ఆసియా కప్ దొంగ నఖ్వీ ఖేల్ ఖతం.. రేపటితో ఆఖరు!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ బాధ్యతల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఖేల్ ఖతం కానుంది..!
By: Tupaki Entertainment Desk | 6 Nov 2025 10:00 PM ISTఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ బాధ్యతల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఖేల్ ఖతం కానుంది..! అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సర్వసభ్య సమావేశంలో అతడి భవితవ్యం తేలిపోనుంది. ఆసియా కప్ ను ఎత్తుకెళ్లిన నఖ్వీ విషయమై ఇక తాడోపేడో తేల్చుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయానికి వచ్చింది. దీనంతటికి ముహూర్తం శుక్రవారమే. ఈ ఏడాదికి సంబంధించి మూడు రోజుల కిందట మొదలైన ఐసీసీ జనరల్ బాడీ (సర్వసభ్య) సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. కాగా, సాధారణంగా అయితే వీటికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు. అయితే, సెప్టెంబరు 28న రాత్రి టీమ్ఇండియా ఆసియా కప్ గెలిచాక ట్రోఫీని నఖ్వీ నుంచి తీసుకునేందుకు నిరాకరించింది. కశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా ఆ కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమ్ ఇండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేయలేదు. ఫైనల్లో గెలిచాక నఖ్వీ నుంచి కప్ తీసుకోలేదు. దీంతో అతడు కప్ ను ఎత్తుకెళ్లి తాను బస చేసిన హోటల్ లో పెట్టాడు. అనంతరం దుబాయ్ లోని ఏసీఏ ప్రధాన కార్యాలయంలో ఉంచాడు. తన అనుమతి లేకుండా ఎవరికీ ఆ గదిలోకి ప్రవేశం ఇవ్వొద్దని ఆదేశించాడు.
కప్ భారత జట్టు చేతికి అందేదెప్పుడు?
ఆసియా కప్ టీమ్ ఇండియా చేతికి వచ్చేది ఎప్పుడు? అనేది శుక్రవారం ఐసీసీ సమావేశాలు ముగిశాక తేలిపోనుంది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీని ఏసీఏ చైర్మన్ గా తప్పించడం కూడా కీలక అంశంగా మారనుంది. ఈ మేరకు బీసీసీఐ అభియోగాల జాబితా సిద్ధం చేసింది. పాక్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నఖ్వీ ఈ ఏడాది ఏప్రిల్ లో ఏసీఏ చైర్మన్ అయ్యాడు. అప్పటికే పీసీబీ చైర్మన్ కూడా. ఇది ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా బీసీసీఐ ఆరోపిస్తోంది.
పాక్ కొత్త శత్రువు మద్దతు..
ఇటీవలి కాలంలో ఉద్రిక్తతల రీత్యా పాకిస్థాన్ కు శత్రువుగా మారిన అఫ్ఘానిస్థాన్.. నఖ్వీపై చర్యల విషయంలో భారత్ కు మద్దతు ఇవ్వనుంది. నఖ్వీ ఏదో ఒక పదవిని వదులుకోవాలనేది అఫ్ఘాన్ డిమాండ్ గా ఉంది. కాగా, ఐసీసీ చైర్మన్ భారత్ కు చెందిన జై షా. దీంతో సమావేశాలకు నఖ్వీ హాజరు కావడంలేదు. శుక్రవారం కూడా వస్తాడన్న నమ్మకం లేదు. బీసీసీఐ ఆరోపణలకు పాకిస్థాన్ ప్రతినిధుల ద్వారా సమాధానం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, శుక్రవారం మాత్రం నఖ్వీ నేరుగా ఐసీసీ సమావేశాలకు వస్తాడని భావిస్తున్నారు. అప్పుడు చూడాలి.. ఏం జరుగుతుందో?
