Begin typing your search above and press return to search.

జెర్సీ నంబ‌ర్ 7... ఇక‌పై ఆ దిగ్గ‌జ ఆట‌గాడిది కాదు..?

స్పోర్ట్స్ లో కొన్ని నంబ‌ర్లు అత్యంత కీల‌కం. అయితే, అవి గ‌ణాంకాలుగా కాదు. ఆట‌గాళ్ల జెర్సీల కార‌ణంగా. దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన టెండూల్క‌ర్ జీవిత కాలం 10వ నంబ‌రు జెర్సీనే ధ‌రించాడు.

By:  Tupaki Political Desk   |   18 March 2026 3:29 PM IST
జెర్సీ నంబ‌ర్ 7... ఇక‌పై ఆ దిగ్గ‌జ ఆట‌గాడిది కాదు..?
X

స్పోర్ట్స్ లో కొన్ని నంబ‌ర్లు అత్యంత కీల‌కం. అయితే, అవి గ‌ణాంకాలుగా కాదు. ఆట‌గాళ్ల జెర్సీల కార‌ణంగా. దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన టెండూల్క‌ర్ జీవిత కాలం 10వ నంబ‌రు జెర్సీనే ధ‌రించాడు. అత‌డిని టెన్ డూల్క‌ర్ అని కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. ప‌దో నంబ‌రు ఫుట్ బాల్ లో డిగో మార‌డోనా, ల‌యోన‌ల్ మెస్సీ (అర్జెంటీనా) వంటి గొప్ప ఆట‌గాళ్లు ధ‌రిస్తుంటారు. దీన్నిబ‌ట్టి జ‌ట్టులోని అత్యంత ముఖ్య‌మైన ఆట‌గాడికి ఈ జెర్సీ కేటాయిస్తార‌ని తెలుస్తోంది. ఇక క్రికెట్ లో మ‌రో జెర్సీకి కూడా ప్రాధాన్యం ఉంది. అదే, గొప్ప కెప్టెన్, మేటి ఫినిష‌ర్, మెరుపు వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీది. అంద‌రూ.. సంకోచించే 7 నంబ‌రు అత‌డి జెర్సీపైకి వ‌చ్చాక గొప్ప నంబ‌రుగా మారింది. అస‌లు ఏడుతో మ‌రుపురాని అనుబంధం ఉంద‌ని ధోనీ చెబుతుంటాడు. తాను పుట్టింది జూలై (సంవ‌త్స‌రంలో ఏడో నెల‌) ఏడో తేదీన‌. 2007 టి20 ప్ర‌పంచ క‌ప్ గెలుపుతోనే అత‌డి పేరు మార్మోగింది. 2005లో టెస్టు జ‌ట్టులోకి వ‌చ్చాడు. అంతేకాదు.. ధోనీ ఫోన్ నంబ‌ర్లు, బైక్ నంబ‌ర్లు కూడా 7తోనే ఉంటాయ‌ట‌. అంత‌గా త‌న‌కు 7వ నంబరుతో అనుబంధం ఉంది. క్రికెట్ లోకి వ‌చ్చాక అది మ‌రింత బ‌ల‌ప‌డింది.

ఐపీఎల్ లోనూ అదే..

2008 తొలి సీజ‌న్ నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతున్న ధోనీ.. లీగ్ లోనూ త‌న జెర్సీ నంబ‌రు 7ను కొన‌సాగించాడు. 18 సీజ‌న్లుగా ఆడుతూ.. ఐదుసార్లు జ‌ట్టును చాంపియ‌న్ గా నిలిపాడు. అయితే, 19వ సీజ‌న్ లో మాత్రం ధోనీ జెర్సీ నంబ‌రు మారుతుంద‌ని తెలుస్తోంది. అత‌డు 8వ నంబ‌రు జెర్సీని ధ‌రించి మైదానంలోకి దిగుతాడ‌ని స‌మాచారం. ఈ మేర‌కు ధోనీ.. ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. కొన్ని నంబ‌ర్లు మ‌న‌తోనే ఉంటాయి. అలాంటివాటిలో 7 ఒక‌టి. కానీ, ఈరోజు నేను 8వ నంబ‌రుకు మారుతున్నా అంటూ ధోనీ రాసుకొచ్చాడు.

జ‌డేజాకు ట్రిబ్యూట్..

టీమ్ఇండియాలో ధోనీకి కోహ్లి, జ‌డేజా, సురేశ్ రైనాల‌తో మంచి స్నేహం ఉంది. వీళ్లంతా అత‌డిని కెప్టెన్ గా కాకుండా పెద్ద‌న్న‌గా చూస్తారు. జ‌డేజాతో ఐపీఎల్ లోనూ ధోనీ సుదీర్ఘ‌కాలంగా ఆడుతున్నాడు. అయితే, ఈ ఏడాది జ‌డేజా చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే)ను వ‌దిలి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్)కు వెళ్లిపోయాడు. అత‌డికి గుర్తుగానే ధోనీ 8వ నంబ‌రు ధ‌రిస్తాడ‌నే ఊహాగానాలు వ‌స్తున్నాయి. మ‌రికొంద‌రైతే.. ఇది కేవ‌లం బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం చేసిన ప‌ని అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.