హార్దిక్ పాండ్యాతో విభేదాలపై తొలిసారి స్పందించిన అన్న కృనాల్ పాండ్య
భారత క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న సోదరులు అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య.
By: A.N.Kumar | 22 April 2026 3:56 PM ISTభారత క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న సోదరులు అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య. మైదానంలో వీరిద్దరూ కలిసి ఉన్నా.. ప్రత్యర్థులుగా తలపడినా ఆ జోష్ వేరేలా ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయని.. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చాయి. తాజాగా ఈ వార్తలపై కృనాల్ పాండ్య తనదైన శైలిలో స్పందించి రూమర్లకు చెక్ పెట్టారు.
వివాదానికి కారణమైన ఆ వీడియో ఏమిటి?
ఇటీవల ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్య అవుటైన తర్వాత అవతలి జట్టులో ఉన్న కృనాల్ పాండ్య పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. సాధారణంగా సోదరుడు అవుటైనప్పుడు ఎవరైనా కొంత నిరాశ చెందుతారు, కానీ కృనాల్ అత్యుత్సాహంతో సెలబ్రేషన్స్ చేసుకోవడం.. అతడిని సీరియస్‌గా చూస్తూ హార్దిక్ డగౌట్‌కు వెళ్లడం నెటిజన్ల కంటపడింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో "వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.. అందుకే ఒకరి వికెట్‌ను మరొకరు అంతలా ఎంజాయ్ చేస్తున్నారు" అంటూ నెట్టింట చర్చ మొదలైంది.
మిస్టర్ నాగ్స్ షోలో అసలు నిజం వెల్లడి
ఈ వివాదంపై స్పష్టతనిచ్చే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూపొందించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ వేదికగా నిలిచింది. ప్రసిద్ధ హోస్ట్ డానిష్ సైత్ (మిస్టర్ నాగ్స్) తన సరదా ప్రశ్నలతో కృనాల్‌ను పలకరించారు. "కుటుంబంలో ఒకరు లేకపోతే ఆ లోటు కనిపిస్తుంది కదా" అని నాగ్స్ అడగ్గా.. కృనాల్ అవునని సమాధానమిచ్చాడు. వెంటనే నాగ్స్ అందుకొని "మరి మీ సోదరుడి విషయంలో కూడా అదే జరుగుతోందా? మీ ఇద్దరి మధ్య బంధం బాగుందా లేక డబ్ల్యూడబ్ల్యూఈ లో కేన్ , అండర్ టేకర్ లాగా ఫైటింగ్ చేసుకుంటున్నారా?" అని నేరుగా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కృనాల్ ఎంతో హుందాగా స్పందించాడు. మాటల కంటే తన సంజ్ఞ ద్వారా సమాధానం చెప్పడం విశేషం. ఆయన నవ్వుతూ 'థంబ్స్ అప్' చూపిస్తూ తమ మధ్య అంతా సవ్యంగానే ఉందని, సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పారు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయత ఎప్పటికీ తగ్గదని ఆయన సంకేతమిచ్చారు.
స్లెడ్జింగ్ ఆరోపణలపై వివరణ
కేవలం సోదరుడితో గొడవలే కాకుండా మైదానంలో యువ ఆటగాళ్లను కృనాల్ వేధిస్తున్నాడనే స్లెడ్జింగ్ విమర్శలపై కూడా ఆయన స్పందించారు. ముఖ్యంగా లక్నో యువ ఆటగాడు ముకుల్ చౌదరిని తాను విమర్శించలేదని స్పష్టం చేశారు. "నేను అతడికి బౌలింగ్ చేస్తున్నప్పుడు తొలి బంతి ప్యాడ్స్‌కు తగిలితే అప్పీల్ చేశాను. ఆ తర్వాత సరదాగా.. 'ముకుల్, నువ్వు కుర్రాడివి, నా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టగలవు. కాకపోతే లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించు' అని మాత్రమే అన్నాను. అది కేవలం ఒక సీనియర్ ప్లేయర్ జూనియర్‌తో చేసిన సరదా సంభాషణ మాత్రమే. నా ముఖ కవళికలు చూసి నేను సీరియస్ వ్యక్తిని అని.. కోపమెక్కువ అని చాలామంది అనుకుంటారు, కానీ నేను అలా ఉండను" అని కృనాల్ వెల్లడించాడు.
క్రికెట్ ప్రపంచంలో ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై ముఖ్యంగా పాండ్య సోదరుల వంటి సెలబ్రిటీల మీద రూమర్స్ రావడం సర్వసాధారణం. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో లేదా మైదానంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను భూతద్దంలో చూడకూడదని కృనాల్ మాటల ద్వారా అర్థమవుతోంది. హార్దిక్ ప్రదర్శనపై వస్తున్న విమర్శలు ఒకెత్తయితే, వారి కుటుంబ బంధంపై వస్తున్న వార్తలు మరొకెత్తు. కృనాల్ ఇచ్చిన ఈ క్లారిటీతో పాండ్య బ్రదర్స్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో వాస్తవం కాదని.. మైదానం బయట వారిద్దరూ ఇప్పటికీ ప్రాణప్రదమైన సోదరులని మరోసారి స్పష్టమైంది.
