కేరళ టూర్ క్యాన్సిల్.. హైదరాబాద్ కు మెస్సీ... ఏ రోజునంటే?
అర్జెంటీనాకు కొన్ని దశాబ్దాల తర్వాత... 2022లో జరిగిన ప్రపంచ కప్ సాధించి పెట్టాడు మెస్సీ.
By: Tupaki Entertainment Desk | 2 Nov 2025 8:44 AM ISTప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)గా భావించే అర్జెంటీనా కెప్టెన్ లయోనల్ మెస్సీ హైదరాబాద్ రానున్నాడు.. అభిమాలను అలరించనున్నాడు. ముందుగా అనుకున్న విధంగా.. ఫుట్ బాల్ ను విపరీతంగా అభిమానించే కేరళను కాదని మరీ మన భాగ్య నగరానికి వస్తున్నాడు ఈ దిగ్గజం. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామం ఫుట్ బాల్ అభిమానులకు పండుగే కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా అభిమానించే ఫుట్ బాల్ జట్టు (అర్జెంటీనా)కు కెప్టెన్ అయిన మెస్సీ భారత పర్యటనే పెద్ద సంచలనం అంటే.. అందులో హైదరాబాద్ రావడం మరింత సంచలనం. అతడు అసలు ఎందుకొస్తున్నాడు? ఎప్పుడు వస్తున్నాడు..?
కేరళలో జట్టు మ్యాచ్ క్యాన్సిల్..
అర్జెంటీనాకు కొన్ని దశాబ్దాల తర్వాత... 2022లో జరిగిన ప్రపంచ కప్ సాధించి పెట్టాడు మెస్సీ. దీంతోనే సమకాలీన ఆటగాడు పోర్చుగల్ కు చెందిన క్రిస్టియానో రొనాల్డోను దాటేసి గోట్ గా ఎదిగిపోయాడు. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీకి కూడా సిద్ధం అవుతున్నాడు. ఇలాంటి కీలక సమయంలో మెస్సీ పాన్ ఇండియా టూర్ చేయనున్నాడు. హైదరాబాద్ తో పాటు కోల్ కతా, ఢిల్లీ, ముంబైను సందర్శించనున్నాడు. వాస్తవానికి కేరళలో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఈ నెల 17న ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, అది రద్దయింది. దీనిని భర్తీచేస్తూ మెస్సీ హైదరాబాద్ పర్యటనను జోడించారు.
భారత దేశ నాలుగు మూలలు..
ఫుట్ బాల్ అంటే చెవి కోసుకునే, భారత దేశ తూర్పు నగరమైన కోల్ కతా, పశ్చిమాన ఉన్న ముంబై, ఉత్తర భారతంలోని ఢిల్లీతో పాటు దక్షిణాదిన హైదరాబాద్ లో మెస్సీ పర్యటించనున్నాడు. కేరళ టూర్ రద్దవడంతో దక్షిణాదిన ఉన్న ఫుట్ బాల్ అభిమానులు నిరుత్సాహం చెందకుండా మెస్సీ టూర్ లో హైదరాబాద్ ను చేర్చడం విశేషం. అదికూడా బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాలను కాదని మరీ హైదరాబాద్ కు చాన్సిచ్చారు.
మరి వచ్చేది ఎక్కడకు..? ఎప్పుడు?
డిసెంబరు 13న ప్రైవేట్ జెట్ లో కోల్ కతా వెళ్లే మెస్సీ అటునుంచి హైదరాబాద్ రానున్నాడు. ఆ రోజు గచ్చిబౌలి స్టేడియంలో కానీ, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో కానీ మెస్సీ మెరవనున్నాడు. ఈ ఈవెంట్ కు సంబంధించి వారం రోజుల్లో టికెట్ల బుకింగ్ మొదలుకానుంది. ఇక డిసెంబరు 14న ముంబై, 15న ఢిల్లీలో టూర్ చేస్తాడు. నాలుగు నగరాల్లోని మెస్సీ టూర్ లో సెలబ్రిటీ ఫుట్ బాల్ మ్యాచ్ లు, సంగీత కార్యక్రమాలు, పిల్లలకు ఫుట్ బాల్ క్లాస్ లు ఉండనున్నాయి. కాగా, ఈ ఫుట్ బాల్ దిగ్గజం 2011లోనూ భారత్ లో పర్యటించాడు. కానీ, అప్పటికి అతడు అంత పాపులర్ కాదు.
