కాగితంపై బ్రెజిల్ 'బ్రాండ్'.. మైదానంలో మొరాకో 'ట్రెండ్'.. ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్ చేసిన డ్రా మ్యాచ్
మ్యాచ్ మొదలయ్యాక బ్రెజిల్ ఒక గోల్ కొట్టగానే "ఇక మ్యాచ్ మన జేబులో ఉన్నట్టే" అని సంబరపడిపోయారు. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది.
By: A.N.Kumar | 14 Jun 2026 10:16 AM ISTఫుట్‌బాల్ ప్రపంచంలో కొన్ని జట్లకు ఒక రేంజ్ అహంకారం.. అంతకంటే పెద్ద అంచనాలు ఉంటాయి. మ్యాచ్ మొదలవ్వక ముందే ట్రోఫీ మాదే అన్నట్టు ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా జరిగిన బ్రెజిల్ వర్సెస్ మొరాకో మ్యాచ్ చూశాక "కాగితం మీద లెక్కలు కాదు బాబూ.. గ్రౌండ్‌లో ఆట ముఖ్యం" అని మొరాకో గట్టిగా చెంపదెబ్బ కొట్టినట్టు నిరూపించింది. మ్యాచ్‌కు ముందు బ్రెజిల్ అభిమానులు విజయోత్సవ ర్యాలీలకు రూట్ మ్యాప్ వేసుకుంటే మొరాకో ఫ్యాన్స్ మాత్రం "కనీసం గౌరవప్రదమైన ఓటమి వస్తే చాలు సామీ" అని దండాలు పెట్టుకుని ఉంటారు. కానీ మైదానంలో సీన్ చూశాక అందరి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఫిఫా ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్ ను నిలువరించి మొరాకో సంచలన ప్రదర్శన చేసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరోగోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1934 నుంచి ఇప్పటివరకూ 17 సార్లు బ్రెజిల్ ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచుల్లో విజయం సాధించింది. ఈసారి గెలుపు దక్కకపోవడం ఆ జట్టుకు షాక్ గానే చెప్పొచ్చు.
బ్రాండ్ బ్రెజిల్.. మరి అంత ధీమానా?
ఫిఫా చరిత్రలో బ్రెజిల్ అంటే ఒక బ్రాండ్, ఒక ఎమోషన్. స్టార్ ప్లేయర్లు, మెరుపు వేగంతో దాడులు, అద్భుతమైన బాల్ కంట్రోల్.. ఇవన్నీ చూసి ప్రత్యర్థులు మ్యాచ్‌కు ముందే సగం మ్యాచ్ ఓడిపోతారు. ఈసారి నెయ్‌మార్ లేకపోవడం కొంత లోటే అయినప్పటికీ, బ్రెజిల్ అభిమానుల్లో మాత్రం ఒకటే ధీమా "మొరాకోను ఓడించడానికి నెయ్‌మార్ దాకా ఎందుకు? మా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు చాలు " అనుకొని బహుశా ఈ అతివిశ్వాసమే వాళ్లను ముంచేసింది.
అది ఫుట్‌బాల్ మ్యాచ్‌నా? లేక డిఫెన్స్ ట్రైనింగ్ సెషనా?
మ్యాచ్ మొదలయ్యాక బ్రెజిల్ ఒక గోల్ కొట్టగానే "ఇక మ్యాచ్ మన జేబులో ఉన్నట్టే" అని సంబరపడిపోయారు. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. "పేరు పెద్దదైతే సరిపోదు బ్రదర్.. ఇక్కడ పట్టుదల ముఖ్యం" అన్నట్టు మొరాకో వెంటనే కౌంటర్ ఇచ్చి స్కోరు సమం చేసింది.
ఆ తర్వాత బ్రెజిల్ ప్లేయర్లు వరుసపెట్టి దాడులు చేస్తుంటే.. మొరాకో డిఫెండర్లు చైనా గోడలా అడ్డంగా నిలబడ్డారు. బ్రెజిల్ స్టార్ ప్లేయర్లు బాల్ పట్టుకుని గోల్‌పోస్ట్ వైపు వస్తుంటే మొరాకో డిఫెన్స్ చూసి.. "ఇది ఫుట్‌బాల్ మ్యాచ్‌నా లేక మాకు పెట్టిన డిఫెన్స్ ట్రైనింగ్ సెషనా?" అని తలలు పట్టుకున్నారు. ఎంత ట్రై చేసినా మొరాకో కోటను బద్దలు కొట్టడం బ్రెజిల్ వల్ల కాలేదు.
సోషల్ మీడియాలో 'నెయ్‌మార్' జపం
మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ నైతికంగా గెలిచింది మాత్రం మొరాకోనే. బ్రెజిల్ లాంటి దిగ్గజ జట్టును ముప్పుతిప్పలు పెట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక మ్యాచ్ ముగిశాక సోషల్ మీడియాలో బ్రెజిల్ ఫ్యాన్స్ కవర్ డ్రైవ్‌లు మొదలుపెట్టారు. "నెయ్‌మార్ ఉంటేనా.. ఐదు గోల్స్ వేసేవాళ్లం" అంటూ పాత రికార్డులు తీస్తున్నారు. కానీ క్రెడిట్ మొత్తం మొరాకోకే ఇవ్వాలి. కాగితాల మీద బలహీనంగా కనిపించినా మైదానంలో మాత్రం సింహంలా పోరాడి బ్రెజిల్ అహంకారాన్ని దించేశారు.
ఫుట్‌బాల్‌లో జెర్సీ మీద ఉన్న 'పేరు' చూసి మ్యాచ్‌లు గెలవలేరు. ఆ రోజు మైదానంలో ఎవరు గుండె పెట్టి ఆడారన్నదే ముఖ్యం. ఈ విషయంలో మొరాకో.. బ్రెజిల్‌కు జీవితాంతం గుర్తుంచుకునే గట్టి పాఠమే చెప్పింది!
