ప్రపంచకప్ చరిత్రను తిరగరాసిన మెస్సీ.. చిన్న వయసులోనూ అతడే.. 38 ఏళ్లకూ అతడే
లియోనెల్ మెస్సీ... ప్రపంచ ఫుట్‌బాల్ సామ్రాజ్యంలో ఈ పేరు ఒక ప్రకంపన. మైదానంలో అతను అడుగుపెడితే రికార్డులు తిరగరాయాల్సిందే.
By: A.N.Kumar | 23 Jun 2026 10:18 AM ISTలియోనెల్ మెస్సీ... ప్రపంచ ఫుట్‌బాల్ సామ్రాజ్యంలో ఈ పేరు ఒక ప్రకంపన. మైదానంలో అతను అడుగుపెడితే రికార్డులు తిరగరాయాల్సిందే. తాజాగా జరుగుతున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా దిగ్గజం మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ 38 ఏళ్ల వయసులోనూ తన అద్భుతమైన ఫామ్‌తో ప్రపంచకప్ చరిత్రను పూర్తిగా తిరగరాశాడు. తానే సృష్టించిన ప్రమాణాలను తానే బద్దలు కొడుతూ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో సరికొత్త మైలురాళ్లను అందుకున్నాడు.
సాధారణంగా ఫుట్‌బాల్ లాంటి అత్యంత వేగవంతమైన ఆటలో 30 ఏళ్లు దాటితేనే ఆటగాళ్లలో మునుపటి వేగం తగ్గడం చూస్తుంటాం. కానీ మెస్సీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. కెరీర్ ప్రారంభంలో... అతి పిన్న వయసులోనే ప్రపంచాన్ని తన ప్రతిభతో ఆశ్చర్యపరిచిన మెస్సీ, అప్పట్లో ఫిఫా ప్రపంచకప్‌లో గోల్ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అదే మెస్సీ 38 ఏళ్ల వయసులో ప్రపంచకప్‌లో గోల్ చేసిన అత్యంత పెద్ద వయసు గల స్టార్‌గా నిలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఆటగాడు తన కెరీర్ ఆరంభంలోనూ.. ముగింపు దశలోనూ ఇలాంటి అరుదైన మైలురాళ్లను అందుకోవడం ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం.
క్లోస్ రికార్డు బద్దలు.. ఆస్ట్రియాపై అర్జెంటీనా విజయం
ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వరుస విజయాలతో దూసుకుపోతోంది. టెక్సాస్‌లోని డాలస్ స్టేడియంలో ఆస్ట్రియా జట్టుతో జరిగిన గ్రూప్-జే మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఆ రెండు గోల్స్ కూడా మెస్సీ బూట్ నుంచే రావడం విశేషం. మ్యాచ్ 38వ నిమిషంలో మెస్సీ చేసిన మొదటి గోల్‌తో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోస్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును అధిగమించిన మెస్సీ, ఆ తర్వాత మ్యాచ్‌లో మరో గోల్ చేసి తన మొత్తం ప్రపంచకప్ గోల్స్ సంఖ్యను 18కి చేర్చాడు.
లెజెండ్స్ సరసన మెస్సీ.. ఆగని గోల్స్ ప్రవాహం
ఈ ప్రపంచకప్‌లో మెస్సీ సృష్టిస్తున్న సునామీ అంతటితో ఆగలేదు. ప్రపంచకప్‌ల్లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గోల్ చేసిన మూడో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. ఇంతకుముందు ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్ ఫాంటైన్, బ్రెజిల్ లెజెండ్ జైర్‌జిన్హో మాత్రమే ఈ అసాధారణ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ అరుదైన దిగ్గజాల జాబితాలో మెస్సీ కూడా చేరిపోయాడు. మొదటి మ్యాచ్ లో అద్భుతమైన హ్యాట్రిక్ గోల్స్ తో పాటు రెండో మ్యాచ్ లో ఆస్ట్రియాపై డబుల్ స్ట్రైక్ తో రెండు గోల్స్ సాధించాడు.
రికార్డుల కోసమే మెస్సీ
ప్రపంచ ఫుట్‌బాల్‌లో ప్రతిభకు, అంకితభావానికి, నిలకడకు నిలువెత్తు రూపం లియోనెల్ మెస్సీ. వయసు పెరుగుతున్నా కొద్దీ తన క్లాస్ గేమ్ ప్రదర్శిస్తూ మిగతా ఫుట్‌బాల్ దిగ్గజాలందరికంటే విలక్షణంగా నిలుస్తున్నాడు. తన కెరీర్ ముగింపు దశలో కూడా కొత్త చరిత్రలు రాస్తున్న ఈ ఫుట్‌బాల్ దేవుడిని చూసి అభిమానులు గర్వంగా ఒక్కటే మాట అంటున్నారు... "రికార్డులు మెస్సీ కోసం పుడతాయి.. వాటిని బద్దలు కొట్టేది కూడా ఆ మెస్సీయే!"
