISTబాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ శకంలో పాపులరైన పెన్సిల్వేనియాలోని అతడి పురాతన శిక్షణా శిబిరం ప్రస్తుతం చారిత్రక కేంద్రంగా వెలుగొందుతోంది. 2016లో మైక్ మాడెన్ అనే వ్యక్తి ఈ 6 ఎకరాల చారిత్రక స్థలాన్ని సుమారు 5,20,000 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. మహమ్మద్ అలీ జ్ఞాపకాలను .. ఆయన ప్రాముఖ్యతను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆయన ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం మైక్ మాడెన్ కేవలం కొనుగోలు చేయడంతో సరిపెట్టకుండా.. అక్కడున్న శిథిలమైన 13 లాగ్ బిల్డింగ్ల పునరుద్ధరణ కోసం మరో 1 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రాంగణాన్ని దాని అసలు రూపం చెక్కు చెదరకుండా చాలా జాగ్రత్తగా బాగు చేయించారు. అలీ చెమటోడ్చిన ఆ చారిత్రక ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ ప్రశంసనీయం.
అన్ని రకాల రెనోవేషన్ పనులు పూర్తయిన తర్వాత.. మైక్ మాడెన్ 2019లో ఈ 6 ఎకరాల చారిత్రక స్థలాన్ని `ఫైటర్స్ హెవెన్` పేరుతో అధికారికంగా తిరిగి ప్రారంభించారు. మహమ్మద్ అలీ తన బాక్సింగ్ కెరీర్లోని అత్యున్నత శిక్షణను ఇక్కడే పొందారనే విషయాన్ని స్మరించుకుంటూ.. ఈ ప్రాంతాన్ని బాక్సింగ్ అభిమానులు సందర్శించేలా తీర్చిదిద్దారు.
ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయానికి వేదికగా నిలిచిన ఈ శిబిరం.. నేడు కేవలం ఒక శిక్షణా కేంద్రం మాత్రమే కాకుండా ఒక ప్రముఖ పర్యాటక- చారిత్రక ప్రదేశంగా మారింది. మహమ్మద్ అలీ అభిమానులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చి ఇక్కడ ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
మహమ్మద్ అలీ వంటి లెజెండరీ క్రీడాకారుడి వారసత్వాన్ని సముచితంగా కాపాడుతూ.. మైక్ మాడెన్ తీసుకున్న ఈ చొరవ క్రీడా ప్రపంచంలో ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. `ఫైటర్స్ హెవెన్` రూపంలో అలీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచిన ఈ ప్రదేశం ఎప్పటికీ బాక్సింగ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
