Begin typing your search above and press return to search.

చీఫ్ సెల‌క్ట‌ర్ తో మాట మాట‌.. టీమ్ ఇండియా స్టార్ పేస‌ర్ కెరీర్ ఖ‌తం!

దేశానికి దొరికిన ఉత్త‌మ పేస‌ర్ల‌లో మొహ‌మ్మ‌ద్ ష‌మీ ఒక‌డు. జ‌హీర్ ఖాన్ త‌ర్వాత‌.. ఆ స్థానాన్ని స‌మ‌ర్ధంగా భ‌ర్తీ చేశాడు.

By:  Tupaki Entertainment Desk   |   11 Jan 2026 4:00 AM IST
చీఫ్ సెల‌క్ట‌ర్ తో మాట మాట‌.. టీమ్ ఇండియా స్టార్ పేస‌ర్ కెరీర్ ఖ‌తం!
X

టీమ్ ఇండియా విజేత‌గా నిలిచిన ఆ ఫైన‌ల్ మ్యాచే దేశం త‌ర‌ఫున అత‌డికి చివ‌రిది అవ‌నుందా..? ఎన్నోసార్లు జ‌ట్ట‌ను ఒంటిచేత్తో గెలిపించిన అత‌డి కెరీర్ అర్థంత‌రంగానే ముగియ‌నుందా..? ఇక భార‌త జ‌ట్టు జెర్సీలో అత‌డిని చూడ‌లేమా? ఫామ్ బాగున్నా.. త‌ర‌చూ గాయాల బారిన‌ప‌డ‌డం దెబ్బ‌కొట్టిందా? యువ పేస‌ర్లు దూసుకుని రావ‌డంతో ఇక చాలించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తిందా? వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. ఆ మేటి పేస‌ర్ దేశ‌వాళీల్లో ఎంత‌గా రాణిస్తున్నా సెల‌క్ట‌ర్లు క‌రుణించ‌డం లేదు. దీంతోనే అత‌డికి దారులు మూసుకుపోయిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇప్పుడు అదే రుజువు కూడా అవుతోంది.

ఆ ఫైన‌ల్.. ఈ ఫైన‌ల్..

దేశానికి దొరికిన ఉత్త‌మ పేస‌ర్ల‌లో మొహ‌మ్మ‌ద్ ష‌మీ ఒక‌డు. జ‌హీర్ ఖాన్ త‌ర్వాత‌.. ఆ స్థానాన్ని స‌మ‌ర్ధంగా భ‌ర్తీ చేశాడు. భువ‌నేశ్వర్ కుమార్, జ‌స్ప్రీత్ బుమ్రా, హైద‌రాబాదీ మొహ‌మ్మ‌ద్ సిరాజ్ త‌దిత‌రుల‌తో క‌లిసి భార‌త జ‌ట్టును గెలిపించాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో ష‌మీ ప్ర‌ద‌ర్శ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తుది జ‌ట్టులోకి ఆల‌స్యంగా వ‌చ్చినా ఆ టోర్నీ ఫైన‌ల్ వ‌ర‌కు ప్ర‌తి మ్యాచ్ లో ష‌మీ చెల‌రేగాడు. ఇక నిరుడు జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీలోనూ ష‌మీ మంచి ప్ర‌ద‌ర్శ‌నే చేశాడు. ఈ టోర్నీని టీమ్ ఇండియా గెల‌వడంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ త‌ర్వాత అత‌డు భార‌త జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు.

స‌న్ రైజ‌ర్స్ త‌ర‌ఫున నిరాశ‌ప‌ర్చి..

చాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత గ‌త ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో ష‌మీ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. రూ.10 కోట్లు పెట్టి తీసుకుంటే.. 9 మ్యాచ్ ల‌లో 6 వికెట్లు మాత్ర‌మే తీశాడు. దీంతో కొన్ని మ్యాచ్ ల‌కు ప‌క్క‌న‌పెట్టాల్సి వ‌చ్చింది. ఈ ఏడాది ష‌మీని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తీసుకుంది.

ఆ మాటలే దెబ్బ‌కొట్టాయా?

ష‌మీ దేశవాళీల్లో ఆడుతూ ఫిట్ నెస్, ఫామ్ నిరూపించుకుంటున్నా.. అత‌డిని జాతీయ జ‌ట్టులోకి ప‌రిగ‌ణించ‌డం లేదు. దీనిపై చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ గ‌తంలో ష‌మీ ఫిట్ నెస్ పై అనుమానాలు వ్య‌క్తం చేశాడు. అయితే, ఫిట్ నెస్ అప్ డేట్స్ ఇవ్వ‌డం త‌న ప‌నికాదంటూ ష‌మీ స్పందించాడు. ఈ మాట‌కు మాట‌తోనే అత‌డిని టీమ్ ఇండియాలోకి ప‌రిగ‌ణించ‌డం లేద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. నిరుటి ఆగ‌స్టు నుంచి ష‌మీ దేశ‌వాళీల్లో 19 మ్యాచ్ లు ఆడి 52 వికెట్లు తీశాడు. రంజీల్లో చాలా ఓవ‌ర్లు బౌలింగ్ చేశాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విజ‌య్ హ‌జారేలో 15 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కానీ, గాయాల ముప్పు ఉండ‌డంతో అత‌డిని జాతీయ సెల‌క్ట‌ర్లు విస్మ‌రిస్తున్నారు. అర్ష‌దీప్ సింగ్, హ‌ర్షిత్ రాణా, ప్ర‌సిద్ధ్ క్రిష్ణ వంటివారిపై న‌మ్మ‌కం ఉంచుతున్నారు. కానీ, వీరెవ‌రూ త‌మపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని పూర్తిస్థాయిలో నిల‌బెట్టుకోవ‌డం లేదు. అందుకే ష‌మీ గురించి ఆలోచించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. 35 ఏళ్ల ష‌మీ 64 టెస్టుల్లో 229 వికెట్లు, 108 వ‌న్డేల్లో 206 వికెట్లు, 25 టి20ల్లో 27 వికెట్లు తీశాడు.