ట్రోఫీ పట్టుకుని మళ్ళీ 'నఖ్వీ' పరుగు పందెం? మహిళల ఆసియా కప్ ఫైనల్‌పై నెటిజన్ల కన్ను
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బాస్ అయిన మోసిన్ నఖ్వీ డ్రామా సిరీస్ రెండో సీజన్‌కు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు షురూ అయ్యాయి.
By: A.N.Kumar | 7 Sept 2026 3:16 PM ISTపాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బాస్ అయిన మోసిన్ నఖ్వీ డ్రామా సిరీస్ రెండో సీజన్‌కు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు షురూ అయ్యాయి. మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరు ముగిశాక.. ట్రోఫీ ప్రజెంటేషన్‌కు మన నఖ్వీ గారే చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారట.. ఈ వార్త వినగానే క్రికెట్ అభిమానులకు గతేడాది సీన్లన్నీ కళ్ళముందు రీల్ లాగా తిరుగుతున్నాయి.
కిందటేడు పురుషుల ఆసియా కప్ ముగిశాక జరిగింది గుర్తుండే ఉంటుంది. టీమ్ ఇండియా టైటిల్ కొట్టింది కానీ పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా కప్పు అందుకోవడానికి ససేమిరా అంది. బోర్డర్‌లో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఆట ఆటలాగే ఉంటుంది.. కానీ ఆ ట్రోఫీ అందుకోవడం మా వల్ల కాదు అని కుండబద్దలు కొట్టింది. అయితే అక్కడ అసలైన ట్విస్ట్ ఇచ్చారు నఖ్వీ గారు.. భారత్ ట్రోఫీని తీసుకోకపోతే ఏకంగా ఆ కప్పును తానొక్కడే ఇంటికి మోసుకెళ్లిపోయారు. అసలు అది ఏసీసీ ట్రోపీనా లేక ఆయన వ్యక్తిగత ప్రాపర్టీయా అన్నట్లు ఆ ట్రోఫీని వెంటబెట్టుకుని వెళ్లిపోవడం అప్పట్లో నవ్వుల పాలైంది.
ఇప్పుడు మళ్ళీ కథ మొదలైంది. సెప్టెంబర్ 13న జరగబోయే మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సెమీస్‌కు దూసుకెళ్లిన మన అమ్మాయిలు ఫైనల్ చేరి కప్పు కొడితే.. మళ్ళీ ప్రెజెంటేషన్ వేదికపై అదే సీన్ రిపీట్ అవుతుందా? అని క్రికెట్ ప్రియులు సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ భారత మహిళల జట్టు టైటిల్ గెలిచి.. నఖ్వీ గారి చేతుల మీదుగా కప్పు తీసుకోకపోతే.. ఈసారి ఆ ట్రోఫీని ఆయన ఏం చేస్తారు? పాత అలవాటు ప్రకారం మళ్ళీ విమానం ఎక్కించి లాహోర్ తీసుకెళ్తారా? లేక ఈసారి దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీస్‌లో కప్‌కు సెక్యూరిటీ గార్డ్‌లా పహారా కాస్తారా?
"భారత జట్టు గెలిస్తే ట్రోఫీ ఇచ్చేది లేదు.. దాచుకోవడమే మన పని" అన్నట్లు నఖ్వీ వ్యవహరిస్తున్న తీరును చూసి సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది. ఆసియా క్రికెట్‌ను నడిపించాల్సిన పెద్ద మనిషి.. ఇలా కప్పు పట్టుకుని డ్రామాలు ఆడటం ఒక్క నఖ్వీకే చెల్లిందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
నఖ్వీ గారు కనుక నిజంగానే ఫైనల్‌కు విచ్చేస్తే.. మ్యాచ్ కంటే కూడా ప్రజెంటేషన్ వేడుకలోనే అసలైన ‘కామెడీ అండ్ హై డ్రామా’ ఖాయమని స్పష్టమవుతోంది. ఈసారైనా ట్రోఫీ వేదికపైనే ఉంటుందా లేక మళ్ళీ నఖ్వీగారితో పాటు మాయమవుతుందో చూడాలి!
